CBSE Term-1 Date Sheet: రేపు సీబీఎస్ఈ 10, 12 టర్మ్ 1 టైమ్ టేబుల్ విడుదల.. పరీక్షలు ఎప్పుడంటే?
CBSE 12th Date Sheet 2022 (Term 1): సీబీఎస్ఈ 10,12వ తరగతుల టర్మ్ 1 టైమ్ టేబుల్ రేపు విడుదల కానుంది. సీబీఎస్ఈ 10వ తరగతి విద్యార్థులకు 75 సబ్జెక్టులు, 12వ తరగతి వారికి 114 సబ్జెక్టులు ఉంటాయి.
సెంట్రల్ బోర్డ్ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10,12వ తరగతుల టర్మ్ 1 పరీక్షలకు సంబంధించిన టైమ్ టేబుల్ (డేట్ షీట్లు) రేపు (అక్టోబర్ 18) విడుదల కానుంది. ఈ ఏడాది నవంబర్ - డిసెంబర్ మధ్యలో టర్మ్ 1 పరీక్షలు ఉంటాయని సీబీఎస్ఈ వెల్లడించింది. పరీక్షలన్నీ ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయని తెలిపింది. ఆఫ్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది. ఒక్కో పరీక్షకు 90 నిమిషాల సమయం కేటాయించినట్లు చెప్పింది. గతంలో నిర్వహించిన మాదిరిగా ఉదయం 10.30కి కాకుండా 11.30కి పరీక్షలు నిర్వహించనున్నట్లు వివరించింది. సీబీఎస్ఈ అధికారిక వెబ్‌సైట్ cbse.nic.in లో డేట్ షీట్ల వివరాలను వెల్లడించనుంది.
189 పేపర్లకు పరీక్షలు..
సీబీఎస్ఈ 10వ తరగతి విద్యార్థులకు 75 సబ్జెక్టులు, 12వ తరగతి వారికి 114 సబ్జెక్టులు ఉంటాయి. ఈ రెండింటిలో కలిపి మొత్తంగా 189 పేపర్లకు పరీక్షలు నిర్వహించనుంది. ఈ రెండు తరగతులును 2 గ్రూపులుగా విభజించిన బోర్డు.. మైనర్ (minor), మేజర్ (major) సబ్జెక్టులని పేరు పెట్టింది. ఈ సబ్జెక్టులు అన్నింటికీ ఒకేసారి పరీక్షలను నిర్వహిస్తే.. 40 నుంచి 45 రోజుల సమయం పడుతుంది. అందుకే మొదట మైనర్ సబ్జెక్టులకు ఆ తర్వాత మేజర్ సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించాలని సీబీఎస్ఈ నిర్ణయించింది.
Also Read: ఏపీ నిట్‌లో ఎంబీఏ కోర్సు.. అక్టోబర్ 30తో ముగియనున్న దరఖాస్తు గడువు.. ముఖ్యమైన వివరాలివే..
టర్మ్ 1 ఫలితాల తర్వాత టర్మ్ 2 షెడ్యూల్
టర్మ్ 1 పరీక్షల ఫలితాలను వెల్లడించిన తర్వాత టర్మ్ 2 ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల చేయాలని సీబీఎస్ఈ నిర్ణయించింది. టర్మ్ 2 పరీక్షలు 2022 మార్చి - ఏప్రిల్ నెలల్లో నిర్వహించే యోచనలో ఉంది. దేశంలో కోవిడ్ 19 తీవ్రతను బట్టి పరీక్షలను ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించాలా? లేదా సబ్జెక్టివ్‌గానా అనేది నిర్ణయించనున్నట్లు బోర్డు తెలిపింది.
Also Read: దివ్యాంగ విద్యార్థులకు ఏఐసీటీఈ స్కాలర్‌షిప్.. ఏడాదికి రూ.50 వేలు సాయం..
సీబీఎస్ఈలో డిజిటల్ చెల్లింపులు..
మారుతున్న టెక్నాలజీకి తగినట్లు సీబీఎస్ఈ బోర్డు ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుంటుంది. తాజాగా చెల్లింపుల విషయంలో కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఇప్పటివరకు ఉన్న మాన్యువల్ విధానాన్ని డిజిటల్ చెల్లింపులుగా మార్చినట్లు ప్రకటించింది. ఇంటిగ్రేటెడ్ పేమెంట్ సిస్టమ్ (IPS) అనే విధానం ద్వారా డిజిటల్ పేమెంట్లను చేయనున్నట్లు బోర్డు వెల్లడించింది. ఈ విధానం ద్వారా సీబీఎస్ఈ దాని అనుబంధ పాఠశాలల పరీక్షలు, అఫిలియేషన్ సంబంధిత చెల్లింపులను డిజిటల్ రూపంలో చేయవచ్చు. మాన్యువల్ విధానం వల్ల సమయం వృధా అవుతున్నట్లు గుర్తించామని.. అందుకే కొత్త విధానాన్ని తీసుకువచ్చినట్లు సీబీఎస్ఈ వర్గాలు తెలిపాయి.
Also Read: విద్యార్థుల కోసం స్కాలర్‌షిప్స్.. నవంబర్ నెలతో ముగియనున్న గడువు..