Crime News: భార్య, అత్తింటి వేధింపులు భరించలేక మరో భర్త ఆత్మహత్య, చివరి కోరిక తెలుపుతూ సూసైడ్ నోట్
యూపీలోని ఘజియాబాద్ లో భార్య హింస తట్టుకోలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మరణానికి ముందు తన సన్నిహితులకు వాట్సాప్ లో కారణం తెలిపాడు. చివరి కోరిక తెలిస్తే అతడి బాధ అర్థమవుతుంది.

Ghaziabad News: దేశంలో మరోచోట భార్య, ఆమె కుటుంబసభ్యుల వేధింపులు భరించలేక ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఘజియాబాద్‌లోని మోదీనగర్ ప్రాంతంలో నివసిస్తున్న ఓ వ్యక్తి విషం తాగి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. తన భార్య, ఆమె ఫ్యామిలీ పెట్టే చిత్రహింసలు తట్టుకోలేక సూసైడ్ నోట్ రాసి మరీ బలవన్మరణం చెందాడు. తన భార్య వేధింపులే ఆత్మహత్యకు కారణమని వాట్సాప్‌లో తన పరిచయస్తులకు వాట్సాప్‌లో చెప్పాడు. వారు అప్రమత్తం అయ్యేలోపే జరగరాని నష్టం జరిగిపోయింది. బంధువుల ఫిర్యాదు మేరకు మోదీనగర్ పోలీసులు మృతుడి భార్య, ఆమె సోదరుడు, ఆమె వదిన, ఇద్దరు మామలపై కేసు నమోదు చేశారు.
అసలేం జరిగిందంటే..
ఘజియాబాద్‌లోని కృష్ణపురి మోదీనగర్ ప్రాంతానికి చెందిన జైప్రకాశ్ త్యాగి కుమారుడు మోహిత్ త్యాగి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగి. 2020లో సంభాల్ జిల్లాకు చెందిన ప్రియాంక అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వారి వివాహం జరిగిన ఏడాదికి కుమారుడు జన్మించాడు. అప్పటినుంచి ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. భార్య అతన్ని వేధించడం ప్రారంభించిందని కుటుంబసభ్యులు ఆరోపించారు. కారణం లేకున్నా మోహిత్‌ను తిట్టడం, గొడవ పడటం చేసేది. ఎందుకిలా చేస్తున్నావని భర్త అడిగితే నన్ను తప్పుడు కేసులో ఇరికిస్తానని బెదిరించేది. కొన్ని నెలలు మోహిత్ అన్నీ సహించినా వేధింపులు తగ్గలేదు.
మరణానికి భార్యే కారణమని మోహిత్ సూసైడ్ నోట్
6 నెలల క్రితం భార్య ఇంట్లో నగలు తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. మోదీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఎటువంటి విచారణ జరగలేదు. ఇంటికి తిరిగి రమ్మని మోహిత్ తన భార్యను చాలాసార్లు అడిగాడు. ఏప్రిల్ 15న మోహిత్ కుటుంబానికి సంభాల్ పోలీసులు ఫోన్ చేశారు. భార్య ఫిర్యాదు చేసిననట్లు తెలుసుకున్న మోహిత్ చాలా బాధపడ్డాడు. తన చావుకు భార్యే కారణమని ఆరోపిస్తూ తన పరిచయస్తులకు వాట్సాప్‌లో మెస్సేజ్ చేశాడు. వెంటనే విషం తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిన మోహిత్ ను కుటుంబం ఆసుపత్రిలో చేర్పించింది. మరో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మోహిత్ మరణించాడు.
మోహిత్ భార్య, ఆమె కుటుంబ సభ్యులపై మృతుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు తర్వాత చర్యలు తీసుకుంటామని మోడీనగర్ ఏసీపీ చెప్పారు. పోలీసులు ఐదుగురు వ్యక్తులపై, ఒక గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేశారు.
చనిపోయే ముందు మోహిత్ ఏం రాశాడు?
జై ప్రకాష్ త్యాగి కుమారుడు మోహిత్ త్యాగిని ఈ లేఖ రాస్తున్నాను. మాది ఉమ్మడి కుటుంబం. మా కుటుంబంలో ముగ్గురు అన్నదమ్ములు, అమ్మ, నాన్న, ఐదుగురు చిన్న పిల్లలు ఉన్నారు. అన్నదమ్ములందరికీ వివాహాలు అయ్యాయి. (అన్నయ్య పేరు రాహుల్ త్యాగి, అక్క అమృత త్యాగి, తమ్ముడు పేరు రోహిత్ త్యాగి, చెల్లి అంచల్ త్యాగి), సతుపుర గ్రామ నివాసి అయిన నా భార్య ప్రియాంక త్యాగి వల్ల నాకు ఇబ్బందులు రావడంతో ఆత్మహత్య చేసుకుంటున్నాను. నా ఆత్మహత్యకు భార్య ప్రియాంక త్యాగి, ఆమె సోదరుడు పునీత్ త్యాగి, అతడి భార్య నీతు త్యాగి, ప్రియాంక ఇద్దరు మామలు (అనిల్ త్యాగి, విశాల్ త్యాగి) కారణం.
ప్రియాంక, నేను డిసెంబర్ 10, 2020న వివాహం చేసుకున్నాం. ఇది నాకు రెండవ వివాహం. పెళ్లి అయినప్పటి నుండి ప్రియాంక ప్రవర్తన బాగా లేదు. ప్రియాంక, ఆమె కుటుంబం మా నుంచి డబ్బు గుంజడానికే పెళ్లి చేసుకున్నారు. ప్రియాంక ప్రతి విషయంలోనూ నాతో వాదించేది. నా కుటుంబ సభ్యులతో అసభ్యంగా మాట్లాడేది. కుటుంబాన్ని కించపరిచింది. తప్పుడు ప్రచారం చేసి, కేసులు పెట్టి వరకట్నం కేసులో నాతో పాటు నా కుటుంబాన్ని ఇరికించాలని చూసింది. ఇంట్లోంచి డబ్బులు తీసి పుట్టింటికి పంపించేంది.
ప్రియాంక గర్భధారణ సమయంలో బిడ్డను చంపడానికి ప్రయత్నించి నన్ను ఇరికించాలని చూసింది. చాలాసార్లు ఆమెను ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చింది. బిడ్డ పుట్టడం ఆమెకు ఇష్టం లేనట్లుగా. ప్రియాంక నాకు చాలాసార్లు చెప్పింది. సమస్య ఏంటని అడిగితే, నీకు పిల్లల్ని కనడానికి నేను రాలేదు అనేది. బిడ్డ బయట చనిపోవడం కంటే కడుపులో చనిపోవడం మేలు అనేది. ఈ క్రమంలో చికు 17 అక్టోబర్ 2021న జన్మించాడు. ప్రియాంక గానీ, ఆమె కుటుంబం సంతోషపడలేదు. రెండేళ్లు కూడా నాతో సరిగా గడపలేదు. దేవుడి దయ వల్ల చికుకు ఏ హాని జరగలేదు. ఆమె ఇంట్లో ఉన్నంత కాలం, ఆమె నాతో దురుసుగా మాట్లాడేది, పదే పదే గొడవ పడేది. కేసులు పెట్టి మమ్మల్ని జైల్లో పెట్టిస్తా అని బెదిరించేది. ఇంట్లో నగలు, డబ్బు దోచి పుట్టింటికి ఇచ్చేది. నా తల్లి బ్లడ్ క్యాన్సర్ తో 03 ఆగస్టు 2024న చనిపోయింది. 3 నెలల తర్వాత, ప్రియాంక నా ఇంట్లోని దాదాపు 12 నుండి 15 లక్షల రూపాయల బంగారు ఆభరణాలు, లాకర్‌లో ఉంచిన నగదును ఆమె సోదరుడు పునీత్ త్యాగి, కారులో వచ్చిన మరొకరితో చికును తీసుకుని వెళ్లిపోయింది.
ప్లాన్ ప్రకారం జరిగింది.. నిందితులను శిక్షించండి
డబ్బు కోసమే నన్ను పెళ్లి చేసుకుంది. ఆమె తీరు మార్చుకోవాలని చెప్పినందుకు నాతో పాటు కుటుంబంపై కేసులు పెట్టి వేధిస్తోంది. వారి ప్లాన్ నిజమైతే నేను, నా కుటుంబ సభ్యులు జైలుకు వెళ్లాల్సి వస్తుంది. తప్పు చేయకున్నా జైలుకు వెళ్లడం సిగ్గుచేటు. సమాజంలో మా పేరు ప్రతిష్టలు దిగజారుతాయి. అందరూ మేం తప్పు చేశామని అనుకుంటారు. ప్రియాంకకు మద్దతు ఇస్తారు. నేను ఆత్మహత్య చేసుకోకపోతే, మేం చెప్పే నిజాలను ఎవరూ నమ్మరు. ఈ కారణాలతో ఆత్మహత్య చేసుకుంటున్నాను. తప్పు చేసిన వారిని శిక్షించాలి. నా మరణానికి నా భార్య ప్రియాంక, ఆమె కుటుంబసభ్యులు పునీత్ త్యాగి, నీతు త్యాగి, అనిల్ త్యాగి, విశాల్ త్యాగి బాధ్యులు. వారిని అరెస్ట్ చేయాలి. నా కొడుకు (సమర్త్ త్యాగి)ని నా కుటుంబానికి అప్పగించాలి. నా భార్యను, ఆమె కుటుంబాన్ని శిక్షించే వరకు నా అస్థికలను గంగాలో నిమజ్జనం చేయకూదదు. ఇదే నా చివరి కోరిక.






















