Fire Accident in Kakinada: కాకినాడ చక్కెర కర్మాగారంలో మరోసారి పేలుడు, ఇద్దరు మృతి!
Fire Accident in Kakinada: కాకినాడలోని వాకపూడి చక్కెర కర్మాగారంలో మరోసారి పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరి కొంత మంది గాయపడ్డారు.
Fire Accident in Kakinada: కాకినాడలోని వాకపూడి షుగర్ ఫ్యాక్టరీలో మరోసారి పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. గత పది రోజుల క్రితం కూడా ఇధే ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగింది. అప్పుడు కూడా ఇద్దరు కార్మికులు చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. బాయిలర్ పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు కార్మికులు చెబుతున్నారు. అయితే ఈ ప్రమాదంలో గాయపడిన వారిని జీజీహెచ్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు రాగం ప్రసాద్, సుబ్రహ్మణ్యేశ్వర రావుగా గుర్తించారు. ఆస్పత్రి వద్ద కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.
కాకినాడ అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ కామెంట్లు..
సీ ఫ్యాన్ గడ్డర్ పడి ఈ ప్రమాదం జరిగినట్లు కాకినాడ అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. 4వ అంతస్తులో ఉన్న గడ్డర్ మొదటి అంతస్తులో పని చేస్తున్న కార్మికులపై పడి ఇద్దరు కార్మికులు మృతి చెందారని వివరించారు.
కాకినాడ ఆర్డీఓ స్పందన..
ప్యారీ షుగర్ ఫ్యాక్టరీ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందడం చాలా బాధాకరం అని కాకినాడ ఆర్డీఓ తెలిపారు. ప్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ రిపోర్ట్ రాగానే తగిన చర్యలు తీసుకుంటామని వివరించారు. ఫ్యాక్టరీలోని బధ్రతా చర్యలు అన్నీ తనిఖీ చేసే వరకు ఫ్యాక్టరీని సీజ్ చేస్తామని అన్నారు. మృతుల కుటుంబ సభ్యులు, ఫ్యాక్టరీ యాజమాన్యం, కార్మికులతో చర్చించి మృతుల కుటుంబాలకు న్యాయం చేస్తామన్నారు.
పదిరోజుల క్రితం కూడా ఇలాగే పేలుడు..
కాకినాడ రూరల్ పరిధిలోని ప్యారీ షుగర్స్ పరిశ్రమలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, 9 మందికి గాయాలు అయ్యాయి. కన్వేయర్ బెల్టు వద్ద భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను స్థానికంగా ఉన్న ఆసుపత్రులకు తరలించారు.
అసలేం జరిగింది?
కాకినాడ రూరల్ పరిధిలోని వాకలపూడి పారిశ్రామిక ప్రాంతంలోని ప్యారీ షుగర్స్ భారీ పేలుడు జరిగింది. రిఫైనరీలో పేలుడు సంభవించి ఇద్దరు మృతిచెందగా 9 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. విద్యుత్ షాట్ సర్క్యూట్ కారణంగా పేలుడు సంభవించినట్లు అధికారులు, పోలీసులు భావిస్తున్నారు. గోదాంలో చక్కెర బస్తాలు లోడు చేస్తుండగా కన్వేయర్ బెల్టుకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చే సమయంలో పేలుడు జరిగిందని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు.
ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారని పోలీసులు తెలిపారు. మృతులను ఉప్పాడ కొత్తపల్లి మండలం కొండివరం గ్రామానికి చెందిన రాయుడు వీర వెంకట సత్యనారాయణ (36), సామర్లకోట మండలం వేటలపాలెం గ్రామానికి చెందిన వీరమల్ల రాజేశ్వరరావు(45)గా పోలీసులు గుర్తించారు.
గాయపడిన వారిలో పిఠాపురం మండలం చంద్రాడ గ్రామానికి చెందిన బండి వీర వెంకట రమణ(29) పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అతడిని కాకినాడలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. మరో 8 మంది కాకినాడలో పలు ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు. పది రోజుల వ్యవధిలోనే రెండు సార్లు పేలుడు జరగడం.. మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. యజమానుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మృతులకు ఎలాగైనా సరే న్యాయం చేయాలని కోరుతున్నారు.