సమంతపై పెరుగుతోన్న నెగిటివిటీ - ఆ వ్యాఖ్యలే కారణమా?
సమంత ప్రస్తుతం తన 'శాకుంతలం' విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అయితే సినిమా ప్రమోషన్స్ లో తన వ్యక్తిగత జీవితం, ఆరోగ్య సమస్యల గురించి ఎక్కువగా మాట్లాడుతుండటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సౌత్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత రూత్ ప్రభు ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా గడుపుతోంది. గతేడాది 'యశోద' వంటి పాన్ ఇండియా చిత్రంతో అలరించిన సామ్.. ఇప్పుడు మైథలాజికల్ డ్రామా 'శాకుంతలం'తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఇటీవల కాలంలో ఆమె తన సినిమాల కంటెంట్ తో కంటే ఇంటర్వ్యూలలో చెప్పే మాటలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది.
గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో నటించిన 'శాకుంతలం' సినిమా ఏప్రిల్ 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా చిత్ర బృందంతో కలసి ప్రమోషన్స్ లో పాల్గొంటోంది. ఇందులో భాగంగా తన పర్సనల్ లైఫ్ గురించి, తన సమస్యల గురించి చెబుతూ వస్తోంది. అయితే సినిమా విశేషాలు చెప్పకుండా, వ్యక్తిగత విషయాలతో సింపతీ గెయిన్ చేసే ప్రయత్నం చేస్తోందని.. అది తెలుగు సినీ అభిమానులకు నచ్చడం లేదనే కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
హీరో అక్కినేని నాగచైతన్య ను ప్రేమ వివాహం చేసుకున్న సమంత.. నాలుగేళ్లు తిరక్కుండానే వైవాహిక బంధానికి స్వస్తి పలికిన సంగతి అందరికి తెలిసిందే. పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నట్లు ఇద్దరూ ప్రకటించారు. అప్పటి నుంచి వేర్వేరు మార్గాల్లో ప్రయాణం సాగిస్తున్నారు. ఇప్పటికే విడాకులపై చై - సామ్ పలు సందర్భాల్లో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. తన మాజీ భర్తతో విడిపోయి ఏడాదిన్నర దాటిపోయినా సామ్ ఇప్పటికీ ఏదొక సందర్భంలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో విడాకుల గురించి ప్రస్తావిస్తూ వస్తోంది.
ఇక సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు గతేడాది చివర్లో వెల్లడించింది. అదే సమయంలో రిలీజ్ కు రెడీ అయిన 'యశోద' సినిమా ప్రమోషన్స్ లో ఆమె ఆరోగ్య సమస్యల గురించే ఎక్కువ చర్చ జరిగింది. ఓ ఇంటర్వూలో తన మానసిక స్థితి గురించి చెబుతూ సామ్ భావోద్వేగానికి గురైంది. దీంతో సినిమా కంటెంట్ ను పక్కన పెట్టి, ఆమె పట్ల అందరిలో సానుభూతి మొదలైంది. ఇది ‘యశోద’కు ఎంతో కొంత హెల్ప్ అయిందనే టాక్ ఉంది.
ఇప్పుడు 'శాకుంతలం' సినిమా విడుదలకు సిద్ధమైన తరుణంలో, సామ్ ప్రతీ ప్రెస్ మీట్ లో తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ వస్తోంది. రెండేళ్లలో చాలా జరిగాయని.. ఊహించని పరిణామాలు చోటచేసుకున్నాయని.. జీవితంలో ఎదురయ్యే వైఫల్యాలే గొప్ప పాఠాలను నేర్పుతాయని ఇటీవల ఓ సందర్భంలో తెలిపింది.
అలానే వైవాహిక బంధంలో తాను నిజాయితీగా ఉన్నానని, వర్కౌట్ అవ్వలేదని సమంత చెప్పినట్లుగా నేషనల్ మీడియాలో వార్తలు వచ్చాయి. చైతూ డేటింగ్ రూమర్స్ పైనా స్పందించినట్లుగా నివేదికలు వచ్చాయి. అయితే ఆ మాటలు తాను అనలేదని నటి సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చింది. అయినప్పటికీ అలాంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవడం వెనుక సామ్ టీమ్ ఉందని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఏదైతేనేం సినిమా రిలీజ్ కు ముందు ఇలా ఆమె వ్యక్తిగత జీవితం, ఆరోగ్య సమస్యలు హైలైట్ అవుతుండటం.. సమంతపై వ్యతిరేకతకు దారి తీస్తుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, ఇటీవల 'శాకుంతలం' 3డీ పెయిడ్ ప్రీమియర్స్ ప్రదర్శించారు. అయితే దీనికి ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన వచ్చినట్లు సోషల్ మీడియా కామెంట్స్ ను బట్టి అర్థమవుతోంది. అలాగే శకుంతల పాత్రకు సమంత అస్సలు నప్పలేదని, ఆమె ప్లేస్ లో అనుష్క ఉంటే బాగుండేదని టాక్ కూడా వచ్చింది. ఈ చిత్రానికి నెగెటివ్ రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో, మీడియా షోని క్యాన్సిల్ చేయడమే కాదు.. సమంత చేయాల్సిన కొన్ని ప్రమోషన్ కార్యక్రమాలను రద్దు చేసినట్లుగా ఊహాగానాలు వినిపించాయి. కానీ సామ్ మాత్రం తనకు ఆరోగ్యం బాగలేకపోవడం వల్లనే ప్రమోషన్స్ కు రావడం లేదని స్పష్టత ఇచ్చింది.
"ఈ వారం అంతా మీ మధ్య ఉండి నా సినిమాని ప్రమోట్ చేస్తూ, మీ ప్రేమలో మునిగితేలుతున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. దురదృష్టవశాత్తూ తీవ్రమైన షెడ్యూల్స్ , ప్రమోషన్ల కారణంగా నేను జ్వరంతో బాధ పడాల్సి వచ్చింది. నేను నా వాయిస్ ని కోల్పోయాను. దయచేసి ఈ సాయంత్రం MLRIT ఈవెంట్ లో శాకుంతలం టీమ్ లో చేరండి... మిమ్మల్ని మిస్ అవుతున్నాను" అని సమంత ట్వీట్ లో పేర్కొంది.
(1/2)I was really excited to be amongst you all this week promoting my film and soaking in your love.
— Samantha (@Samanthaprabhu2) April 12, 2023
Unfortunately the hectic schedules and promotions have taken its toll, and I am down with a fever and have lost my voice.