Posani Krishna Murali: పోసానికి మళ్లీ కరోనా, ఆస్పత్రిలో చికిత్స - పరిస్థితి ఎలా ఉందంటే?
నటుడు పోసాని కృష్ణ మురళికి మరోసారి కరోనా సోకింది. వెంటనే ఆయనను కుటుంబ సభ్యులు హాస్పిటల్ కు తరలించారు. సినిమా షూటింగ్ కు వెళ్లి వచ్చిన ఆయన, కరోనా టెస్టు చేసుకోవడంతో పాజిటివ్ గా తేలింది.
ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళీ మరోసారి కరోనా బారిన పడ్డారు. ఇప్పటికే ఆయనకు రెండు సార్లు కరోనా సోకింది. ప్రస్తుతం మూడోసారి పాజిటివ్ గా తేలడటంతో ఆయనను కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు.
మూడోసారి పోసానికి కరోనా
ఓ సినిమా షూటింగ్ లో భాగంగా ఆయన కొద్ది రోజుల క్రితం పుణెకు వెళ్లారు. తాజాగా హైదరాబాద్ కు చేరుకున్నారు. అయితే, ఆయనకు కాస్త జ్వరం రావడంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగింది. ఈ నేపథ్యంలో పోసాని కృష్ణమురళి కరోనా పరీక్ష చేయించుకున్నారు. ఆయనకు కరోనా సోకినట్లు తేలింది. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు. పోసానికి కరోనా సోకడం ఇది మూడోసారి. గతంలోనే రెండుసార్లు కరోనా సోకడంతో హాస్పిటల్లో చికిత్స తీసుకున్నారు. పూర్తిగా కోలుకున్న తర్వాత ఆయన మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యారు.
పోసాని తెలుగు సినిమా పరిశ్రమలో నటుడిగా, రచయితగా, దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన కథలు రాసిన ఎన్నో సినిమాలు మంచి సక్సెస్ అందుకున్నాయి. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చలనచిత్ర, టీవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పోసానికి ఈ పదవి అప్పగించారు. ఓ వైపు ఈ బాధ్యతలు నిర్వహిస్తూనే సినిమాల్లోనూ నటిస్తున్నారు.
మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
అటు తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గతంలో రోజుకు ఒకటి రెండు కేసులు మాత్రమే నమోదు కాగా, నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 45 కరోనా కేసులు రికార్డు అయ్యాయి. ఒక్క హైదరాబాద్‌లోనే 18 కొత్త కేసులు నమోదు అయ్యాయి. ప్రజలు కాస్త జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ హెచ్చరించింది. కరోనా నింబంధనలు పాటించాలని సూచించింది. బయటకు వెళ్లేటప్పుడు మాస్క్ తప్పనిసరిగా ఉపయోగించాలని కోరింది.
అటు దేశ వ్యాప్తంగానూ కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. నిన్న ఒక్క రోజునే అన్ని రాష్ట్రాల్లో కలిపి 10 వేలకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. అయితే, గతంతో పోల్చితే కరోనా వైరస్ తీవ్రత తక్కువగా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయినప్పటికీ, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. మాస్కులు ధరించడంతో పాటు కరోనాకు సంబంధించిన నిబంధనలను పాటించాలని సూచించింది. అటు పలు రాష్ట్రాలు సైతం కరోనా నిబంధనలను అమలు చేస్తున్నాయి.
ఇక పోసాని నిత్యం పలు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. బాలకృష్ణ , పవన్ కళ్యాణ్ , చిరంజీవి, చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులపై కామెంట్స్ చేస్తూ ఉంటారు. తాజాగా బాలయ్య వ్యక్తిగత జీవితంపైనా పలు వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన అభిమానులు పోసానిపై ట్రోలింగ్ కు దిగారు. గత కొద్ది రోజులుగా ఆయన కాస్త వివాదాలకు దూరంగా ఉంటున్నారు.