Quarry Accident: ఏపీలో తీవ్ర విషాదం - క్వారీ ప్రమాదంలో రాళ్లు మీద పడి ముగ్గురు కార్మికులు మృతి
Andhrapradesh News: ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పరిటాల వద్ద జరిగిన క్వారీ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురి ఆచూకీ లభించకపోవడంతో సహాయక చర్యలు చేపట్టారు.
Quarry Accident In NTR District: ఎన్టీఆర్ జిల్లాలో (NTR District) సోమవారం జరిగిన క్వారీ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. కంచికచర్ల (Kanchikacharla) మండలం పరిటాల వద్ద క్వార్ట్జ్ రాత్రి క్వారీలో మైనింగ్ సాగుతోంది. ఉదయం డ్రిల్లింగ్ పనులు చేపట్టిన సమయంలో పై నుంచి లూజు బోల్డర్స్ జారి పెద్ద మొత్తంలో డ్రిల్లింగ్ చేస్తోన్న కార్మికులపై పడ్డాయి. పెద్ద పెద్ద రాళ్ల కింద కార్మికులు చిక్కుకుపోయారు. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురి ఆచూకీ లభించలేదు. వారి కోసం తోటి కార్మికులు సహాయక చర్యలు చేపట్టారు. మృతులను జి.కొండూరు మండలం చెరువు మాధవరం వాసులుగా గుర్తించారు. మృతుల కుటుంబీకులు ఆందోళనకు దిగారు. కాగా, ఈ జిల్లాలో పెద్ద ఎత్తున మైనింగ్ జరుగుతోందని.. బ్లాస్టింగ్‌లతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు తెలిపారు.
తిరుపతిలో తీవ్ర విషాదం
అటు, తిరుపతి (Tirupati) జిల్లాలోనూ ఆదివారం తీవ్ర విషాదం జరిగింది. ఏర్పేడు మండలం వెంకటగిరి రహదారిపై ఆమడూరులో ఓ తల్లి, ఇద్దరు పిల్లలపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తల్లి సహా ఓ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో చిన్నారి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాళహస్తి మండలం రామానుజపల్లిలోని ఎస్సీ కాలనీకి చెందిన శారద, శివ దంపతులు. వీరికి కుమారుడు గురు కార్తిక్ (4), కుమార్తె గురువైష్ణవి (2) ఉన్నారు. శనివారం తన ఇద్దరు పిల్లలతో కలిసి శారద తన తల్లి విజయమ్మ ఇంటికి వెళ్లింది. ఆదివారం సాయంత్రం అక్కడి నుంచి తిరిగి తన ఊరికి వచ్చింది. తల్లి విజయమ్మ, ఇద్దరు పిల్లలతో ఊరికి వచ్చిన శారద రామానుజపల్లి క్రాస్ రోడ్డు వద్ద దిగి తన భర్తకు కాల్ చేసి చెప్పింది. భర్త బైక్ తీసుకుని వస్తుండగా.. అతని కోసం ఎదురుచూస్తూ రోడ్డు పక్కనే పిల్లలతో ఎదురుచూసింది.
దూసుకెళ్లిన లారీ
ఇదే సమయంలో విజయవాడ నుంచి చెన్నైకి వెళ్తున్న లారీ అతివేగంగా అదుపు తప్పి వీరిపైకి దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో రెండేళ్ల చిన్నారి వైష్ణవి అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాదాన్ని గుర్తించిన స్థానిక టోల్ ప్లాజా సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. జాకీల సాయంతో చక్రాలను పైకి లేపి ఇరుక్కున శారదను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ఆమెతో పాటు తీవ్ర గాయాలైన తల్లి విజయమ్మ, గురుకార్తీక్‌లను శ్రీకాళహస్తి ఆస్పత్రికి తరలించారు. మార్గంమధ్యలోనే శారద మృతి చెందింది. విషయం తెలుసుకున్న మృతులు బంధువులు అక్కడికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Naidupeta News: గురుకుల పాఠశాలలో 100 మంది విద్యార్థులకు అస్వస్థత - తిరుపతి జిల్లాలో ఘటన