Vijayawada News : విజయవాడలో విషాదం, కృష్ణా నదిలో ఐదుగురు విద్యార్థులు గల్లంతు
Vijayawada News : విజయవాడ యనమలకుదురు వద్ద కృష్ణా నదిలో ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు.
Vijayawada News : విజయవాడలో విషాద ఘటన జరిగింది. యనమలకుదురు సమీపంలోని కృష్ణానదిలో ఈతకు వెళ్లి ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. ఒకరి మృతదేహాన్ని స్థానికులు బయటకు తీశారు. మరో నలుగురి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. గల్లంతు సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్స్ ఘటనా స్థలికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ , ప్రమాదస్థలికి చేరుకుని సహాయక చర్యలపై ఆరా తీశారు. ఒక విద్యార్థి నీటిలో మునిగిపోతున్నప్పుడు అతడిని రక్షించేందుకు వెళ్లిన నలుగురు విద్యార్థులు నీటమునిపోయినట్లు తెలుస్తోంది. గల్లంతైన వారు విజయవాడ పడమట ప్రాంతానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. విద్యార్థులు గల్లంతుపై వారి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. స్థానికుల సైతం పెద్ద ఎత్తున నది వద్దకు చేరుకుని గాలిస్తున్నారు. సరదాగా ఈత కొట్టేందుకు వచ్చిన విద్యార్థులు ప్రమాదానికి గురవ్వడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.
హైదరాబాద్ దమ్మాయిగూడలో విషాదం
హైదరాబాద్ లోని దమ్మాయిగూడలో విషాదం చోటు చేసుకుంది. గురువారం అదృశ్యమైన పదేళ్ల బాలిక శుక్రవారం ఉదయం చెరువులో శవంగా తేలింది. నిన్ననే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలిక మృతదేహాన్ని చెరువులోంచి బయటకు తీశారు. దమ్మాయిగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న 10 ఏళ్ల ఇందు గురువారం ఉదయం కనిపించకుండా పోయింది. గురువారం ఉదయం తండ్రి నరేష్ తో పాటు బడికి వచ్చిన బాలిక తన బ్యాగును అక్కడే విడిచి పెట్టి పుస్తకాలు తెచ్చుకునేందుకు వెళ్లినట్లు పాఠాశాల ప్రిన్సిపాల్ చెప్పారు. అయితే బాలిక వెళ్లిపోయిన విషయం తనకు తెలియగానే.. ఇందు తండ్రికి ఫోన్ చేసి ప్రిన్సిపల్ విషయం చెప్పారు. హుటాహుటిన బడికి వచ్చిన బాలిక తండ్రి చుట్టుపక్కల వెతికారు. ఎలాంటి ఆచూకీ లభించకపోవడం మధ్యాహ్నం ఒంటిగంటకు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సాయంత్రం నాలుగు గంటలకు కేసు నమోదు చేసుకొని ఇందూ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
సీసీటీవీల ఆధారంగా దర్యాప్తు
డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంలను రంగంలోకి దింపారు పోలీసులు. పాఠశాల ఆవరణలో సీసీటీవీ కెమెరాలు లేవు. దమ్మాయిగూడ చౌరస్తా వద్ద ఉన్న ఓ సీసీటీవీ కెమెరాలో మాత్రమే బాలిక కనిపించింది. ఆ తర్వాత ఎటు వెళ్లిందనే విషయం తెలియ రాలేదు. డాగ్ స్వ్కాడ్ చెరువు వద్దకు వెళ్లి ఆగిపోయాయి. ఈరోజు ఉదయం మృతదేహం లభ్యం కావడంతో శవాన్ని బయటకు తీశారు. బాలికను ఎవరైనా హత్య చేసి ఉంటారని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆ ఏరియాలో గంజాయి ముఠాలు, తాగుబోతులు ఎక్కువగా సంచరిస్తారని వారే ఏమైనా చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిన్ననే పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి ఉంటే ఆధారాలు లభించేవని చెబుతున్నారు. బాలిక ఒక్కతే బయటకు వెళ్లడం సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది. దీన్ని బట్టి పోలీసులు బాలిక ఏమైనా ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయిందా అనే కోణంలో ఆలోచిస్తున్నారు.