Chiranjeevi - NBK 50 Years Celebrations: మేమంతా ఓ కుటుంబం... ఫ్యాన్స్ అర్థం చేసుకోవాలి - బాలకృష్ణ గోల్డెన్ జూబ్లీలో చిరంజీవి కీలక వ్యాఖ్యలు
NBK 50 In TFI: నందమూరి బాలకృష్ణ చిత్రసీమలో ప్రవేశించి 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం రాత్రి తెలుగు సినిమా ఇండస్ట్రీ ఘనంగా వేడుక నిర్వహించింది. అందులో చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు.
నందమూరి తారక రామారావు వారసుడిగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన కథానాయకుడు బాలకృష్ణ (Nandamuri Balakrishna). తండ్రికి తగ్గ తనయుడిగా, ప్రజలు మెచ్చిన నాయకుడిగా రాజకీయాల్లో, కథానాయకుడిగా సినిమాల్లో తనదైన ముద్ర వేశారు. ఆయన చిత్రసీమలో ప్రవేశించి 50 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా టాలీవుడ్ గోల్డెన్ జూబ్లీ వేడుకలు నిర్వహించింది. అందులో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అభిమానులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.
అభిమానులు కలసికట్టుగా ఉండాలి - చిరంజీవి
''అభిమానులు అప్పుడప్పుడూ గొడవలు పడుతుంటారు. అందుకని, హీరోల మధ్య ఎంత మంచి బంధం ఉంటుందో తెలియడం కోసం కొన్ని వేడుకలు చేసుకునే వాళ్లం... మా అభిమానులు కూడా కలిసి కట్టుగా ఉంటారని! మా కుటుంబంలో ఏ శుభకార్యం జరిగినా బాలయ్య రాకుండా ఉండరు. మాతో కలిసి ఆయన డ్యాన్స్ కూడా చేస్తారు. మేమంతా ఓ కుటుంబం. అభిమానులు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను'' అని చిరంజీవి చెప్పారు.
బాలకృష్ణతో ఫ్యాక్షన్ సినిమా చేయాలని కోరిక - చిరంజీవి
తెలుగు చిత్ర పరిశ్రమలో ఫ్యాక్షన్ సినిమా అంటే గుర్తుకు వచ్చే పేరు బాలకృష్ణ. రాయలసీమ నేపథ్యంలో ఆయన చేసిన సినిమాలు భారీ విజయాలు సాధించాయి. ఫ్యాక్షన్ నేపథ్యంలో చిరంజీవి చేసిన 'ఇంద్ర' సైతం భారీ విజయం సాధించింది. ఆ సినిమా చేయడానికి 'సమర సింహారెడ్డి' స్ఫూర్తి అని బాలకృష్ణ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో చిరంజీవి చెప్పారు. బాలయ్యతో కలిసి ఒక ఫ్యాక్షన్ సినిమా చేయాలనేది తన కోరిక అని ఆయన తెలిపారు. ఇంకా చిరంజీవి మాట్లాడుతూ... ''సినిమా ఇండస్ట్రీలో 50 ఏళ్ల ప్రయాణం... ఇంకా హీరోగా నటిస్తున్న ఘనత బాలయ్యకే సొంతం. బాలయ్యకు ఆ భగవంతుడు వందేళ్లు ఇదే ఎనర్జీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. రాజకీయ, వైద్య రంగాలలో అతనిలా సేవ చేయడం న భూతో న భవిష్యతి. బాలయ్య బాబు సినీ స్వర్ణోత్సవంలో మేం పాల్గొనడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎన్టీఆర్ కుమారుడిగా... తండ్రి పోషించిన పాత్రలను చేస్తూ ప్రేక్షకులను మెప్పించడం మామూలు విషయం కాదు. తండ్రికి తగ్గ తనయుడిగా బాలయ్య తన ప్రత్యేకత చాటుకున్నారు'' అని చెప్పారు.
''ఎన్టీ రామారావు గారి కుటుంబం నుంచి వచ్చి తనకంటూ ప్రత్యేక స్థానం సొంతం చేసుకున్నారు బాలయ్య బాబు. ఆయన 50 సంవత్సరాల ప్రయాణం ఎంతో మంది కొత్త వారికి ఆదర్శం'' అని విక్టరీ వెంకటేష్ అంన్నారు. ఆ తర్వాత 'ఫ్లూట్ జింక ముందు కాదు... సింహం ముందు కాదు' అంటూ బాలయ్య డైలాగ్ చెప్పి వేడుకలో అందరినీ ఉత్సాహపరిచారు.
నటన మాత్రమే కాదు... నాన్న నుంచి క్రమశిక్షణ నేర్చుకున్నా! - బాలకృష్ణ
''నేను మా నాన్నగారి నుంచి నేర్చుకున్నది నటన మాత్రమే కాదు... క్రమశిక్షణ, సమయ పాలన, సంస్కారం'' అని గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ అన్నారు. గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ... ''మేమంతా సినిమా ఇండస్ట్రీలో పోటాపోటీగా నటిస్తున్నప్పటికీ... మా మధ్య ఆరోగ్య పరమైన పోటీ మాత్రమే ఉంటుంది. ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నా అభిమానులు, తోటి నటీనటులు, నాతో పని చేసిన ప్రతి ఒక్కరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు. జన్మనిచ్చిన తల్లిదండ్రులను, మీ అభిమానాన్ని గుండెల్లో భద్రంగా దాచుకుంటాను'' అని అన్నారు.