Vijayawada News: మాచవరంలో పార్క్ చేసిన ఫోర్డ్ కారులో మృతదేహం.. హత్యా లేదా ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు
కారులో డెడ్ బాడీ ఘటన విజయవాడలో కలకలం రేపుతోంది. మృతదేహాన్ని జడ్‌ఎక్స్‌ఎన్ సిలిండర్ల కంపెనీ ఓనర్ రాహుల్ గా గుర్తించారు. హత్యా లేదా ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
విజయవాడ నగరంలో కారులో ఓ వ్యక్తి మృతదేహం కలకలం రేపుతోంది. మాచవరం పరిధిలో పార్క్ చేసిన కారులో మృతదేహం ఉన్నట్లు వచ్చిన సమాచారంతో స్థానిక పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడిని జడ్‌ఎక్స్‌ఎన్ సిలిండర్ల కంపెనీ యజమాని తాడిగడపకు చెందిన రాహుల్‌గా నిర్థారించారు. జి. కొండూరు మండలం చెరువు మాధవరంలో రాహుల్ కంపెనీ ఉందని తెలుస్తోంది.
మాట్లాడేందుకు వెళ్తున్నానని...
విజయవాడ మొగల్రాజ్ పురం పరిధిలో రాహుల్ అనే వ్యక్తి కారులో మృతి చెందిన ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. తాడిగడపకు చెందిన రాహుల్ పుంగనూరులో గ్యాస్ కంపెనీ ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఒక వ్యక్తితో మాట్లాడేందుకు వెళ్తున్నానని కుటుంబ సభ్యులకు చెప్పారని తెలిపారు.
ఏపీ 16 ఎఫ్ఎఫ్ 9999 బ్లాక్ ఎండీవర్ కారులో
రాహుల్ గురువారం తెల్లవారుజాము వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులకు మాచవరం పోలీసు స్టేషన్ పరిధిలో ఏపీ 16 ఎఫ్ఎఫ్ 9999 బ్లాక్ ఎండీవర్ కారులో మృతదేహం ఉన్నదనే సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కారులో ఉన్న వ్యక్తి మృతదేహం రాహుల్ అని పోలీసులు గుర్తించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాలు, మృతుడి కాల్ డేటాను పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఆత్మహత్యా లేక హత్యా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. దీంతో వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
Also Read: Hyderabad News: ఫేక్ పోలీస్ హల్‌చల్.. డాక్టర్ నుంచి రూ.75 లక్షలు లాగేందుకు కుట్ర, చివరికి..
ఇటీవల తెలంగాణలో కూడా
ఇటీవల తెలంగాణలో ఇటువంటి సంఘటన చోటుచేసుకుంది. కారులో మృతదేహాన్ని పెట్టి తగలబెట్టారు. మెదక్ జిల్లాలోని వెల్దుర్తి మండలం మంగళపర్తి గ్రామ శివారులో ఈ దారుణం చోటు చేసుకుంది. అటవీ ప్రాంతానికి సమీపంలో రోడ్డు పక్కన కారును దగ్ధం చేశారు. ఆ కారు డిక్కీలో గుర్తు తెలియని మృతదేహం కాలిపోయిన స్థితిలో ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇద్దరు మహిళలతో తన భర్తకు సంబంధం ఉందని, దీంతో వారి మధ్య తరచూ గొడవలు జరిగేవని తెలిపారు. వారి కుటుంబసభ్యులే ఈ హత్య చేసి ఉంటారని ఆమె ఫిర్యాదులో పోలీసులకు తెలిపింది. దీంతో పోలీసులు అన్ని కోణాల్లో ఈ కేసుకు దర్యాప్తు చేస్తున్నారు.