YS Jagan Bandage : బ్యాండేజ్ తీసేసిన వైసీపీ అధినేత - చిన్న మచ్చ కూడా లేకపోవడంపై టీడీపీ సెటైర్లు
Andhra Politics : రాయి దాడి ఘటనలో అయిన గాయంకు పెట్టుకున్న బ్యాండేజ్ ను జగన్ తీసేశారు. చిన్న గాయం మచ్చ కూడా లేకపోవడం చర్చకు కారణం అవుతోంది.
![YS Jagan Bandage : బ్యాండేజ్ తీసేసిన వైసీపీ అధినేత - చిన్న మచ్చ కూడా లేకపోవడంపై టీడీపీ సెటైర్లు Jagan removed the bandage on the wound sustained in the stone attack incident YS Jagan Bandage : బ్యాండేజ్ తీసేసిన వైసీపీ అధినేత - చిన్న మచ్చ కూడా లేకపోవడంపై టీడీపీ సెటైర్లు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/27/007c74ca6d33345bfaedc626e169b4461714214659609228_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Jagan removed the bandage : ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి గత పది రోజుల నుంచి కనిపిస్తున్న లుక్ ఒక్క సారిగా మారిపోయింది. మేనిఫెస్టోను ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన క్లీన్ ప్లేస్ తో వచ్చారు. గత రెండు వారాలుగా ఆయన నుదుటన ఒక ప్లాస్టర్ ఉండేది. విజయవాడ సింగ్ నగర్ లో బస్సుపై నిలబడి అభివాదం చేస్తున్నప్పుడు రాయి దాడి జరిగింది. ఆ రాయి దాడిలో కన్నుపైన నదుటి భాగాన గాయం అయింది. ఆ గాయానికి అప్పుడే బస్సులో చిన్న బ్యాండ్ ఎయిడ్ వేశారు డాక్టర్లు. అయితే అది రాజకీయ అంశం కావడంతో అదే రోజు ఆస్పత్రికి వెళ్లారు.
పెద్ద గాయం అయిందని కుట్లు వేశారన్న ప్రచారం జరిగింది. దానికి తగ్గట్లుగానే తర్వాతి రోజు నుంచి జగన్ ప్లాస్టర్ తో కనిపించడం ప్రారంభించారు. రాను రాను ఆ ప్లాస్టర్ పెద్దది అవుతూండటం రాజకీయవర్గాల్లోనూ చర్చనీయాంశమయింది. ఎవరైనా చిన్న పిల్లలు సైకిల్ నేర్చుకుంటూ కింద పడితే అంత కంటే పెద్ద దెబ్బలు తగులుతాయని.. వారికి రెండు, మూడు రోజుల్లో తగ్గిపోతుందని.. జగన్ కు ఇంకా తగ్గకపోవడం ఏమిటని ప్రశ్నించడం ప్రారంభించారు. సానుభూతి కోసం డ్రామాలాడుతున్నారని టీడీపీ నేతలు సోషల్ మీడియాలో సెటైరిక్ పోస్టులు పెట్టడం ప్రారంభించారు. ఈ లోపే డాక్టర్ వైఎస్ సునీత కూడా ఓ సలహా ఇచ్చారు. పెద్ద గాయం అయి ఉంటే .. ప్లాస్టర్ తీసేయాలని.. దానికి గాలి ఆడకపోతే సెప్టిక్ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
సునీత ఇలా చెప్పిన ఒక్క రోజుకే జగన్ ప్లాస్టర్ తీసేసి బయటకు వచ్చారు. రాయి దెబ్బ తగిలినట్లుగా వైద్యులు ప్లాస్టర్ వేసిన చోట చిన్న గాయం ఆనవాళ్లు కూడా లేకుండా ఉండటాన్ని టీడీపీ సోషల్ మీడియా ప్రశ్నించింది. దెబ్బతగిలి కుట్లు వేస్తే.. ఆ మచ్చ స్పష్టంగా కనిపిస్తుందని .. అసలు దెబ్బ తగిలిందా ఇంత కాలం నాటకం ఆడారా అని ప్రశ్నించడం ప్రారంభించారు.
ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం ... జూమ్ చేసి చూస్తే దెబ్బ మటుమాయం 🤕😂#KodiKathiKamalHassan#KodiKathiDrama2 pic.twitter.com/TDfTC7Vb4k
— Lokesh Nara (@naralokesh) April 27, 2024
రాయి దాడిలో జగన్ తో పాటు అదే రోజు ..విజయవాడ సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా తగిలింది. ఒక్క రాయి ఇద్దరికి ఎలా తగిలిందనేది ఇప్పటికీ పెద్ద మిస్టరీగానే ఉంది. ఆయన కూడా తన కంటికి దెబ్బతగిలిందని రెండో రోజు నుంచి కంటికి ప్లాస్టర్ వేసుకుని తిరుగుతున్నారు. అలాగే ప్రచారం చేస్తున్నారు. ఇలా జగన్ తో పాటు వెల్లంపల్లి కూడా ప్లాస్టర్లు వేసుకుని తిరుగుతూండటంతో రాజకీయంగా విపక్షాలకు విమర్శలు చేయడానికి, సెటైర్లు వేయడానికి అవకాశం ఇచ్చినట్లు అయింది. ఎట్టకేలకు జగన్ ఆ ప్లాస్టర్ ను తీసేశారు. వెల్లంపల్లి కంటిన్యూ చేస్తారా తీసేస్తారా చూడాల్సి ఉంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)