Crime News: మహిళతో ఇల్లీగల్ ఎఫైర్ - అన్నకు కరెంట్ షాక్ ఇచ్చి చంపేసిన తమ్ముడు, మెదక్ జిల్లాలో దారుణం
Medak News: మెదక్ జిల్లా శివ్వంపేటలోని ఓ తండాలో దారుణం జరిగింది. ఓ మహిళతో అక్రమ సంబంధం కారణంగా సొంత అన్నను ఓ సోదరుడు కరెంట్ షాక్ ఇచ్చి హతమార్చాడు. పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేశారు.

Younger Brother Killed Her Brother In Medak District: తాను చనువుగా ఉండే మహిళతో తమ్ముడు కూడా చనువుగా ఉండడంతో ఆ వ్యక్తి తమ్మున్ని మందలించాడు. దీంతో కోపం పెంచుకున్న తమ్ముడు అన్నను కరెంట్ షాక్‌తో దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా (Medak District) శివ్వంపేట మండలం బిక్యతండా గ్రామ పంచాయతీ నాను తండాకు చెందిన అన్న తేజావత్ శంకర్ (28) కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శంకర్ భార్య నాలుగేళ్ల క్రితం పుట్టింటికి వెళ్లిపోగా.. కూలీ పనులు చేసుకునే మరో మహిళతో అతనికి వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే, అదే మహిళతో తమ్ముడు గోపాల్ కూడా చనువుగా ఉండేవాడు. ఇది గమనించిన శంకర్ ఇద్దరినీ మందలించాడు. ఇదే విషయమై తరచూ వీరి మధ్య గొడవలు కూడా జరిగేవి.
అన్నను అడ్డు తప్పించాలని..
ఇదే క్రమంలో ఎలాగైనా అన్న శంకర్‌ను గోపాల్ అడ్డు తప్పించాలని భావించాడు. శుక్రవారం రాత్రి అన్నదమ్ములు ఇద్దరూ కూడా ఒకే రూంలో పడుకున్నారు. తెల్లవారుజామున అందరి కంటే ముందే నిద్ర లేచి అన్న కాలు, చేతికి కరెంట్ వైర్ చుట్టి దాన్ని దగ్గర్లోని ప్లగ్‌లో పెట్టి స్విచ్ వేశాడు. దీంతో అన్న కరెంట్ షాక్‌తో కేకలు వేయగా.. ఈ అరుపులు విని తండ్రి చందర్ ఒక్కసారిగా అక్కడకు వచ్చాడు. తండ్రిని చూసిన గోపాల్ పారిపోయాడు.
శంకర్ నిర్జీవంగా పడి ఉండడాన్ని చూసిన తండ్రి కన్నీళ్లు పెట్టుకున్నాడు. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు గ్రామానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తండ్రి, గ్రామస్థుల నుంచి వివరాలు సేకరించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గంటల్లోనే నిందితుడి అరెస్ట్
నిందితుడు గోపాల్‌ను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేశారు. 4 గంటల వ్యవధిలోనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని కోర్టులో ప్రవేశపెట్టగా జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. గోపాల్ గంజాయి తీసుకుంటూ జులాయిగా తిరిగేవాడని.. ఇటీవలో ఓ చోరీ కేసులో జైలుకు కూడా వెళ్లి వచ్చాడని పోలీసులు తెలిపారు.





















