Viveka Case : వివేకా కుమార్తె, అల్లుడి నుంచి ప్రాణహానీ... కడప ఎస్పీకి ఫిర్యాదు చేసిన వివేకా పీఏ కృష్ణారెడ్డి !
వైఎస్ సునీత, రాజశేఖర్ రెడ్డి నుంచి ప్రాణహాని ఉందని కడప ఎస్పీకి వివేకా పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. విచారించి చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తమకు ప్రాణభయం ఉందంటూ పోలీసులను ఆశ్రయిస్తున్న అనుమానితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా కడప ఎస్పీ అన్బురాజన్‌ని వివేకానందరెడ్డి వ్యక్తిగత కార్యదర్శి కృష్ణారెడ్డి కలిశారు. తనకు ప్రాణ హానీ ఉందని రక్షణ కల్పించాలని మొర పెట్టుకున్నారు. ఈ మేరకు వినతిపత్రం కూడా అందించారు. వివేకా హత్య కేసులో తనను కొందరు బలవంతంగా కొంత మంది పేర్లు చెప్పాలని ఒత్తిడి చేస్తున్నారని లేఖలో కృష్ణారెడ్డి పేర్కొన్నారు. కడప ఎస్పీతో సమావేశం తర్వాత కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు. అయితే ఈ అంశంపై కడప ఎస్పీ మీడియాతో మాట్లాడారు.
వివేకానందరెడ్డి వద్ద 30 ఏళ్లుగా వ్యక్తిగత కార్యదర్శిగా పని చేస్తున్న కృష్ణారెడ్డి తనను కలిశారని .. ఆయన హత్య కేసులో అనుమానితుడిగా ఉన్నారని ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. కొందరి వల్ల ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశారని తెలిపారు. ఆ కొందరు వివేకా కుమార్తే సునీత, భర్త రాజశేఖర్ రెడ్డి, శివ ప్రకాష్ రెడ్డి అని కూడా ఎస్పీ చెప్పారు. కృష్ణారెడ్డి ఫిర్యాదుపై అన్ని కోణాల్లో విచారించి చర్యలు తీసుకుంటాం అని ఎస్పీ అన్బురాజన్ తెలిపారు.
Also Read: అబద్దాలతో బురిడీ కొట్టిస్తున్న శిల్పా చౌదరి - మరోసారి కస్టడీ కోరిన పోలీసులు !
కొద్ది రోజులుగా వివేకా కుమార్తె, అల్లుడి నుంచి ప్రాణహాని ఉందంటూ వరుసగా కొంత మంది వ్యక్తులు తెరపైకి వస్తున్నారు. హత్య కేసులో వారిపైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దస్తగిరి అప్రూవర్‌గా మారక ముందు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్‌మెంట్ ప్రకారం వైఎస్ అవినాష్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడైన దేవిరెడ్డి శంకర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. అప్పుడు ఆయన సీబీఐకి లేఖ రాసి .. వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డిపైనే ప్రధానంగా ఆరోపణలు చేశారు. వారిపై విచారణ జరపాలన్నారు. ఆ తర్వాత జర్నలిస్టు అని చెప్పుకుని భరత్ యాదవ్ అనే వ్యక్తి తెరపైకి వచ్చి ఆరోపణలు చేశారు.
Also Read: అత్త గొంతుపై గడ్డ పారతో పొడిచి చంపిన అల్లుడు, ఆ తర్వాత భార్యపై కూడా.. ఇంతలో..
కొద్ది రోజుల కిందట అనంతపురం ఎస్పీని కలిసిన గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి సీబీఐ అధికారులతో పాటు వివేకా కుమార్తె, అల్లుడిపైనా ఆరోపణలు చేశారు. ఇప్పుడు కొత్తగా వివేకా పీఏ కృష్ణారెడ్డి ఈ తరహా ఆరోపణలతో తెరపైకి వచ్చారు. వరుసగా ఇలా వివేకా కుమార్తె, అల్లుడిపై ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదులు చేస్తూండటంతో ఈ కేసులో ఏం జరగబోతోందన్న ఆసక్తి సామాన్య ప్రజల్లో ఏర్పడుతోంది.
Also Read: ప్రేక్షకులు థియేటర్లకు రావడం కోసమే ఎన్టీఆర్, చరణ్! ఆ తర్వాత... - రాజమౌళి ఏమన్నారంటే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి