Tollywood For BJP: తెలుగు సినిమా కాషాయం కప్పుకుంటోందా? టాలీవుడ్‌ను వాడుకుంటున్న బీజేపీ?
వీర్ సావర్కర్ కథతో మూవీ నిర్మిస్తున్న చెర్రీ. మరో నిర్మాతగా ‘కశ్మీర్‌ఫైల్స్’, ‘వ్యాక్సిన్‌వార్’ ప్రొడ్యూసర్. RSS కోసం కథ రాస్తున్న విజయేంద్ర ప్రసాద్. ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తోంది?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఓ కొత్త ప్రొడక్షన్ హౌస్ ను స్టార్ట్ చేశాడు. యూవీ క్రియేషన్స్ విక్రమ్‌తో కలిసి V Mega పేరుతో బ్యానర్ స్టార్ట్ చేసి నిఖిల్ హీరోగా, అనుపమ్ ఖేర్ కీ రోల్ లో ది ‘ఇండియా హౌస్’ అనే సినిమాను అనౌన్స్ చేశాడు. ఇప్పటికే కొణిదెల ప్రొడక్షన్ హౌస్ ఉండి తన తండ్రితో ‘ఖైదీ నెంబర్ 150’, ‘సైరా’ సినిమాలు తీసిన చరణ్.. ఉన్నపళంగా రెండోది ఎందుకు స్టార్ట్ చేశాడనేది హాట్ టాపిక్.
దీనికి కొద్ది కాలం ముందు నుంచి చరణ్ నాన్ మూవీ ఈవెంట్స్ కు గెస్ట్ గా వెళ్తున్నారు. ‘RRR’ ఆస్కార్ ఈవెంట్ తర్వాత నేరుగా ఇండియాకు వచ్చి చిరంజీవితో కలిసి అమిత్ షాను కలిశారు. ఆ తర్వాత జీ20 సదస్సు కోసం టాలీవుడ్ నుంచి చరణ్ ను గెస్ట్ గా ఇన్వైట్ చేశారు సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి. అంతకంటే ముందు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కోసం వచ్చిన ప్రధాని మోదీ ఆ సభకు గెస్ట్ గా చిరంజీవిని ఇన్వైట్ చేశారు. మరెవ్వరికీ ఆహ్వానం లేదు. ఇవన్నీ వేరు వేరు ఈవెంట్స్ అయినా చరణ్, చిరంజీవి, బీజేపీ అనే పాయింట్ కీలకం. బీజేపీ అజెండాను, హిందూత్వ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే బలమైన శక్తిగా బీజేపీ చరణ్ ను భావిస్తుందా. అందుకే బీజేపీ కి కావాల్సిన వీరసావర్కర్ కథను రామ్ చరణ్ ప్రొడ్యూసర్ గా తీస్తున్నారా. ఇదంతా పాయింట్ నెంబర్ 1.
పాయింట్ నెంబర్ 2
నిఖిల్, అనుపమ్ ఖేర్. ఈ కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రామ్ చరణ్ తీస్తున్న వీరసావర్కర్ కథలో నిఖిల్, అనుపమ్ ఖేరే కీలకపాత్రలు. అంతకు ముందు నిఖిల్ దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ‘కార్తికేయ 2’ సినిమా లోనూ నిఖిల్-అనుపమ్ ఖేరే కీలకపాత్రలు. ఈ రెండూ కాకుండా మరో స్పై థ్రిల్లర్ లో కూడా యాక్ట్ చేస్తున్నారు. అదే నేతాజీ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ.. పేరు ‘స్పై’. ‘కార్తికేయ 2’ తర్వాత నిఖిల్ ప్యాన్ ఇండియాలో చేస్తున్న సినిమాలన్నీ జాతీయవాద అంశాలే. బీజేపీ బలంగా వినిపించే హిందూత్వ, జాతీయ వాద నినాదాలే.
పాయింట్ నెంబర్ 3
పై రెండు పాయింట్స్ కి ఓ కామన్ పాయింట్. తెలుగు ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్. నిఖిల్-అనుపమ్ ఖేర్ తో కలిసి కార్తీకేయ 2 తీసిన అభిషేక్ అగర్వాలే...రామ్ చరణ్ తో కలిసి వీరసావర్కర్ కథను నిఖిల్-అనుపమ్ ఖేర్ తోనే తీస్తున్నారు. ఈ అభిషేక్ అగర్వాలే...అనుపమ్ ఖేర్ కీలకపాత్రలో కశ్మీర్ ఫైల్స్ తీసి దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఆ తర్వాత ‘కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రితో కలిసి ఇప్పుడు ‘వ్యాక్సిన్ వార్’ అనే సినిమా తీస్తున్నారు అభిషేక్ అగర్వాల్. కొవిడ్ టైమ్ లో మన దేశంలో వ్యాక్సిన్ రిలీజ్ కాకుండా వేరే దేశాలు ఎలాంటి కుట్రపన్నాయి దాన్ని ఇండియన్ గవర్నమెంట్ ఎలా ఛేదించింది అనేది కథ. దాన్ని ప్రొడ్యూస్ చేస్తున్న అభిషేక్ అగర్వాలే.. ఇప్పుడు రామ్ చరణ్ తీస్తున్న సావర్కర్ కథకు కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్.
పాయింట్ నెంబర్ 4
రాజమౌళి RRR ను తొలుత అడ్డుకుంటామని తెలంగాణ బీజేపీ హడావిడి చేస్తే.. అది సక్సెస్ సాధించిన తర్వాత రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ను బీజేపీ ఏకంగా ఎంపీని చేసి రాజ్యసభకు పంపించింది. కీరవాణికి ఎప్పటినుంచో రావాల్సి ఉన్నా రాని పద్మపురస్కారంతో గౌరవించింది. ఇప్పుడు విజయేంద్రప్రసాద్ RSS సినిమా కోసం ఓ కథ రాస్తున్నారు. దాని కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నానంటూ రాజమౌళి కూడా చెప్పారు.
పాయింట్ నెంబర్ 5
జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ, నితిన్ తో జేపీ నడ్డా భేటీ. వీటికి కారణాలేంటో ఎవరికి తెలియదు. ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీకి రాజకీయ కారణం ఉందనుకున్నా.. నితిన్ తో జేపీ నడ్డా సమావేశానికి కారణం ఏంటనేది తెలియదు. నితిన్ ను కాదు నిఖిల్ కలవాలనుకున్నారు. కానీ కన్ఫ్యూజన్ లో నితిన్ ను పిలిచారు అని వార్తలు కూడా వచ్చాయి. సో ఈ పాయింట్స్ అన్ని కలిపితే... స్పష్టమయ్యేది ఒకటే.. దేశంలో బీజేపీ ఐడియాలజీని.. వాళ్లకున్న థాట్స్ ను... వాళ్ల సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లటానికి టాలీవుడ్ ను అస్త్రంలా ఉపయోగించాలనుకుంటున్నారు. అది మంచిదా కాదా అని చెప్పటం మా ఉద్దేశం కాదు. టాలీవుడ్ పై బీజేపీ స్పెషల్ కాన్సస్ట్రేషన్ చేసింది అనే విషయం మాత్రం స్పష్టం.
Read Also : అనాథ పిల్లల కోసం ఇంటర్నేషనల్ స్కూల్ - మరో మంచి పనికి సోనూసూద్ శ్రీకారం