Movies Pre Release Event : మూవీ చూస్తే షాక్... హిట్ కాకుంటే వెళ్లిపోతా... ఈవెంట్స్‌లో అతి కొంప ముంచుతుందా?
Movie Result : రీసెంట్‌గా కొన్ని మూవీస్ ప్రీ రిలీజ్ ఈవెంట్లలో కొందరు యాక్టర్స్ కామెంట్స్ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే, ఆ అతి కామెంట్స్ కొంప ముంచుతున్నట్లు తెలుస్తోంది.

Actors Comments Controversy In Pre Release Events : 'ఈ సినిమాలో ఇదివరకు ఎన్నడూ చూడనిది మీరు చూస్తారు'... 'ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ కాకుంటే నేను సినిమాలు వదిలేస్తా'... 'రాసి పెట్టుకోండి... ఈ సినిమా చూసి షాక్ అవుతారు'... 'ఈ సినిమా హిట్ కాకుంటే నా నెక్స్ట్ మూవీ మీరు చూడొద్దు'.... ఇదీ రీసెంట్‌గా మూవీస్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌లో వినిపించే మాటలు. అయితే, ఇవి కొన్ని సందర్బాల్లో పాజిటివ్ అనిపించినా... మరికొన్ని సందర్భాల్లో ఎక్కువగా నెగిటివిటీకి కారణమవుతున్నాయి. లేటెస్ట్ మూవీస్ రిజల్ట్‌ను బట్టి ఈ విషయం అర్థమవుతోంది.
ట్రోలింగ్స్‌కు ఛాన్స్ ఇచ్చేస్తున్నారు
ఇలాంటి కామెంట్స్ వల్ల కొందరు నటులు ట్రోలింగ్స్‌కు ఈజీగా అవకాశం ఇస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవల రిలీజ్ అయిన మాస్ మహారాజ 'మాస్ జాతర' విషయానికొస్తే... నటకిరీటి రాజేంద్ర ప్రసాద్‌పై అలాంటి ట్రోలింగే సాగింది. ''మాస్ జాతర' చూసి మీరు షాక్ అవ్వకపోతే... నేను సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతా.' ఇవీ ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన చేసిన కామెంట్స్. బాక్సాఫీస్ వద్ద 'మాస్ జాతర' మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది.
'ఇండస్ట్రీ ఎప్పుడు వదిలి వెళ్తారు?'
దీంతో రాజేంద్ర ప్రసాద్‌పై గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ సాగుతోంది. 'ఇండస్ట్రీ వదిలి ఎప్పుడు వెళ్లిపోతారు రాజేంద్రప్రసాద్ గారు'... 'అవును సినిమా చూసి నిజంగానే షాక్ అయ్యాం' అంటూ కామెంట్స్ చేశారు నెటిజన్లు. మూవీ అంటే కాన్ఫిడెంట్ ఉండొచ్చు కానీ మరీ ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికి రాదని అంటున్నారు.
Also Read : మీనాక్షి చౌదరి @ ఆర్కియాలజిస్ట్ 'దక్ష' - నాగచైతన్య మూవీలో ఫస్ట్ లుక్ చూశారా?
ఆడియన్స్ పల్స్ పట్టడం కష్టమే...
ఇండస్ట్రీలో మూవీ హిట్స్, ప్లాప్స్ కామన్. ఓ సినిమా అంటేనే దాని వెనుక హీరో హీరోయిన్ల దగ్గర నుంచీ అందరు నటీనటులు, టెక్నీషియన్స్ ఎంతోమంది కృషి ఉంటుంది. అయితే, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లో కొన్ని కాంట్రవర్సియల్, హైప్ ఇచ్చే కామెంట్స్‌తో హిట్ వచ్చేస్తుంది అనుకుంటే అది పొరపాటే అని విశ్లేషకులు అంటున్నారు. ఆడియన్స్ పల్స్ పట్టుకోవడం కష్టమేనని... కంటెంట్ ఉంటే వాళ్లే సినిమాలను ఆదరిస్తారని... అందుకు రీసెంట్‌గా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన చిన్న సినిమాలు హిట్ కావడమే బెస్ట్ ఎక్సాంపుల్ అని పేర్కొంటున్నారు.
ఇక గతంలో హీరో విజయ్ దేవరకొండ 'లైగర్' విషయంలోనూ, నిర్మాత నాగవంశీ 'కింగ్డమ్' మూవీ టైంలోనూ చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. 'కింగ్డమ్' రిలీజ్ తర్వాత నాగవంశీ దుబాయ్ వెళ్లిపోయారంటూ ట్రోలింగ్స్ కూడా వచ్చాయి. దీనిపై ఆయన కూడా స్ట్రాంగ్‌గానే రియాక్ట్ అయ్యారు. రీసెంట్‌గా వచ్చిన 'మిత్ర మండలి' మూవీ టైంలోనూ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రియదర్శి చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి.
అతి చేస్తే కష్టమే...
ఈవెంట్లలో అతి, ఓవర్ కాన్ఫిడెంట్ కామెంట్స్ వద్దంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. మూవీ రిలీజ్ తర్వాత సక్సెస్ అయితే ఆ మీట్‌లో ఎన్నైనా చెప్పొచ్చని... అలా కాకుండా రిలీజ్‌కు ముందే వాగ్ధానాలు, శపథాలు చేస్తే అవే మ్యాగ్జిమం కొంప ముంచుతున్నాయని అభిప్రాయపడుతున్నారు. ఇకపై ముందుగా అలాంటి కామెంట్స్ వద్దని హితవు పలుకుతున్నారు.





















