Janhvi Kapoor: మా నాన్న ఏం చెప్పారో నాకు తెలియదు, ఆ విషయంలో ఇంకా సిగ్గుపడుతున్నాను - జాన్వీ కపూర్
Janhvi Kapoor: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్.. త్వరలోనే రామ్ చరణ్, సూర్యలతో సినిమాలు చేస్తుందని తన తండ్రి ప్రకటించాడు. ఈ విషయంపై క్లారిటీ ఇవ్వడంతో పాటు దేవర గురించి కూడా చెప్పుకొచ్చింది జాన్వీ.
Janhvi Kapoor: గత కొన్నేళ్లలో టాలీవుడ్ మార్కెట్ కూడా విపరీతంగా పెరిగింది. దీంతో బాలీవుడ్‌లోని స్టార్ హీరోయిన్లు మాత్రమే కాదు.. యంగ్ హీరోయిన్లు సైతం తెలుగులో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఏదైనా ఆఫర్ వస్తే కాదనుకుండా ఓకే చెప్పేస్తున్నారు. అలాగే జాన్వీ కపూర్ కూడా ఎన్‌టీఆర్ సరసన నటించనున్న ‘దేవర’తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుంది. ఇప్పటికే ఈ మూవీ నుండి తన ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు మేకర్స్. ‘దేవర’లో తను హీరోయిన్‌గా నటిస్తుందని అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుండి ప్రతీ ఇంటర్వ్యూలో తనకు ఈ సినిమాకు సంబంధించిన ప్రశ్నలే ఎదురవుతున్నాయి. ఇక తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో తెలుగు నేర్చుకోవడంపై జాన్వీ స్పందించింది.
దేవర టీమ్ సహాయపడింది..
‘దేవర’ చిత్రంలో జాన్వీ కపూర్.. తంగమ్ అనే పాత్రలో కనిపించనుంది. పల్లెటూరి పిల్లగా, అచ్చమైన తెలుగమ్మాయిగా జాన్వీ ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంది. తాజాగా పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విశేషాలను పంచుకుంది ఈ భామ. ‘‘నేనెప్పుడూ తెలుగు నేర్చుకోలేదు. ఆ విషయంలో ఇప్పటికీ సిగ్గుపడుతున్నాను. మామూలుగా వింటుంటే అర్థం చేసుకోగలను. కానీ మాట్లాడలేను. నేను బాధపడే విషయాల్లో అది కూడా ఒకటి. ఇలా నేర్చుకోవాలి అనే ఆలోచన నాలో చాలాకాలంగా లేదు. కానీ దేవర టీమ్ మాత్రం చాలా ఓపికగా నాకు సహాయపడుతున్నారు. వారంతా పెద్ద స్టార్స్‌తో పనిచేస్తున్నా కూడా నా డైలాగుల విషయంలో నాకు సాయం చేయడం కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు’’ అని ‘దేవర’ టీమ్ చేస్తున్న సాయం గురించి చెప్పుకొచ్చింది జాన్వీ కపూర్.
బోనీ కపూర్ అనౌన్స్‌మెంట్‌పై క్లారిటీ..
ఎన్‌టీఆర్‌తో చేస్తున్న ‘దేవర’ విడుదల అవ్వకముందే సూర్య, రామ్ చరణ్ లాంటి స్టార్లతో కూడా జాన్వీ నటించనుందని తన తండ్రి బోనీ కపూర్.. ఒక ఇంటర్వ్యూలో ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ అంతా సంతోషం వ్యక్తం చేశారు. ఈ విషయంపై కూడా జాన్వీ స్పందించింది. ‘‘మా నాన్న వెళ్లి ఏదో అనౌన్స్‌మెంట్ ఇచ్చేశారు. ఆయన ఏం చెప్పారో కూడా నాకు సరిగ్గా తెలియదు. నాన్న నాతో గానీ, నిర్మాతలతో గానీ ఏమీ మాట్లాడలేదని నేను కచ్చితంగా చెప్పగలను. అప్పుడప్పుడు కేవలం షూటింగ్స్ మాత్రమే చేసుకుంటూ ఏ అనౌన్స్‌మెంట్, క్లారిటీ లాంటివి లేని ప్రపంచంలోకి వెళ్లిపోతే బాగుంటుంది అనిపిస్తుంది’’ అని బోనీ కపూర్ ఇచ్చిన ప్రకటన గురించి వ్యాఖ్యలు చేసింది.
వరుసగా వాయిదాలు..
హిందీలో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో దూసుకుపోతున్న సమయంలోనే జాన్వీ కపూర్‌కు టాలీవుడ్ నుండి పిలుపు వచ్చింది. ఎన్‌టీఆర్‌తో చేస్తున్న ‘దేవర’ విడుదల అయితే తనకు టాలీవుడ్‌లో కూడా గుర్తింపు వస్తుందని ఎదురుచూస్తున్న జాన్వీకి ప్రతీసారి నిరాశే ఎదురవుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ వెళ్తుంది. ఇప్పుడు ఏకంగా ఈ మూవీ రిలీజ్ ఆరు నెలలు పోస్ట్‌పోన్ అయ్యింది. దీంతో ఎన్‌టీఆర్ ఫ్యాన్స్‌తో పాటు జాన్వీ ఫ్యాన్స్ కూడా ఫీల్ అవుతున్నారు. ప్రస్తుతం జాన్వీ చేతిలో మూడు హిందీ చిత్రాలు ఉండగా.. అవన్నీ ఈ ఏడాదిలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. వాటితో పాటు ‘దేవర’ కూడా ఇదే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: నా వయస్సు ఇంకా 23 - సమంత పోస్ట్ వైరల్, ఆమె బరువెంతో తెలిస్తే షాకవుతారు