Hero Kartikeya Interview : అది సెంటిమెంట్ కాదు - 'ఆర్ఎక్స్ 100', 'బెదురులంక' మధ్య కో ఇన్సిడెన్స్ : హీరో కార్తికేయ ఇంటర్వ్యూ
యంగ్ హీరో కార్తికేయ నటించిన లేటెస్ట్ మూవీ 'బెదురులంక 2012'. ఆగస్టు 25న సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో హీరో కార్తికేయ ఓ మీడియాతో సినిమా గురించి అనేక విషయాలు పంచుకున్నారు.
'ఆర్ఎక్స్ 100' సినిమాతో యువతలో మంచి క్రేజ్ తెచ్చుకున్న యంగ్ హీరో కార్తికేయ (Kartikeya Gummakonda) నటించిన లేటెస్ట్ మూవీ 'బెదురులంక 2012' (Bedurulanka 2012 Movie). నేహా శెట్టి కథానాయికగా నటించిన ఈ సినిమాను లౌక్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై బెనర్జీ ముప్పానేని నిర్మించారు. క్లాక్స్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ శుక్రవారం (ఆగస్టు 25) సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ఓ మీడియాతో ముచ్చటించిన కార్తికేయ, సినిమాకు సంబంధించి అనేక విషయాలను పంచుకున్నారు.
'బెదురులంక 2012' కథ గురించి మాట్లాడుతూ... ''కరోనా టైంలో క్లాక్స్ నాకు కథ చెప్పాడు. ఆ సమయంలో ప్రపంచం అంతమవుతుందని ప్రచారం జరిగింది కదా. కథకు బాగా కనెక్ట్ అయ్యాను. ప్రేక్షకుల్లో మార్పు వచ్చింది. కాబట్టి కథలో కొత్తదనం, వినోదం ఉండడంతో సినిమా ఓకే చేశా. కథ విన్నప్పుడు నాకు విజువల్ ఏం కనిపించలేదు. ఎందుకంటే ఈ సినిమాకు రిఫరెన్స్ ఏం లేదు. అంతా కొత్తగా ఉంటుంది. సినిమా పూర్తయ్యాక చూసుకున్న. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సినిమాలో ఫన్ అండ్ మెసేజ్ రెండూ ఉన్నాయి. రెండున్నర గంటలు పూర్తిగా ఎంజాయ్ చేస్తారు" అని అన్నారు.
'ఆర్ఎక్స్ 100 లో మీ క్యారెక్టర్ పేరు శివ. అలాగే గోదావరి నేపథ్యంలో సాగే కథ. 'బెదురులంక 2012' లోనూ ఇవి రెండు రిపీట్ అయ్యాయి. ఇది సెంటిమెంట్ అనుకోవచ్చా? అని అడిగితే... "అది యాదృచ్ఛికంగా జరిగింది. కథ నచ్చి రెండు సినిమాలు చేశా. ఇందులో క్యారెక్టర్ పేరు శివ అని చెప్పినప్పుడు క్లాక్స్ తో అనలేదు. కానీ తర్వాత అతనికి గుర్తు చేశా. తనకు ఆ సినిమాలో క్యారెక్టర్ పేరు గుర్తులేదు అన్నాడు. ఆ క్యారెక్టర్ మైండ్ సెట్ కు శివ అనే పేరు సెట్ అవుతుందని పెట్టానని చెప్పాడు. ఒకవేళ సెంటిమెంట్ వర్క్ అవుట్ అయి సినిమా కూడా హిట్ అయితే హ్యాపీ. హిట్ అవుతుందని నమ్మకంగా ఉన్నాం" అని తెలిపారు.
'బెదురులంక 2012 తర్వాత మరో సినిమా ప్రకటించకపోవడానికి కారణం ఏంటని? అడగ్గా... "కథల ఎంపికలో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నాను. సినిమాలు ప్రకటించలేదు కానీ ప్రస్తుతం కొన్ని చర్చలు జరుగుతున్నాయి. యువి క్రియేషన్స్ సంస్థలో ఓ సినిమా చేస్తున్న. యాక్షన్ అండ్ క్రైమ్ కామెడీ జోనర్లో సినిమా ఉంటుంది. ఆ తర్వాత ప్రశాంత్ అనే ఓ కొత్త దర్శకుడు తో చేస్తున్నా. మరో రెండు మూడు సినిమాలు చర్చ దశలో ఉన్నాయి" అని అన్నారు. ఆ తర్వాత 'ఆర్ఎక్స్ 100' సీక్వెల్ గురించి మాట్లాడుతూ.. ''ఆర్ఎక్స్ 100' సీక్వెల్ కాదు గాని, నేను అజయ్ భూపతి కలిసి ఓ సినిమా చేయాలనే ప్లాన్ ఉంది. అయితే అందుకు సరైన కథ కుదరాలి. కొన్ని పాయింట్స్ అనుకున్నాం. అన్ని కుదిరినప్పుడు ఆ సినిమా అనౌన్స్ చేస్తాం" అంటూ సమాధానం ఇచ్చాడు కార్తికేయ.
Also Read : శంకర్ ఎప్పుడు చెబితే అప్పుడు - చేతులు ఎత్తేసిన 'దిల్' రాజు
ఇటీవల చిరంజీవి గొప్పతనం గురించి చెప్పిన మాటలు వైరల్ అయ్యాయి. ఆ కామెంట్స్ ఓ అభిమానిగా చేసినవేనా? అనే ప్రశ్నకు బదులిస్తూ... "ఏబీపీ దేశం ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నన్ను ఓ ప్రశ్న అడిగితే సమాధానం చెప్పా. నేను చిరంజీవి గారికి అభిమానిని. అంతకంటే ఎక్కువ నాలో స్ఫూర్తి నింపిన వ్యక్తి చిరంజీవి గారు. ఆయనలా డాన్సులు చేయాలని, హీరో కావాలని ఇండస్ట్రీకి వచ్చాను. మా ఇంట్లో అమ్మ కూడా వీడు ఒక్క పని కూడా సరిగా చేయడు. అదే సినిమాలంటే రెస్పాన్సిబిలిటీగా ఉంటాడు అని అంటుంది. ఆ రెస్పాన్సిబిలిటీ రావడానికి కారణం ఆయనే" అని అన్నారు.
సక్సెస్ ఫెయిల్యూర్స్ గురించి ఏం నేర్చుకున్నారు? అనే ప్రశ్నకు జవాబిస్తూ.." ఒక్కో సినిమా నుంచి ఒక్కో విషయం నేర్చుకుంటాం. ప్రతి సినిమా హిట్ అవ్వాలని చేస్తాం. కానీ ఆ రిజల్ట్ రానప్పుడు తప్పు ఎక్కడ జరిగింది? అని ఆలోచిస్తాం. ఉదాహరణకు ఓ సీన్ బాగుందని, పాయింట్ కొత్తగా ఉందని సినిమా చేయకూడదని అర్థం చేసుకున్నా. కథతోపాటు ప్రతి సన్నివేశం ఎక్సైట్ చేసినప్పుడే సినిమా చేయాలి" అంటూ చెప్పుకొచ్చారు కార్తికేయ.
Also Read : 'సలార్' ఖాతాలో మరో రికార్డ్ - లక్ష డాలర్లు దాటేసిన USA ప్రీ సేల్స్ !
Join Us on Telegram: https://t.me/abpdesamofficial