Telangana: పెళ్లి చేయాలన్న భయంతో కుమార్తెను చంపేసిన తండ్రి -మెదక్ జిల్లాలో దారుణం
Crime News: తెలంగాణలో ఓ కసాయి తండ్రి కన్నబిడ్డను కడతేర్చాడు. పెద్దయ్యాక పెళ్లి చేయలేమోనన్న భయంతో చిన్నారి తాగే కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలిపి హత్య చేశాడు
Medak News: బంధాలు, బాంధవ్యాలను భయాందోళనలు చిదిమేస్తున్నాయి. విపరీతమైన మానసిక ఒత్తిడితో మనిషి అసలు ఆలోచనాశక్తినే కాదు...విచక్షణా జ్ఞానాన్ని కూడా మరిచిపోతున్నాడు. కాలంతోపాటు పరుగెడుతున్న పోటీ ప్రపంచంలో ఆడపిల్లను పెంచి పోషించి పెద్దదాన్ని చేసి పెళ్లి చేయాలేమన్న భయంతో ...కంటికి రెప్పలా కాపాడాల్సిన ఓ తండ్రి తన చేతులతోనే చిన్నారి ఉసురు తీశాడు. కూల్‌డ్రింక్(Cool Drink) కావాలని అడిగిన బిడ్డకు అందులో పురుగుల మందు కలిపి ఇచ్చి తాపించాడు. ఈ హృదయ విధార ఘటన తెలంగాణలోని మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది.
కన్నతండ్రే కాల యముడయ్యాడు
శ్రావణమాసం...ఇంట్లో ఆడపిల్ల పట్టీలు పెట్టుకుని ఇల్లంతా సందడిగా తిరుగుతుంటే సాక్షాత్తు లక్ష్మీదేవీ నట్టింట నడయాడినట్లు ఉంటుందంటారు. ఇప్పుడున్న రోజుల్లో మగపిల్లాడు కన్నా...ఆడపిల్లే ముద్దు అనేంతగా సమాజం మారుతోంది. బంగారు తల్లులు చదువుల దగ్గర నుంచి ఉద్యోగాల వరకు అన్నింటా ముందుంటున్నారు. తల్లిదండ్రులు తలెత్తుకుని తిరిగేలా విశ్వక్రీడాల్లోనూ విజయాలు సాధిస్తుంటే....మరోవైపు ఆడపిల్లను పెంచి పెద్దచేసి పెళ్లి చేయలేమోనన్న బెంగతో ఓ తండ్రి తొమ్మిదేళ్ల కుమార్తెకు కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు(Poison) కలిపి అత్యంత పాశవికంగా హత్య చేసిన ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది.
ఆర్థిక ఇబ్బందులతో విచక్షణ మరిచి
మెదక్(Medak) జిల్లా వెల్దుర్తి సమీపంలోని శేరీలలో శ్రీశైలం, సౌందర్య దంపతులకు ఇద్దురు బిడ్డలు. వారి కుటుంబం ఎనో ఏళ్లుగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోంది. ఈ విషయంలోనూ తరుచూ గొడవలు కూడా జరుగుతున్నాయి. ఇలా అయితే బిడ్డలను పెంచేది ఎలా..? వాళ్లను ప్రయోజకులను చేసేది ఎలా అంటూ భార్య భర్తను కోప్పడేది. కుమార్తె నిఖితకు తొమ్మిదేళ్లు రానే వచ్చాయి. దీంతో శ్రీశైలంలో ఆందోళన మొదలైంది. ఈ అప్పులతో బిడ్డలకు కనీసం సరిగ్గా తిండే పెట్టలేకపోతున్నానని..ఇక ఆడబిడ్డ పెళ్లి ఎలా చేయగలనన్న ఆందోళన మొదలైంది. ఎప్పుడో చేయాల్సిన పెళ్లి గురించి అతిగా ఆలోచించడం మొదలుపెట్టాడు. అతని మానసిక పరిస్థితులు విచక్షణను కోల్పోయేలా చేశాయి. అంతే కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే ఆ చిన్నారి ప్రాణాలు తీశాడు.
కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు
కూల్‌డ్రింక్ కావాలాని అడిగిన కన్నకుమార్తెకు ఇదే అదనుగా భావించి శ్రీశైలం అందులో పురుగుల మందు కలిపి తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఆ కూల్‌డ్రింక్ బాటిల్ చిన్నారి చేతికి ఇచ్చి తాపించాడు. మే 31న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తీవ్ర అస్వస్థతకు గురైన చిన్నారి నిఖితను కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. నాలుగురోజులపాటు మృత్యువుతో పోరాడిన నిఖిత...జూన్ 3న తనువు చాలించింది. తల్లి సౌందర్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి శ్రీశైలాన్ని అరెస్ట్ చేశారు. కోర్డు అతడికి రిమాండ్ విధించింది.
అతిగా ఆలోచించొద్దు
చిన్నచిన్న విషయాలకు అతిగా అలోచించడం వల్లే సమాజంలో ఇలాంటి అనార్థాలు జరుగుతున్నాయని మానసిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో బతకడం గురించి ప్రజలు ఎక్కువగా ఆలోచించే వాళ్లు కాదని....పెద్దపెద్ద కోర్కెలు కూడా ఎక్కువ ఉండేవి కావని చెబుతున్నారు. పక్కవారిని చూసి తమను తాము ఎప్పుడూ పోల్చుకునే వారు కాదన్నారు.అందుకే ఒకే కుటుంబంలో కనీసం పదిమంది పిల్లలు ఉన్నా....ఎలాంటి ఇబ్బంది లేకుండానే ఉమ్మడి కుటుంబాలను వాళ్లు నిర్వహించగలిగారని చెబుతున్నారు. కానీ ఇప్పుడు ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడటం ప్రతి ఒక్కరికీ అలవాటైందన్నారు. పక్కవాళ్లు ఏమనుకుంటారోనన్న ఆందోళనతోనే ఏరికోరి కష్టాలు కొని తెచ్చుకుంటున్నారని తెలిపారు.
Also Read: గృహ జ్యోతి పథకానికి మళ్లీ దరఖాస్తులు స్వీకరణ.. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశాలు