YS Viveka Driver Dastagiri : పోలీసులు భద్రత కల్పించడంలేదు, నాకేదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? : వివేకా డ్రైవర్ దస్తగిరి
YS Viveka Driver Dastagiri : మాజీ మంత్రి వివేకానంద హత్య కేసులో అఫ్రూవర్ గా మారిన డ్రైవర్ దస్తగిరి పోలీసులు తనకు భద్రత కల్పించడంలేదని ఆరోపించారు. తనకు ఏదైనా జరిగితే ఎవరూ బాధ్యత వహిస్తారని ఆవేదన చెందారు.
YS Viveka Driver Dastagiri : వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో తనకు రక్షణ కరువైందని, పోలీసులు భద్రత కల్పించడంలేదని మాజీ మంత్రి వివేకానంద రెడ్డి డ్రైవర్ దస్తగిరి ఆరోపిస్తున్నారు. పులివెందులలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన కోర్టుకు చెప్పినట్లు జిల్లా పోలీసులు తనకు రక్షణ కల్పించడం లేదని ఆక్షేపించారు. పోలీసులు సరైన రక్షణ కల్పించడంలేదన్నారు. పులివెందుల దాటి వెళ్తే తన వెంట సెక్యూరిటీ ఎవరూ రావడం లేదన్నారు. ప్రభుత్వం ఇచ్చిన గన్ మెన్లు తనతో ఉండటం లేదన్నారు. ప్రతిసారీ సీబీఐ అధికారులకు ఫోన్ చేసి సెక్యూరిటీని పంపమని కోరడం ఇబ్బందిగా ఉందన్నారు. తన ప్రాణానికి హాని జరిగితే తిరిగి తీసుకుని వస్తారా అని దస్తగిరి ప్రశ్నించారు. స్థానిక పోలీసులతో తన కదలికలు తెలుసుకుంటున్నారు తప్ప రక్షణగా ఉండడంలేదని ఆరోపించారు.
ఏదైనా జరిగితే బాధ్యత ఎవరిది?
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో డైవర్ దస్తగిరి అప్రూవర్‌గా మారారు. తనకు భద్రత కోసం ఇద్దరు పోలీసులను కేటాయించామని జిల్లా పోలీసులు చెబుతున్నా వారెవ్వరూ తన ఇంటి వద్ద ఉండడం లేదని దస్తగిరి ఆవేదన చెందారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన ప్రతిసారీ సీబీఐ ఎస్పీ రామ్ సింగ్‌కు ఫోన్ చేసి చెప్పాలంటే కష్టంగా ఉందని పేర్కొన్నారు. పులివెందులలో ఎక్కడికి వెళ్లాలన్నా భయంగా ఉందన్నారు. సెక్యూరిటీగా పోలీసులు ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వైలెన్స్ పేరు చెప్పి భద్రత కల్పించకుండా తప్పించుకుంటున్నారని ఆరోపించారు. తన ప్రాణాలకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని దస్తగిరి ప్రశ్నించారు.
అఫ్రూవర్ గా దస్తగిరి
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ( YS Viveka Murder Case ) అప్రూవర్‌గా మారిన దస్తగిరిని పులివెందుల కోర్టులో ( Pulivendula Court ) సీబీఐ గతంలో హాజరుపర్చింది. అప్రూవర్‌గా మారేందుకు కోర్టు అంగీకరించినందున మరోసారి అప్రూవర్‌గా దస్తగిరి ( Dastagiri ) వాంగ్మూలాన్ని సీబీఐ అధికారులు ఇప్పటికే నమోదు చేశారు. గతేడాది ఆగస్ట్ 31న ప్రొద్దుటూరు కోర్టులో ( Proddutur Court ) దస్తగిరి వాంగ్మూలం ఇచ్చారు. అయితే అప్పటికి అప్రూర్‌గా మారలేదు అందుకే మరోసారి వాంగ్మూలాన్ని నమోదు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి ( MP Avinash Reddy ) సన్నిహితుడు, వైఎస్ఆర్‌సీపీ ( YSRCP ) రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని సీబీఐ నిందితుడిగా చేర్చింది. అంతకు ముందు ఓ చార్జిషీట్ దాఖలు చేసింది. ఇటీవల దాఖలు చేసిన చార్జిషీట్‌లో ప్రధానంగా ఎంపీ అవినాష్ రెడ్డిపైనే అనుమానం వ్యక్తం చేసింది.
2019 మార్చి 15న వివేకా తన ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యారు. తన తండ్రి హత్య కేసులో సిట్ విచారణలో పురోగతి లేదని, సీబీఐకి అప్పగించాలని కోరుతూ వివేకా కుమార్తె సునీత ( YS Sunita ) హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టుకు సీబీఐకి అప్పగించిన తర్వాత దర్యాప్తు మెల్లగా సాగుతోంది. ఇటీవల సీబీఐ వేగం పెంచింది. దస్తగిరి అప్రూవర్‌గా మారడాన్ని కడప చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ అంగీకరించింది. దీన్ని హైకోర్టు సమర్థించింది.