Mahesh On Hunt : 'గజినీ' టైపులో 'హంట్' ఉంటుందా? - ఇదిగో మహేష్ క్లారిటీ
'హంట్'లో సుధీర్ బాబు మెమరీ లాస్ అయిన పోలీస్ ఆఫీసర్ రోల్ చేశారు. మెమరీ లాస్ అంటే ప్రేక్షకులకు గుర్తొచ్చే సినిమాల్లో 'గజినీ' ఒకటి. ఆ సినిమాకు, 'హంట్'కు సంబంధం ఉందా? ఈ ప్రశ్నకు మహేష్ ఏం చెప్పారంటే...
రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న తెలుగులో విడుదల అవుతున్న సినిమాలు ఏమిటి? అని చూస్తే... సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన 'హంట్' సినిమా (Hunt Movie) గుర్తుకు వస్తుంది. ఆల్రెడీ టీజర్, ట్రైలర్ విడుదల అయ్యాయి. సినిమా కాన్సెప్ట్ ఏమిటనేది ఆ రెండిటిలో చెప్పేశారు.
అర్జున్ పాత్రలో హీరో సుధీర్ బాబు (Sudheer Babu) నటించారు. అతడు ఓ పోలీస్ ఆఫీసర్. అసిస్టెంట్ కమిషనర్. ఓ యాక్సిడెంట్ కారణంగా గతం మర్చిపోతాడు. ఆ యాక్సిడెంట్ అవ్వడానికి ముందు తన తోటి ఐపీఎస్ అధికారి మర్డర్ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తుంటాడు. మెమరీ లాస్ తర్వాత మళ్ళీ ఆ కేసు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఎలా సాల్వ్ చేశాడనేది సినిమా. మెమరీ లాస్ అంటే సౌత్ ఇండియన్ ఆడియన్స్ మైండులో ముందు మెదిలే సినిమా 'గజినీ'. ఆ సినిమాకు, 'హంట్'కు ఏమైనా సంబంధం ఉందా? అని ప్రశ్నిస్తే... దర్శకుడు మహేష్ ఏం చెప్పారంటే?
'గజినీ'లో టెంపరరీ మెమరీ లాస్...
మా 'హంట్'లో మెమరీ లాస్ వేరే!
''హీరో మెమరీ లాస్ కాన్సెప్టుతో కొన్ని సినిమాలు వచ్చాయి. గతం మర్చిపోవడానికి ముందు, వెనుక... ఏం జరిగింది? అనేది డ్రామా. మా 'హంట్'లో ఆ డ్రామా పూర్తిగా కొత్తగా ఉంటుంది. మా కథ డిఫరెంట్. మెమరీ లాస్ అంటే హాలీవుడ్ సినిమాలు, 'బార్న్ అల్టిమేటమ్' పేర్లు కొంత మంది చెబుతారు. 'గజినీ'లో సూర్యది టెంపరరీ మెమరీ లాస్. ప్రతి పదిహేను నిమిషాలకు ఒకసారి జరిగినది మర్చిపోతాడు. కానీ, మా సినిమాలో అలా కాదు. యాక్సిడెంట్ తర్వాత పూర్తిగా గతం మర్చిపోయిన హీరో... వ్యక్తులు, ఎదురైన పరిస్థితులను పూర్తిగా గుర్తు లేకున్నా కేసు ఎలా సాల్వ్ చేశాడనేది కథ'' అని దర్శకుడు మహేష్ వివరించారు.
కామెడీ చేయలేదు...
అంతా సీరియస్!
సాధారణంగా మెమరీ లాస్ మీద సినిమాల్లో కామెడీ చేశారు. కానీ, 'హంట్'లో ఆ విధంగా చేయలేదని మహేష్ తెలిపారు. ''హీరో ఓ మిస్టరీ సాల్వ్ చేయాల్సి వస్తే... సిట్యువేషన్స్ సీరియస్ అవుతాయి. చావో, రేవో... తప్పనిసరిగా బతకాల్సిన పరిస్థితి ఎదురైనప్పుడు... డ్రామాలో సీరియస్ పెరుగుతుంది. 'హంట్'లో మేం ఒక కొత్త పాయింట్ చెబుతున్నాం. ఇంతకు ముందు వచ్చిన సినిమాలకు, మా 'హంట్'కు సంబంధం లేదు. సినిమా చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చే ప్రేక్షకుడు... క్లైమాక్స్ చూసి ఎంజాయ్ చేస్తాడు. బరువెక్కిన గుండెతో బయటకు వస్తాడు'' అని మహేష్ వివరించారు.
Also Read : ప్రభాస్ డబుల్ ధమాకా - 2023లో ఆ రెండూ గ్యారెంటీ!
'హంట్'లో యాక్షన్ కూడా కొత్తగా ఉంటుందని... అలాగని, సినిమాలో యాక్షన్ మాత్రమే లేదని, అన్ని అంశాలు ఉన్నాయని మహేష్ చెప్పారు. ఈ సినిమాలో సుధీర్ బాబు, శ్రీకాంత్, 'ప్రేమిస్తే' భరత్ పోలీస్ ఆఫీసర్ రోల్స్ చేస్తున్నారు. వాళ్ళు ముగ్గురు స్నేహితులుగా కనిపించనున్నారు. అప్సరా రాణి ప్రత్యేక గీతం చేశారు.
Also Read : 'లైగర్' అప్పులు, గొడవలు - పూరి జగన్నాథ్‌ను వెంటాడుతున్న డిస్ట్రిబ్యూటర్లు?
'మైమ్' గోపి, కబీర్ దుహాన్ సింగ్, మౌనిక రెడ్డి, గోపరాజు రమణ, మహేష్ సోదరి మంజుల ఘట్టమనేని, చిత్రా శుక్లా, సుపూర్ణ మల్కర్, సంజయ్ స్వరూప్, రవి వర్మ, 'జెమినీ' సురేష్, అభిజీత్ పూండ్ల, కోటేష్ మన్నవ, సత్య కృష్ణన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కళా దర్శకత్వం : వివేక్ అన్నామలై, కాస్ట్యూమ్ డిజైనర్ : రాగ రెడ్డి, యాక్షన్ : రేనాడ్ ఫవెరో, బ్రయాన్ విజియర్ (హాలీవుడ్) , స్టంట్స్ : వింగ్ చున్ అంజి, కూర్పు : ప్రవీణ్ పూడి, ఛాయాగ్రహణం : అరుల్ విన్సెంట్, సంగీతం : జిబ్రాన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : అన్నే రవి, నిర్మాత : వి. ఆనంద ప్రసాద్, దర్శకత్వం : మహేష్.