Chiranjeevi: ఎన్టీఆర్‌కు భారతరత్న రావడం సముచితం, ఎంజీఆర్‌కు ఇచ్చినప్పుడు... : చిరంజీవి
Bharat Ratna Award To NTR: విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావుకు భారతరత్న అవార్డు రావడం సముచితం అని పద్మ విభూషణ్ చిరంజీవి అన్నారు.
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, తెలుగోడి ఆత్మ గౌరవానికి ప్రతీక నందమూరి తారక రామారావుకు భారత రత్న రావాలనేది ఆయన అభిమానులతో పాటు తెలుగు దేశం పార్టీ శ్రేణులు, పలువురి తెలుగు ప్రజల చిరకాల ఆకాంక్ష. కథానాయకుడిగా పలు వైవిధ్యమైన సినిమాలను ఎన్టీఆర్ చేశారు. తెలుగు ప్రజలకు రాముడు, కృష్ణుడు అంటే ఆయన.
తారక రాముణ్ణి దైవాంశ సంభూతుడిగా కొలిచే అభిమానులు ఉన్నారు. సినిమాల్లో పేరు ప్రఖ్యాతలు పొందిన తర్వాత ముఖ్యమంత్రిగా రాజకీయ రంగంపై తనదైన ముద్ర వేశారు ఎన్టీఆర్. ఆయన్ను భారతరత్న పురస్కారంతో సత్కరించాలనే డిమాండ్ చాలా రోజులుగా వినబడుతోంది. ఈ విషయాన్ని పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత చిరంజీవి ముందు ఉంచింది తెలుగు మీడియా.
భారతరత్న రావాలని మనస్ఫూర్తిగా అభిలషిస్తున్నా
దేశ రాజధాని ఢిల్లీలో గురువారం సాయంత్రం జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మెగాస్టార్ చిరంజీవి పద్మ విభూషణ్ పురస్కారాన్ని స్వీకరించారు. అనంతరం ఈ రోజు ఉదయం ప్రత్యేక విమానంలో ఆయన బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ ఎన్టీఆర్ భారతరత్న ప్రస్తావన రాగా... ''అవును... ఎన్టీఆర్ గారికి భారతరత్న రావడం ఎంతైనా సముచితం. నేను కూడా మనస్ఫూర్తిగా అభిలాషిస్తున్నాను, రావాలని కోరుకుంటున్నాను'' అని చిరంజీవి సమాధానం ఇచ్చారు.
ఏపీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే, ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఆ దిశగా ప్రయత్నాలు చేస్తారా? అని ప్రశ్నించగా... ''ప్రభుత్వ పరంగా చేస్తే త్వరితగతిన సాకారం అవుతుంది. ఎంజీఆర్ (తమిళ హీరో, సీఎం) గారికి వచ్చినప్పుడు ఎన్టీఆర్ గారికి రావడం అంతకు అంత సముచితం. ఎన్టీ రామారావు గారికి భారతరత్న రావాలని నేను కోరుకుంటున్నాను. ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నాను'' అని చిరంజీవి చెప్పారు.
Also Read: రామ్ చరణ్ డెనిమ్ షర్టులో ఏమున్నాడ్రా బాబూ - గ్లోబల్ స్టార్ క్యాజువల్ లుక్ కిర్రాక్ అంతే!
తన పద్మ విభూషణ్ పురస్కారం రావడం పట్ల చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ''నాతో సినిమాలు చేసిన దర్శక నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు వల్ల నాకు అవార్డు వచ్చింది. అభిమానుల అండదండలు నేను ఎప్పటికీ మరచిపోలేను'' అని చెప్పారు.
పిఠాపురం వెళ్లడం లేదు... ప్రచారం చేయడం లేదు!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన పార్టీకి మద్దతుగా చిరంజీవి ఇటీవల ఓ వీడియో విడుదల చేశారు. అందులో తన తమ్ముడు, జనసేనానికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే, పవన్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో చిరంజీవి కూడా ప్రచారం చేస్తారని బలంగా వినిపించింది. ఆ వార్తల్ని సున్నితంగా ఖండించారు చిరంజీవి.
''తమ్ముడికి నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. అతను విజయం సాధించాలని కోరుకుంటున్నా. అయితే, పిఠాపురంలో ఎన్నికల ప్రచారానికి నేను వెళ్లడం లేదు. పవన్ కూడా నేను ప్రచారం చేయాలని, ప్రచారానికి రావాలని అడగలేదు. నాకు ఆ కంఫర్ట్ ఇచ్చాడు'' అని చెప్పారు.
Also Read: రెమ్యూనరేషన్ తీసుకోవట్లేదు... ప్రాఫిట్ షేరింగ్ బేసిస్ మీద సినిమా చేస్తున్న రామ్!