AP Inter Betterment Exams: ఏపీలో నేటి నుంచి ఇంటర్ ఎగ్జామ్స్.. నిమిషం ఆలస్యమైనా ఎంట్రీ ఉంది
AP Intermediate betterment exams: ఆంధ్రప్రదేశ్‌లో ఇవాల్టి నుంచి ఇంటర్ బెటర్‌మెంట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్లు ఏపీ విద్యా శాఖ అధికారులు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి (సెప్టెంబర్ 15) నుంచి ఇంటర్మీడియట్ బెటర్‌మెంట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఏపీ విద్యా శాఖ అధికారులు వెల్లడించారు. ఏపీలో ఇటీవల ఇంటర్ ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. కోవిడ్ కారణంగా ఈసారి ఎలాంటి పరీక్షలు లేకుండా ప్రభుత్వం ఫలితాలను వెల్లడించింది. కనీస మార్కులతో విద్యార్థులను పాస్ చేసింది. అయితే ఫలితాలతో సంతృప్తి చెందని వారికి మార్కులు పెంచుకునేందుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. బెటర్‌మెంట్ పరీక్ష ద్వారా ఎక్కువ మార్కులు సాధించుకునే వెసులుబాటు కల్పించింది. బుధవారం (నేడు) నుంచి ఈ నెల 23వ తేదీ వరకు బెటర్‌మెంట్ పరీక్షలను నిర్వహించనున్నారు. 4 లక్షల మంది పరీక్షల హల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకున్నారు.
కోవిడ్ నిబంధనలను పాటిస్తూ..
ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. సెకండియర్ విద్యార్థులకు మధ్నాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. పూర్తి స్థాయిలో కోవిడ్ నిబంధనలను పాటిస్తూ.. పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలను ఇప్పటికే పోలీస్ స్టేషన్లలో భద్రపరిచారు. పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. బెటర్‌మెంట్ పరీక్షలు సీసీ కెమెరాల నిఘాలో జరగనున్నాయి.
పరీక్ష కేంద్రాల వద్ద తాగు నీరు, వైద్య సేవలు నిత్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. విద్యార్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించి పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. నిమిషం నిబంధనను అమలు చేయడం లేదని తెలిపారు. అనివార్య కారణాల వల్ల పరీక్షా కేంద్రాలకు కాస్త ఆలస్యంగా హాజరైనా విద్యార్థులను అనుమతించాలని ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు థర్మల్ స్కానింగ్ చేయనున్నారు. పరీక్షల నిర్వహణ కోసం ప్రతీ జిల్లాకి ఒక కోవిడ్ ప్రోటోకాల్ అధికారిని నియమించడంతో పాటు.. ఇంటర్ బోర్డు కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.
ఈ పరీక్షలు ఎందుకంటే..
కోవిడ్ కారణంగా ఈ ఏడాది ఇంటర్ పరీక్షలు రద్దు చేసి.. అంతా కనీస మార్కులతో ఉత్తీర్ణత సాధించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. విద్యార్థుల భవిష్యత్ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వారి మార్కుల శాతాన్ని పెంచుకునేందుకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పేరిట మరో అవకాశాన్ని కల్పించింది. దీంతో పరీక్షల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఇంటర్ బోర్డు అధికారులు వెల్లడించారు. పరీక్షలకు సంబంధించిన మెటీరియల్, ఓఎంఆర్ షీట్స్, నామినల్ రోల్స్ షీట్స్, డీ–ఫామ్స్‌ను ఇప్పటికే పరీక్ష కేంద్రాలకు పంపించామని చెప్పారు. జంబ్లింగ్ విధానంలోనే విద్యార్థులకు పరీక్ష కేంద్రాలను కేటాయించినట్లు పేర్కొన్నారు.
Also Read: JEE Main 2021 Results: జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల.. ఆరుగురు తెలుగు విద్యార్థులకు ఫస్ట్ ర్యాంకు
ALso Read: AP Degree Colleges Reopen: వచ్చే నెల 1 నుంచి డిగ్రీ తరగతులు.. అకడమిక్ క్యాలెండర్ విడుదల