Bigg Boss 6 Telugu: చప్పగా సాగిన నామినేషన్లు, వీకెండ్ వరకు ఇక నో మజా - నామినేషన్లలో ఉన్నది ఎవరంటే
Bigg Boss 6 Telugu: వీకెండ్ కోసం కన్నా సోమవారం కోసం ఎదురుచూసే ప్రేక్షకులే ఎక్కువ.
Bigg Boss 6 Telugu: సోమవారం అంటే నామినేషన్ డే. ఆ రోజు కంటెస్టెంట్లలోని అసలు రూపాలు బయటికి వస్తాయి. వెటకారపు మాటలు, చేతలు, అరుపులు... అబ్బో ఆ రోజు సర్కస్ చూస్తున్నట్టే ఉంటుంది ప్రేక్షకులకు. కానీ 12వ వారం మాత్రం అవేమీ లేకుండా ప్లాన్ చేశాడు బిగ్ బాస్. కన్ఫెషన్ రూమ్‌లో నామినేషన్లు పెట్టడంతో చప్పగా సాగింది ఎపిసోడ్. ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారో వారి ఫోటోను మిషన్లో వేసి ముక్కలు చేయమని చెప్పాడు బిగ్ బాస్.
అంతకుముందు కాసేపు ఫుడ్ కోసం గొడవ పడ్డారు ఫైమా, రేవంత్, శ్రీహాన్. ఇనాయ కూడా ఫుడ్ విషయంలో కాస్త ఇబ్బంది పడినట్టు మాట్లాడింది. రేవంత్ పొదుపు చేస్తూ ఇంటి సభ్యుల పొట్ట మాడుస్తున్నాడని ఫైమా, ఇనాయ,శ్రీహాన్ అభిప్రాయపడ్డారు. తరువాత ప్రేక్షకుల నుంచి వచ్చిన ప్రశ్నలకు ఇంటి సభ్యులు సమాధానాలిచ్చారు. రాజ్, కీర్తిలకు రెండు ప్రశ్నలు వచ్చాయి. ఆ రెండూ కూడా చప్పగా ఉన్న ప్రశ్నలే. తరువాత నామినేషన్ ప్రక్రియ మొదలైంది.
రోహిత్ మొదటగా నామినేషన్ ప్రక్రియను మొదలుపెట్టారు. ఆయన ఫైమా, శ్రీహాన్ లను నామినేట్ చేశారు. మెరీనాపై శ్రీహాన్ అరవడం నచ్చలేదని, అలాగే ఫైమా సంచాలక్‌గా ఫెయిలైందని కారణం చెప్పాడు. ఇక శ్రీసత్య రాజ్, రోహిత్‌లను నామినేట్ చేసింది. రోహిత్ రెండు వారాల క్రితం ఎఫ్ పదం వాడాడని రీజన్ చెప్పింది. ఇక రాజ్ గత మూడు వారాలు నామినేషన్లలోకి రావడం లేదని చెప్పింది. దానికి బిగ్ బాస్ సరైన కారణం చెప్పమని అడగడంతో కంగుతుంది. సరిగా ఆడడం లేదని అందుకే నామినేట్ చేశానంటూ చెప్పింది.
ఆదిరెడ్డి అబద్ధాలు
ఇక ఆదిరెడ్డి... ఇనాయ, శ్రీహాన్‌ని నామినేట్ చేసాడు. ఇనాయను మొదట్నించి టార్గెట్‌గా పెట్టుకున్నాడు ఆదిరెడ్డి. ఆడపిల్లల్లో కసిగా ఆడేది ఇనాయ మాత్రమే. అయినా ఆమెను నామినేట్ చేస్తూనే ఉన్నాడు. ఇక ఫైమాతో గత వారం కలిసి ఆడాడు ఆదిరెడ్డి. కానీ తాము ఆడలేదంటూ అబద్ధాలు చెప్పాడు. మేం కలిసి ఆడకపోయినా ఆడామంది ఇనాయ, అందుకే నామినేట్ చేస్తున్నా అని చెప్పాడు. ఇక శ్రీహాన్ మెరీనాపై అరవడం నచ్చలేదంటూ నామినేట్ చేశాడు.
రేవంత్... ఫైమా, ఆదిరెడ్డిని నామినేట్ చేశాడు.ఆదిరెడ్డితో రేవంత్‌కు సైలెంట్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ వారం శ్రీహాన్ ఆరు ఓట్లు, ఫైమాకి మూడు ఓట్లు, రోహిత్‌కి మూడు ఓట్లు, రాజ్‌కి రెండు ఓట్లు, ఆదిరెడ్డికి రెండు ఓట్లు, ఇనాయకు రెండు ఓట్లు పడ్డాయి. కీర్తిని ఎవరూ నామినేట్ చేయలేదు. ఇక రేవంత్ కెప్టెన్ అవ్వడంతో ఎవరూ నామినేట్ చేయలేకపోయారు. అంటే రేవంత్, కీర్తి తప్ప మిగతా అందరూ నామినేషన్లలో ఉన్నారు.
ఈసారి ఇంటి నుంచి ఎవరు వెళతారో అంచనా వేసేస్తున్నారు ప్రేక్షకులు. రాజ్ లేదా రోహిత్... వీరిద్దరిలో ఒకరు బయటికి వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు భావిస్తున్నారు.
Also read: ప్రేక్షకుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన ఇంటి సభ్యులు, పదును లేని ప్రశ్నలు