JEE Main: జేఈఈ మెయిన్ అభ్యర్థులకు అలర్ట్, నేడు సెషన్-2 ఫలితాల వెల్లడి - ర్యాంకులు ప్రకటించనున్న ఎన్‌టీఏ!
JEE Main Results: జేఈఈ మెయిన్‌సెషన్-2 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏప్రిల్ 17న విడుదల చేయనుంది. ఫలితాలతోపాటు.. పరీక్ష ఫైనల్ 'కీ'ని కూడా ఎన్టీఏ అందుబాటులో ఉంచనుంది.

JEE Main 2025 Ranks: జేఈఈ మెయిన్ (JEE Main) సెషన్-2 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) గురువారం (ఏప్రిల్ 17న) విడుదల చేయనుంది. ఫలితాలతోపాటు.. పరీక్ష ఫైనల్ 'కీ'ని కూడా ఎన్టీఏ అందుబాటులో ఉంచనుంది. పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఎన్టీఏ అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు చూసుకోవచ్చు. విద్యార్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు.
జేఈఈ మెయిన్ సెషన్-1 ఫలితాలు ఫిబ్రవరిలో విడుదలైన సంగతి తెలిసిందే. ఇక సెషన్-2 ఫలితాలు ఏప్రిల్ 17న విడుదల కానున్నాయి. రెండు సెషన్లలో విద్యార్థులు కనబరచిని ప్రతిభ ఆధారంగా ఉత్తమ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుని ర్యాంకులను ఎన్టీఏ కేటాయించనుంది. కేటగిరీల వారీగా కటాఫ్ స్కోర్‌ను నిర్ణయించి సెషన్ 1, 2లో అర్హత సాధించిన మొత్తం 2.50 లక్షల మంది జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించినట్లు ప్రకటించనుంది. వారు మాత్రమే జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 18న ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు పేపర్-2 నిర్వహించనున్నారు.
దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీలు(IITs), ఎన్‌ఐటీలు(NITs), ట్రిపుల్ ఐటీలు (IIITs), కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో ప్రవేశాలకోసం జేఈఈ మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. మొదటి విడత పరీక్షలను జనవరి 24న పేపర్-2 పరీక్ష నిర్వహించారు. ఇక పేపర్-1 పరీక్షలను జనవరి 27 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిర్వహించనున్నారు. అదేవిధంగా ఏప్రిల్ 2, 3, 4, 7, 8 తేదీల్లో, బీఆర్క్, బీప్లాన్ కోర్సుల్లో అడ్మిషన్స్ కోసం ఏప్రిల్ 9న పరీక్షలు నిర్వహించారు. ఈ ఫలితాలను ఎన్టీఏ విడుదల చేయనుంది.
మే 2 వరకు దరఖాస్తులకు అవకాశం..
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 23 నుంచి ప్రారంభంకానుంది. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన 2.5 లక్షల మంది అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
పరీక్ష విధానం: జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో రెండు పేపర్లు (పేపర్-1, పేపర్-2) ఉంటాయి. ఒక్కోక్కటి మూడు గంటల వ్యవధి ఉంటుంది. పేపర్-1 ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు; పేపర్-2 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తారు. అభ్యర్థులు రెండు పేపర్లూ రాయడం తప్పనిసరి. రెండు పేపర్లలోనూ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ప్రశ్నలు ఉంటాయి.
జేఈఈ అడ్వాన్స్‌డ్ ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 23.04.2025.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 02.05.2025.
➥ ఫీజు చెల్లించడానికి చివరితేది: 05.05.2025.
➥ అడ్మిట్‌కార్డులు డౌన్‌లోడ్: 11.05.2025 నుంచి 18.05.2025 వరకు
➥ జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షతేది: 18.05.2025.
➥ విద్యార్థుల రెస్పాన్స్ షీట్లు: 22.05.2025.
➥ ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల: 26.05.2025.
➥ ఆన్సర్ కీపై అభ్యంతరాల స్వీకరణ: 26.05.2025 - 27.05.2025.
➥ జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల వెల్లడి: 02.06..2025.
➥ ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (AAT) దరఖాస్తు ప్రారంభం: 02.06..2025.
➥ ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (AAT) దరఖాస్తుకు చివరితేదీ: 03.06..2025.
➥ జాయింట్ సీట్ అలోకేషన్ (JoSAA) కౌన్సెలింగ్ ప్రారంభం: 03.06..2025.
➥ ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (AAT) పరీక్ష తేదీ: 05.06..2025.
➥ ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (AAT) ఫలితాల వెల్లడి: 08.06..2025.





















