Telangana Congress : ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ దాఖలు - కానీ అధికారిక ప్రకటన ఏది ?
Khammam Lok Sabha : ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా మంత్రి పొంగులేటి వియ్యంకుడు నామినేషన్ దాఖలు చేశారు. కానీ హైకమాండ్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు.
Telangana Politics : కాంగ్రెస్ పార్టీలో ఖమ్మం ఎంపీ సీటు పంచాయతీ కొలిక్కి వచ్చినట్లుగా కనిపిస్తోంది. నామినేషన్ల గడువు సమీపిస్తూండటంతో రామ సహాయం రఘురాంరెడ్డి అనే నేత అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అయితే బీఫాం మాత్రం ఇంకా ఆయన చేతికి అందలేదు. రఘురాంరెడ్డికి టికెట్ ఇచ్చేందుకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కరీంనగర్ నుంచి వెలిచాల రాజేందర్ రావు కూడా నామినేషన్ వేశారు. ఆయన పేరునూ ప్రకటించాల్సి ఉంది.
మంత్రి పొంగులేటికి రామసహాయం రఘురాంరెడ్డి వియ్యంకుడుగా చెబుతున్నారు. ఆయన కుటుంబం మొదటి నుంచి కాంగ్రెస్ లోనే ఉన్నారు. ఆయన తరపున పొంగులేటి అనుచరులే నామినేషన్లు దాఖలు చేశారు. ఖమ్మంలోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టిక్కెట్ తమ వారికి ఇవ్వాలంటే తమ వారికి ఇవ్వాలని పలువురు నేతలు పోటీ పడ్డారు. తమ వారికి ఇప్పించుకునేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీని వాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ప్రయత్నించారు. పొంగులేటి తన సోదరుడు ప్రసాద్ రెడ్డి దాదాపుగా ఖరారు చేసుకున్నారు. అయినా చివరి క్షణంలో మార్పులు చోటు చేసుకున్నాయి.
భట్టి విక్రమార్క తన భార్యకు కాకపోతే రాయల నాగేశ్వరరావుకు ఇవ్వాలని పట్టుబట్టారు. కాంగ్రెస్ అధిష్టానం ప్రసాద్ రెడ్డి, రామసహాయం రఘురాం రెడ్డి, రాయల నాగేశ్వరరావు పేర్లను పరిగణలోకి తీసుకుని వీరిలో ఒకరి పేరును ప్రకటించాలని డిసైడయింది. చివరికి పొంగులేటి వియ్యంకుడు రామ సహాయం రఘురాంరెడ్డికే టికెట్ కన్ఫార్మ్ అయినట్లు తెలుస్తోంది. ఆ కారణంగానే ఆయన తరుపున పార్టీ నేతలు నామినేషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. అధికారిక ప్రకటన బుధవారం అధిష్టానం అధికారికంగా చేసే అవకాశం ఉంది. తెలంగాణలో మొత్తం 17 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇప్పటి వరకు అభ్యర్థులను ప్రకటించిన స్థానాల్లో కమ్మ సామాజిక వర్గానికి కాంగ్రెస్ అధిష్టానం ప్రాధాన్యత కల్పించలేదు. ఖమ్మం నియోజకవర్గం నుంచి ఆ సామాజిక వర్గం వ్యక్తికి అధిష్టానం అవకాశం ఇస్తుందని భావించారు. కానీ, ఖమ్మం నుంచికూడా అవకాశం లేదని తెలుస్తోంది.
మామూలుగా ఆ సీటు నుంచి రేణుకాచౌదరి పోటీ చేసేవారు. ఆమెకు రాజ్యసభ సీటు ఇవ్వడంతో రేసు నుంచి తప్పుకున్నట్లయింది. కానీ తీవ్ర పోటీ మధ్య అభ్యర్థిని ఖరారు చేయలేకపోయారు. చివరికి డీకే శివకుమార్ రంగంలోకి దిగి .. సీనియర్ నేతలతో చర్చలు జరిపి.. పొంగులేటి కోటాలోనే ఖరారు చేశారు. దీనిపై ఇతర మంత్రులు ఇద్దరూ అసంతృప్తి చెందినా ఇప్పటికి కలిసి పని చేసే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.