Naidupeta News: గురుకుల పాఠశాలలో 100 మంది విద్యార్థులకు అస్వస్థత - తిరుపతి జిల్లాలో ఘటన
Andhrapradesh News: తిరుపతి జిల్లా నాయుడుపేటలోని గురుకుల పాఠశాలలో దాదాపు 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అటు, కర్నూలు జిల్లా సుంకేశ్వరి గ్రామంలో అతిసార ప్రబలింది.
100 Students Sick In Naidupeta Gurukul School: తిరుపతి (Tirupati) జిల్లాలో 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడం ఆందోళన కలిగించింది. నాయుడుపేటలోని (Naidupeta) డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బాలుర గురుకుల పాఠశాలలో 50 మంది విద్యార్థులు స్వల్ప, 50 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో బాధ పడుతోన్న విద్యార్థులను సిబ్బంది స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రెండు రోజుల క్రితం వండిన ఆహార పదార్థాలు వడ్డించడంతోనే ఇలా జరిగిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. విద్యార్థులను స్థానిక తహసీల్దార్ కల్యాణి, మున్సిపల్ కమిషనర్ జనార్దన్ రెడ్డి పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఈ ఘటనతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు.
మంత్రి స్పందన
విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి స్పందించారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన ఆయన.. తిరుపతి జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తన పర్యటనలు అన్నీ వాయిదా వేసుకుని నాయుడుపేటకు బయలుదేరారు.
కర్నూలు జిల్లాలో డయేరియా
కర్నూలు జిల్లాలో డయేరియా కలకలం రేగింది. మంత్రాలయం మండలం సుంకేశ్వరి గ్రామంలో అతిసార ప్రబలి 40 మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితులు మంత్రాలయం, ఆదోని ఆస్పత్రుల్లో చేరారు. వాంతులు, విరోచనాలతో ఓ బాలిక మృతి చెందింది. కలుషిత నీటి వల్లే డయేరియా విజృంభిస్తోందని గ్రామస్థులు పేర్కొంటున్నారు. మంచినీటిని సరఫరా చేయాలని అధికారులను కోరినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని.. శుద్ధ నీటిని సరఫరా చేయాలని కోరుతున్నారు.
అటు, గ్రామంలో అతిసార ప్రబలడంపై మంత్రి టీజీ భరత్ స్పందించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వైద్య సిబ్బందిని ప్రజలకు అందుబాటులో ఉంచాలని.. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేయాలని ఆదేశించారు.