ICET 2024 Toppers: తెలంగాణ ఐసెట్-2024 పరీక్షలో 71,647 మంది అర్హత, టాపర్ల వివరాలు ఇలా
TS ICET 2024 Toppers: జూన్ 14న వెలువడిన టీజీ ఐసెట్ పరీక్ష ఫలితాల్లో 71,647 (91.92 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ ముజీబుల్లా హుస్సేని టాపర్‌గా నిలిచాడు
TG ICET 2024 Toppers List: తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీజీఐసెట్(TG ICET)-2024 పరీక్ష జూన్ 14న విడుదలైన సంగతి తెలిసిందే. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, కాకతీయ యూనివర్సిటీ ఇంచార్జి వీసీ వాకాటి కరుణ ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల్లో మొత్తం 91.92 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఏపీ, తెలంగాణ కలిపి పరీక్ష కోసం మొత్తం 86,156 దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 77,942 మంది అభ్యర్థులు ఐసెట్ పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష రాసినవారిలో 71,647 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 66,104 మంది లోకల్ అభ్యర్థులుకాగా.. 5,543 మంది నాన్-లోకల్ అభ్యర్థులు ఉన్నారు. ఐసెట్ పరీక్ష ఫలితాల్లో వచ్చిన ర్యాంకు ఆధారంగా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలల్లో ఫుల్‌టైం ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఐసెట్ పరీక్షలో కనీస అర్హత మార్కులను 25 శాతంగా నిర్ణయించారు. అంటే 200 మార్కులకుగాను 50 మార్కులను అర్హతగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి అర్హత మార్కులు లేవు. ఆ ప్రకారం ఐసెట్ ర్యాంకులను ప్రకటించారు.
ఐసెట్ 2024 ర్యాంకు కార్డుల కోసం క్లిక్ చేయండి..
టీజీ ఐసెట్ టాప్-10 ర్యాంకర్లు (ICET Toppers) వీరే..
అభ్యర్థి పేరు | ప్రాంతం | సాధించిన మార్కులు | ర్యాంకు |
సయ్యద్ ముజీబుల్లా హుస్సేని | అత్తాపూర్ - హైదరాబాద్ | 153.53500 | 1వ ర్యాంకు |
జెల్ల భరత్ | మాడుగుల, రంగారెడ్డి | 152.79795 | 2వ ర్యాంకు |
కండాల లాస్య | మల్కాజ్‌గిరి-హైదరాబాద్ | 150.72933 | 3వ ర్యాంకు |
పాలగుల్ల రిషికారెడ్డి | నిజామాబాద్ | 148.34989 | 4వ ర్యాంకు |
కొత్నాన శివకుమార్ | విజయవాడ - ఏపీ | 143.70346 | 5వ ర్యాంకు |
బి. అక్షిత్ | సైనిక్‌పురి -హైదరాబాద్ | 142.59153 | 6వ ర్యాంకు |
బొమ్మన రాణి | విజయనగరం - ఏపీ | 142.29385 | 7వ ర్యాంకు |
గంగా షిండే | హైదరబాాద్ | 142.14644 | 8వ ర్యాంకు |
ఎన్. అరుణ్ సింగ్ | శంకర్ పల్లి- రంగారెడ్డి | 141.83559 | 9వ ర్యాంకు |
బుద్దారపు రవళి | ఖమ్మం | 140.94638 | 10వ ర్యాంకు |
రాష్ట్రంలో జూన్ 5, 6 తేదీల్లో మూడు సెషన్లలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని 116 పరీక్ష కేంద్రాల్లో ఐసెట్-2024 ప్రవేశ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు రెండు రాష్ట్రాల నుంచి 86,156 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 77,942 మంది విద్యార్థులు ఐసెట్ పరీక్షకు హాజరయ్యారు. మొత్తం 90.47 శాతం హాజరు నమోదైంది. జూన్ 5న మొదటి సెషన్‌కు 115 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా 25,931 మంది హాజరయ్యారు. రెండో సెషన్‌కు 116 కేంద్రాల్లో 26,298 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఇక జూన్ 6న ఉదయం జరిగిన చివరి సెషన్‌లో 28,256 మంది విద్యార్థులకుగాను 25,662 మంది పరీక్షకు హాజరయ్యారు.
తెలంగాణలో 16, ఏపీలో 4 సెంటర్లలో ఐసెట్ పరీక్ష నిర్వహించారు. తెలంగాణలో హైదరాబాద్, నల్గొండ, కోదాడ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేటలోని కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. ఇక ఏపీలో కర్నూలు, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నంలో పరీక్ష కేంద్రాల్లో ఐసెట్ పరీక్ష నిర్వహించారు. ఐసెట్ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీని జూన్ 8న విడుదల చేశారు. ప్రాథమిక కీపై జూన్ 9 సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలు స్వీకరించారు. ఈ ప్రక్రియ ముగియడంతో ఫలితాలను వెల్లడించారు.
ALSO READ: ఉన్నత విద్యాసంస్థల్లో పెరిగిన సీట్లు - ఐఐటీ, ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో 77,657 సీట్లు అందుబాటులో