Jane Zhang Covid Positive: కావాలని కరోనా తెచ్చుకున్న చైనీస్ సింగర్, తిట్టిపోస్తున్న నెటిజన్లు
చైనీస్ సింగర్ చేసిన పనికి ఆ దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. చివరికి క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇంతకీ ఆమె చేసిన తప్పేంటి? ఎందుకు తిట్లు తిన్నదంటే?
కరోనా సృష్టించిన కల్లోలానికి ప్రపంచం అతలాకుతలం అయ్యింది. అన్ని రంగాలు కుప్పకూలిపోయాయి. ప్రపంచం కరోనా గుప్పిట్లో నుంచి బయటపడుతున్నా, వైరస్ పుట్టినిల్లు చైనాలో మాత్రం పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. తాజా మరో వేరియెంట్ కూడా చుక్కలు చూపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ దేశానికి చెందిన ఓ సింగర్ చేసిన పనికి సర్వత్రా విమర్శలు వెల్తువెత్తుతున్నాయి. వాస్తవానికి కరోనా సోకకుండా ప్రజలంతా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ, ప్రముఖ చైనీస్ సింగర్ జేన్ జాంగ్ కావాలని వైరస్ సోకేలా చేసుకుంది. ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. కావాలనే కరోనా తెచ్చుకున్నట్లు చెప్పింది. ఆమె చేసిన పనికి నెటిజన్లు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. అసలే చైనాలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుంటే ఇదేం పిచ్చిపని ఉంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
కావాలనే కరోనా తెచ్చుకున్నట్లు జేన్ జాంగ్ వెల్లడి
తనకు కరోనా ఎలా సోకిందో జేన్ జాంగ్ సోషల్ మీడియా పోస్టు ద్వారా తెలిపింది. కావాలనే కరోనా సోకిన తన స్నేహితులను చూసేందుకు వెళ్లినట్లు వివరించింది. న్యూ ఇయర్ ఈవెంట్ కు రెడీ కావడంలో భాగంగానే కరోనా తెచ్చుకున్నట్లు చెప్పింది. ఇప్పుడే కరోనా తెచ్చేసుకుని కోలుకుంటే.. న్యూ ఇయర్ సందర్భంగా మళ్లీ కరోనా సోకదని భావించినట్లు చెప్పింది. “న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా కరోనా సోకితే చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. నా షోల మీద ఇంపాక్ట్ ఉంది. అందుకే ఇప్పుడే కరోనా సోకితే అప్పటి వరకు కోలుకోవచ్చు. న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్నా పెద్దగా ఇబ్బంది ఉండదు అనుకున్నాను. అందుకే కరోనా సోకిన వారిని కలిశాను. ఇప్పుడు నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు కరోనా నుంచి కోలుకునే టైం ఉంది. న్యూ ఇయర్ వరకు కరోనా నుంచి బయటపడతాను” అని జేన్ వెల్లడించింది. వాస్తవానికి కరోనా సోకిన వారిని కలిసిన మరుసటి రోజే తనకూ కరోనా లక్షణాలు కనిపించాయని జేన్ జాంగ్ తెలిపింది. అయితే, ఆ లక్షణాలు కేవలం ఒక్క రోజే ఉన్నట్లు చెప్పింది. ఎక్కువగా నిద్రపోవడం, విటమిన్ సీ ఎక్కువ తీసుకోవడం, మంచి నీళ్లు బాగా తాగడం వల్ల కరోనా లక్షణాలు పూర్తిగా మాయమైనట్లు వెల్లడించింది.
నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు
జేన్ జాంగ్ చేసిన పని పట్ల సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. కరోనా పెరుగుతున్న వేళ ఇలాంటి పిచ్చి చేష్టలు ఏంటని నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రముఖ స్థాయిలో ఉండి బాధ్యతారాహిత్యంగా వ్యవహరిచారంటూ మండిపడ్డారు. నెటిజన్ల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో తన పోస్టును తొలగించింది. ఆ తర్వాత ప్రజలకు సారీ చెప్పింది. కొత్త సంవత్సర వేడుకల్లో కరోనా సోకితే తనతో పాటు తన టీమ్ కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందనే ఇలా చేసినట్లు చెప్పింది. ఇప్పుడైతే ఇంట్లో నుంచి బయటకు వెళ్లాల్సిన అవసరం ఉండదని చెప్పింది.
Read Also: వామ్మో, ప్రాణాలు పోతే? హాలీవుడ్ హీరో టామ్ క్రూజ్ డేరింగ్, సినిమా చరిత్రలోనే అత్యంత ప్రమాదకర స్టంట్!