Akhil Akkineni: అక్కడ నన్ను నాగార్జున కొడుకు అనరు, అమల కొడుకనే అంటారు - శర్వానంద్‌తో అఖిల్
తన తండ్రి అక్కినేని నాగార్జున గురించి అఖిల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆయన మాటలు సినిమా పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారాయి.
అక్కినేని అఖిల్.. టాలీవుడ్ టాప్ హీరో అక్కినేని నాగార్జున-అమల దంపతుల ముద్దుల కొడుకు. సిసీంద్రి సినిమాతో చిన్నప్పుడే తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత హీరోగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ, ఆయనకు ఏ సినిమా పెద్దగా కలిసి రాలేదు. ఆ మధ్య ఓ దిగ్గజ వ్యాపార కుటుంబానికి చెందిన అమ్మాయితో నిశ్చితార్థం జరగడం, కొద్ది రోజుల్లోనే క్యాన్సిల్ కావడంతో వార్తల్లో నిలిచాడు. తాజాగా అఖిల్ తన తండ్రి నాగార్జున గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. తను ఎవరూ నాగార్జున కొడుకు అనరని చెప్పాడు. అమల కొడుకుగానే అందరూ గుర్తిస్తారని వెల్లడించాడు. హీరో శర్వానంద్ ఇంటర్వ్యూలో ఆయన ఈ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
శర్వానంద్ తల్లిగా అమల
శర్వానంద్ హీరోగా తెరకెక్కిన తాజా సినిమా ‘ఒకే ఒక జీవితం’. టైమ్ ట్రావెలింగ్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను శ్రీ కార్తీక్ తెరకెక్కించాడు. ఇటీవల విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులలో ఆసక్తి రేకెత్తిస్తోంది. శర్వానంద్ 30వ సినిమాగా రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సెప్టెంబర్ 9న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో అక్కినేని అమల శర్వానంద్ తల్లిగా నటించారు. టైమ్ ట్రావెలింగ్ నేపథ్యంలో వచ్చిన పలు సినిమాలు హిట్ కావడంతో ఈ సినిమా సైతం మంచి విజయం సాధిస్తుందని సినిమా యూనిట్ భావిస్తుంది.
నన్ను నాగార్జున కొడుకు అనరు- అఖిల్
ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా అమలా, శర్వానంద్ తో కలిసి అమ్మ చేతి వంట అనే చిట్ చాట్ ను రూపొందించారు. ఇందులో అక్కినేని అఖిల్ కూడా పాల్గొన్నాడు. ఇందులో అఖిల్ ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పాడు. తమిళనాడులో అమలకు ఉన్న పాపులారిటీ గురించి అఖిల్ చెబుతూ.. “చెన్నైకు వెళ్తే నన్ను నాగార్జున కొడుకు అనరు, అమల కొడుకు అంటారు. అక్కడికి వెళ్తే అంతా తప్పకుండా అమ్మ గురించి అడుగుతారు” అని తెలిపాడు. ‘‘నాకు, నాన్నకు మధ్య ఫైటింగ్ వస్తే.. అమ్మ ఆపుతుంది’’ అన్నాడు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి అఖిల్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. ఎవరైనా ప్రభాస్ ని కలిస్తే జాగ్రత్తగా ఉండాలన్నాడు. ప్రభాస్ ఫూడీ(ఆహార ప్రియుడు) అన్నాడు. ఇక చాలు తినలేను అని చెప్పినా ప్రభాస్ వదిలిపెట్టడన్నాడు. ప్రభాస్ అతిథ్యం స్వీకరించటం కష్టమని చాలా మంది సినీ ప్రముఖులు ఇప్పటికే చెప్పారు.
కథ తన హృదయాన్ని హత్తుకుందన్న అమలు
ఇక `ఒకే ఒక జీవితం` సినిమాలో రీతూ వర్మ హీరోయిన్ గా చేస్తుంది. ఈ సినిమాలో శర్వానంద్ తల్లిగా అమల నటించారు. ఈ కథ తన హృదయాన్ని హత్తుకుందని అమల చెప్పారు. శర్వానంద్ తనకు మూడో అబ్బాయిగా మారాడని వెల్లడించారు. ఈ సినిమాను డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్ ప్రభు, ఎస్.ఆర్.ప్రకాష్ బాబు సంయుక్తంగా నిర్మించారు. జేక్స్ బిజోయ్ సంగీతాన్ని అందించారు.
శర్వానంద్ మరో మూవీ ప్రారంభం
అటు శర్వానంద్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో మరో సినిమా రూపొందుతోంది. తాజా సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా, ప్రియమణి కీలక పాత్ర పోషిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.