టీచర్లకు వేసవి సెలవుల్లేవ్! పనులు అప్పగిస్తూ ఆదేశాలు జారీచేసిన విద్యాశాఖ!
వేసవి సెలవులు విద్యార్థులకేగాని ఉపాధ్యాయులకు కాదంటూ కొందరు అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడంపై ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. వేసవి సెలవుల్లోనూ ప్రభుత్వ టీచర్లకు పనులు అప్పగిస్తూ ఉత్తర్వులు.
ఏపీలో వేసవి సెలవుల్లోనూ ప్రభుత్వ టీచర్లకు పనులు అప్పగిస్తూ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో 3, 4, 5 తరగతులకు వర్క్‌షీట్లు అందించడం, ‘మేము చదవడాన్ని ఇష్టపడతాం’, జగనన్న విద్యా కానుక కిట్ల సరఫరా, పీఎం శ్రీ పాఠశాలల కాస్టింగ్ షీట్ రూపకల్పన, ‘నాడు-నేడు’ పనులు, పిల్లలు గ్రంథాలయాలకు వెళ్లేలా చూడడం, విద్యార్థుల ప్రవేశాల నిర్వహణలాంటి పనులను అప్పగించింది. సెలవులు విద్యార్థులకేగాని ఉపాధ్యాయులకు కాదంటూ కొందరు అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడంపై ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో మే 1నుంచి పాఠశాలలకు ఇచ్చే సెలవుల్లో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల విధులపై ఉన్నతాధికారులు ఆదేశాలనిచ్చారు.
ఉపాధ్యాయులు బడికి రావాలా? వద్దా? అనే దానిపై స్పష్టత ఇవ్వకుండానే అనేక పనులు అప్పగించారు. దీనిపై ఉపాధ్యాయుల్లో గందరగోళం నెలకొంది. ‘నాడు-నేడు’ పనులు, పదో తరగతి ఫలితాల తర్వాత టీసీల జారీ, ఇతరత్రా కార్యకలాపాల కోసం ప్రధానోపాధ్యాయులు ప్రతి రోజు బడులకు రావాలని సూచించారు. ప్రధానోపాధ్యాయుడు సెలవు పెడితే ఆ సమయంలో మరో ఉపాధ్యాయుడిని నియమించాలని ఆదేశించారు. వేసవి సెలవుల్లో ప్రతి పాఠశాలలో 23 రకాల కార్యకలాపాలను నిర్వర్తించాల్సి ఉంటుంది. 3,4,5 తరగతులకు వర్క్‌షీట్లను ఇవ్వాలని ఆదేశించిన అధికారులు ముద్రించిన వాటిని మాత్రం సమకూర్చలేదు. వాటిని జిరాక్స్ తీసేందుకు ఉపాధ్యాయులు సొంత డబ్బులు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది.‘మేము చదవడాన్ని ఇష్టపడతాం’ కార్యక్రమాన్ని మే 1 నుంచి జూన్ 10 వరకు నిర్వహించాలి.
పాఠశాలలోని విద్యార్థులను బృందాలుగా విభజించి ఉపాధ్యాయులు దత్తత తీసుకోవాలి. వాట్సప్ గ్రూపు ఏర్పాటుచేసి రోజువారీగా కథలను అందులో పోస్టు చేయాలి. ఆ కథలు చదివాక విద్యార్థుల అభిప్రాయాలను సేకరించాలి. విద్యార్థుల చదివే సామర్థ్యం ఆధారంగా పాఠశాల గ్రంథాలయంలోని పుస్తకాలను ఒక్కొక్కరికి 5 నుంచి 10 ఇవ్వాలి. ఇచ్చిన పుస్తకాలను విద్యార్థి చదివేస్తే స్నేహితుల వద్దనున్న పుస్తకాలతో మార్చుకునేలా చూడాలి. అంతేకాకుండా గ్రామాల్లోని ప్రజా గ్రంథాలయాలకు వెళ్లి పుస్తకాలను తెచ్చుకునేలా పిల్లలకు అవగాహన కల్పించాలి. ఈ పనులను రికార్డు చేయాలి. అధికారులు ఎప్పుడైనా పరిశీలిస్తే చూపించాల్సి ఉంటుంది.
ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రవేశాలపైనా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. 5వ తరగతి పూర్తయినవారు ప్రభుత్వ బడుల్లో ఆరో తరగతిలో ప్రవేశించేలా చూడాలి. కింది తరగతుల్లోనూ విద్యార్థుల ప్రవేశాలపై దృష్టి పెట్టాలి. పిల్లలకు నైతిక విలువలు నేర్పించాలి. పిల్లవాడి బాధ్యతను ఉపాధ్యాయులు తీసుకోవాలి. వారే తల్లిదండ్రుల్లా వ్యవహరించాలని సూచించారు. పిల్లలు సైతం వేసవి సెలవుల్లో తామేం చేశామో నోట్‌బుక్‌లో రాసి తరగతి ఉపాధ్యాయుడికి ఇవ్వాలి. దీన్ని కచ్చితంగా అమలు చేయాలి. జగనన్న విద్యాకానుక కిట్లను వారు తీసుకెళ్లాలి.
Also Read:
వేసవి సెలవుల్లో విద్యార్థులకు వినూత్న కార్యక్రమం, పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు!
వేసవి సెలవుల్లో విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంచడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సెలవుల్లో ‘మేము చదవడాన్ని ఇష్టపడతాం’ అనే కార్యక్రమాన్ని అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ ఏప్రిల్ 19న ఆదేశాలు జారీచేసింది. ఈ కార్యక్రమాన్ని మే 1 నుంచి జూన్ 10 వరకు అమలు చేయాలని సూచించింది. ఉపాధ్యాయులు, అధికారులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆదేశించింది. పాఠశాలలోని విద్యార్థులను బృందాలుగా విభజించి ఉపాధ్యాయులు దత్తత తీసుకోవాలని, వాట్సప్ గ్రూపు ఏర్పాటు చేసి, రోజువారీగా కథలను పోస్ట్ చేయాలని ఆదేశించింది. ఆ కథలు చదివాక విద్యార్థుల అభిప్రాయాలను సేకరించాలని పేర్కొంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
సిల్వర్ సెట్-2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
కర్నూలులోని సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ కళాశాలలో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. 2023-24 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే 'సిల్వర్ సెట్-2023' పరీక్షకు ఏప్రిల్ 7న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. మే 6 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రవేశ పరీక్షను మే 25న నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఇంటర్ ఉత్తీర్ణత కలిగిన విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారు దరఖాస్తుకు అర్హులు.ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష, రూల్ ఆఫ్ రిజర్వేషన్, ప్రత్యేక కేటగిరీ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు. ఎంపికైన విద్యార్థులకు విద్యా బోధనతో పాటు భోజనం, వసతి అందిస్తారు. ఏపీలో పాత 13 జిల్లాలతో పాటు తెలంగాణలో ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, హైదరాబాద్‌లో పరీక్ష నిర్వహించనున్నారు.
ప్రవేశ పరీక్ష పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..