(Source: ECI/ABP News/ABP Majha)
TS LAWCET 2024 Toppers: తెలంగాణ లాసెట్‌లో 29,258 మంది అభ్యర్థులు అర్హత, విభాగాలవారీగా టాపర్లు వీరే
LAWCET 2024 Results: జూన్ 13న విడుదలైన లాసెట్ ఫలితాల్లో మొత్తం 72.66 శాతం ఉత్తీర్ణత నమోదైంది. డిగ్రీ, పీజీ కోర్సుల పరీక్షలకు మొత్తం 40,268 మంది హాజరుకాగా.. వీరిలో 29,258 మంది అర్హత సాధించారు.
TS LAWCET 2024 Results: తెలంగాణలోని లా కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ లాసెట్, పీజీఎల్‌సెట్ ఫలితాలు జూన్ 13న విడుదలైన సంగతి తెలిసిందే. ఫలితాల్లో మొత్తం 29,258 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. మొత్తం 72.66 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మూడేళ్ల లా కోర్సులో 25,510 మంది అర్హత సాధించగా.. 73.27 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఐదేళ్ల లా కోర్సులో 5,478 మంది అర్హత సాధించగా.. 65.12 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇక పీజీఎల్‌సెట్‌లో 3,270 మంది అర్హత సాధించగా.. 84.65 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మొత్త 50,684 మంది అభ్యర్థులు పరీక్షల కోసం దరఖాస్తు చేసుకోగా.. 40,268 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 29,258 మంది అర్హత సాధించారు.
లాసెట్ పరీక్షల్లో అర్హత సాధించిన వారిలో 20,237 మంది పురుషులు, 9,017 మంది మహిళలు, నలుగురు ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. లాసెట్ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించినవారిలో బీకాం విద్యార్థులు 5790 మంది, బీఎస్సీ విద్యార్థులు 5068, బీఏ విద్యార్థులు 4044, బీటెక్ విద్యార్థులు 4485 మంది ఉన్నారు. వీటితోపాటు బీబీఏ, బీసీఏ, బీబీఎం, ఎంబీబీఎస్, బీడీఎస్, బీ-ఫార్మసీ, ఫార్మా-డీ లాంటి ప్రొఫెషనల్ కోర్సులు చదివినవారు కూడా లాసెట్ పరీక్షలో అర్హత సాధించారు. వీరికి కన్వీనర్ కోటా కింద సీట్లు కేటాయించనున్నారు.
టాపర్లు వీరే..
➥ మూడేళ్ల లా డిగ్రీ కోర్సులో హైదరాబాద్‌లోని గాంధీనగర్‌కు చెందిన పీజీఎం అంబేద్కర్ 97.49 మార్కులతో మొదటి ర్యాంకు సాధించారు. ఇక హైదరాబాద్‌లోని గచ్చిబౌలికి చెందిన ప్రత్యూష 96.65 మార్కులతో రెండో ర్యాంకు, ఖమ్మం జిల్లా సింగరేణికి చెందిన తల్లూరి నరేశ్ 95.74 మార్కులతో మూడో ర్యాంకులో నిలిచాడు.
➥ ఐదేళ్ల లా డిగ్రీ కోర్సులో హైదరాబాద్‌లోని మియాపూర్‌కు చెందిన బొడ్డు శ్రీరామ్ 87 మార్కులతో మొదటి ర్యాంకు సాధించారు. ఇక కామారెడ్డి జిల్లా బీబీపేటకు చెందిన పిప్పిరిశెట్టి దినేశ్ 87 మార్కులతో రెండో ర్యాంకు, హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరి చెందిన తల్లూరి నరేశ్ 84 మార్కులతో మూడో ర్యాంకులో నిలిచాడు.
➥ రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సులో సికింద్రాబాద్‌కు చెందిన పి.బాలసాయి విష్ణువర్ధన్ 76 మార్కులతో మొదటి ర్యాంకు సాధించారు. ఇక ఏపీలోకి క్రిష్ణా జిల్లా కానూరుకు చెందిన పొట్లూరి అబినీత్ 70 మార్కులతో రెండో ర్యాంకు, హైదరాబాద్‌లోని జాంబాగ్‌కు చెందిన నమన్ సిన్హా 67 మార్కులతో మూడో ర్యాంకులో నిలిచాడు.
ALSO READ: తెలంగాణ లాసెట్ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ కోసం డైరెక్ట్ లింక్ ఇదే
లాసెట్, పీజీఎల్‌సెట్ పరీక్షలను జూన్ 3న మొత్తం మూడుసెషన్లలో పరీక్షలు నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి 10.30 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 12.30 నుంచి 2.00 గంటల వరకు రెండో సెషన్‌లో, సాయంత్రం 4 గంటల నుంచి 5.30 గంటల వరకు మూడో సెషన్‌లో పరీక్షలు జరిగాయి. టీఎస్ లాసెట్, పీజీఎల్‌సెట్ పరీక్షలు తొలి రెండు సెషన్లు కలిపి మొత్తం 68 కేంద్రాల్లో నిర్వహించారు. ఇందులో తెలంగాణలో 64 కేంద్రాలు, ఏపీలో 4 కేంద్రాలు ఉన్నాయి. ఇక మూడో సెషన్ పరీక్షలను మొత్తం 50 కేంద్రాల్లో నిర్వహించారు. ఇందులో తెలంగాణలో 46 కేంద్రాలను, ఏపీలో 4 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు.
8,180 సీట్లు అందుబాటులో..
బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(BCI) నుంచి అనుమతి రాగానే సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 30 లా కాలేజీలు ఉన్నాయి, వాటిలో 8 ప్రభుత్వ కళాశాలలు కాగా.. మిగతావి ప్రైవేటు కాలేజీలు. రాష్ట్రంలో బీసీ సంక్షేమశాఖ పరిధిలోని రెండు, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ పరిధిలో ఒక్కో కళాశాలలో అయిదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సు ఉంది. వీటిల్లో మొత్తం 8,180 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కన్వీనర్ కోటా సీట్లు 7 వేల వరకు ఉన్నాయి. ఇందులో మూడేళ్ల ఎల్‌ఎల్‌బీకి సంబంధించి 4,790 సీట్లు; ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీకి సంబంధించి 2,280 సీట్లు; రెండేళ్ల పీజీ లా డిగ్రీకి సంబంధించి 930 సీట్లు అందుబాటులో ఉన్నాయి.అదేవిధంగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతిస్తే సాయంకాలం ఎల్‌ఎల్‌బీ కోర్సును కూడా ప్రవేశ పెట్టాలని అధికారులు భావిస్తున్నారు. అంతకు ముందు 2000 వరకు సాయంత్రం ఎల్‌ఎల్‌బీ కోర్సు అందుబాటులో ఉండేది. ఈ కోర్సులకు ఆదరణ లేని కారణంగా అప్పట్లో బీసీఐ నిషేధించింది.