Manyam News: మన్యం జిల్లాలో విషాదం, ఆడుకుంటూ చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతి
Manyam News: పార్వతీపురం మన్యం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆడుకుంటూ వెళ్లి చెరువులో పడి ఇద్దరు చిన్నారులు చనిపోయారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Manyam News: పార్వతీపురం మన్యం జిల్లా జవదాల గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు చెరువులో పడి చనిపోయారు. ఈ ఘటనతో మృతుల కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. అయితే గ్రామానికి చెందిన మూడేళ్ల జానకి, రెండున్నరేళ్ల కృష్ణ ప్రసాద్ లు కలిసే అంగన్వాడీ కేంద్రానికి వెళ్లారు. అక్కడ మధ్యాహ్నం భోజనం చేసి కలిసే ఇంటికి తిరగి వచ్చారు. పక్కపక్కనే వీరిద్దరి ఇళ్లు ఉండటంతో... అక్కడి నుంచి వచ్చాక కూడా కలిసే ఆడుకున్నారు. అయితే రోజులాగే పిల్లలు ఆడుకుంటున్నారు కదా అని తల్లిదండ్రులు ఇంట్లోనే ఉండిపోయారు.
ఆడుకుంటూ ఆడుకుంటూ పిల్లలు ఇద్దరు సమీపంలో ఉన్న చెరువు వైపు వెళ్లారు. ప్రమాద వశాత్తు అందులో పడి చనిపోయారు. చాలా సేపవడం, ఎండ ఎక్కువగా కొట్టడంతో పిల్లలను చూసేందుకు తల్లిదండ్రులు బయటకు వచ్చారు. బయట ఎక్కడా కనిపించకోవడంతో వెతుకులాట మొదలు పెట్టారు. గ్రామంలో ఉన్న వాళ్లనీ వీళ్లని అడుగుతూ చిన్నారుల కోసం గాలించారు. అయితే చెరువు వైపు వెళ్లినట్లు కనిపించారని ఎవరో చెప్పడంతో అటువైపు వెళ్లారు. పిల్లలు ఇద్దరూ చెరువులో పడి చనిపోవడాన్ని చూసి షాకయ్యారు. ఇప్పటి వరకూ తమ కళ్ల ముందే ఉన్న పిల్లలు చెరువులో శవాలుగా తేలడాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
భార్యపై అనుమానంతో పిల్లలను చెరువులో వేసిన తండ్రి..
భార్య మీద అనుమానంతో సైకోలా వ్యవహరించాడో భర్త. కన్న బిడ్డలను కాలువలో తోసి చంపాడు. గుంటూరు జిల్లాలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. కుంచనపల్లి బాకింహంగ్ కెనాల్ లో చిన్నారుల మృతదేహాలను పోలీసులు గుర్తించారు. తండ్రి వెంకటేశ్వరరావు పిల్లలను చంపి కాలువలో పడేసినట్లు పోలీసుల నిర్థారించారు. మృతులు జోష్ణ(6) బాలిక, షణ్ముఖ వర్మ (4) బాలుడు గుర్తించారు. నిన్నటి నుంచి పిల్లలు కనిపించడంలేదని వెంకటేశ్వరరావు భార్య పెద్దకాకాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
తల్లి ఫిర్యాదుతో విషయం వెలుగులోకి..
పెద్దకాకాని పోలీస్ స్టేషన్ లో తన ఇద్దరు పిల్లలు కనిపించడంలేదని వివాహిత సోమవారం ఫిర్యాదు చేశారు. దీంతో పెదకాకానికి చెందిన జోష్ణ(6), షణ్ముఖ వర్మ(4) కోసం పోలీసుల గాలింపు చేపట్టారు. తాడేపల్లి పరిధి కుంచనపల్లి వద్ద డెల్టా కాల్వలో ఇద్దరు పిల్లలను తండ్రి వెంకటేశ్వరరావు పడేసినట్లు పోలీసులు తెలిపారు. వెంకటేశ్వరరావును పోలీసులు విచారించగా పిల్లలను పడేసిన ప్రదేశాన్ని చూపించాడు. ఆ ప్రదేశంలో పిల్లల మృతదేహాల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. భార్య పై అనుమానంతో పిల్లలను కాల్వలో పడేసినట్లు పోలీసులు తెలిపారు. గజ ఈతగాళ్ల సహాయంతో బకింగ్ హోమ్ కెనాల్ లో ఇద్దరి చిన్నారుల మృతదేహాలను వెలికితీశారు పెదకాకాని పోలీసులు.
కేసు నమోదు...
భార్యపై అనుమానంతో కన్న పిల్లలనే ఓ తండ్రి కడతేర్చాడు. పోలీసుల కథనం ప్రకారం పెదకాకానికి చెందిన వెంకటేశ్వరరావు తన భార్యపై అనుమానం ఉంది. సైకోలా మారిన అతడు ముక్కుపచ్చలారని పసి పిల్లలను కుంచనపల్లిలోని బకింగ్ హామ్ కెనాల్‌లో పడేశాడు. పిల్లలు కనపడకపోవడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు కాలువలో చిన్నారుల మృతదేహాలను గుర్తించి బయటకుతీశారు. అభం శుభం తెలియని పసిపిల్లలను పొట్టన పెట్టుకున్న తండ్రిని పోలీసులు విచారించగా తానే కెనాల్‌లో తోసేశానని ఒప్పుకున్నాడు. పెదకాకాని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.