Telangana: గృహ జ్యోతి పథకానికి మళ్లీ దరఖాస్తులు స్వీకరణ.. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశాలు
Gruha Jyoti Scheme : గృహ జ్యోతి పథకంపై ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కీలక సమీక్ష నిర్వహించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి నుంచి మరోసారి దరఖాస్తులు స్వీకరించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.
Key Update On Gruha Jyoti Scheme : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న గృహజ్యోతి పథకం కోసం మళ్లీ దరఖాస్తులను అర్హులైన వారి నుంచి స్వీకరించనున్నారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమంలో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చాలన్న ఉద్దేశంతో మరోసారి దరఖాస్తులను తీసుకోవాలని ప్రభుత్వం భావించింది.
మరోసారి అప్లికేషన్లు తీసుకునేందుకు చర్యలు చెపట్టాలని అధికారులకు మంత్రి ఆదేశాలను జారీ చేశారు. అర్హత ఉన్నప్పటికీ గతంలో దరఖాస్తులు చేయనివారి నుంచి అప్లికేషన్లు తీసుకోవాల్సిందిగా ఆయన నిర్దేశించారు. మహాత్మ జ్యోతిబాపూలే ప్రజా భవన్‌లో ఇంధనశాఖతోపాటు డిస్కమ్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు వివిధ అంశాలపై కీలక ఆదేశాలను జారీ చేశారు. రాజకీయ కారణాలు, ఇతర సాంకేతిక ఇబ్బందులు వల్ల అనేక మంది దరఖాస్తు చేయలేని పరిస్థితి ఏర్పడింది. అటువంటి వారికి అవకాశం కల్పించాల్సిందిగా ఉపముఖ్య మంత్రి దృష్టికి పలువురు సమస్యను తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన అధికారులకు తాజాగా ఆదేశాలు ఇచ్చారు.
Also Read: రాజ్యసభకు కేకే స్థానంలో అభిషేక్ మను సింఘ్వి- తెలంగాణ నుంచి పేరు ఖరారు
45,81,676 మందికి లబ్ధి
గృహ జ్యోతి పథకంలో భాగంగా 45,81,676 మంది 200 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్ ప్రయోజనం పొందుతున్నారని అధికారులు ఈ సందర్భంగా నివేదించగా, తెల్ల రేషన్ కార్డు కలిగి ఇప్పటి దాకా దరఖాస్తు చేసుకోని వారి నుంచి మళ్లీ దరఖాస్తులు స్వీకరించి పథకాన్ని అమలు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా జల, థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో మరమ్మత్తులపై తక్షణమే నిర్ణయం తీసుకోవడానికి వీలుగా ముగ్గురు అధికారులతో కమిటీని ఏర్పాటు చేయాలని, విద్యుత్ ఉత్పాదన ఆగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
2023 డిసెంబర్ ముందు గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగా జరిగిన నష్టాలపైన నివేదికలను అందించాలని ఆయన కోరారు. జల విద్యుత్ కేంద్రాల్లో ఎటువంటి సాంకేతిక సమస్యలు ఎదురైనా తన దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేశారు. దక్షిణ డిస్కమ్ పరిధిలో 227 సబ్ స్టేషన్ల నిర్మాణానికి కసరత్తు చేస్తున్నామని, ఇందులో 114 సబ్ స్టేషన్లకు స్థలాల సమస్య ఉందని అధికారులు మంత్రి దృష్టికి తీసుకురాగా, దీనిపై కలెక్టర్లతో చర్చలు చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా రామగుండంలో 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ నిర్మాణంపై చర్చ జరిగింది. ఒక మెగావాట్ ప్లాంట్ కట్టడానికి 0.82 ఎకరాల భూమి అవసరం ఉంటుందని, 800 మెగావాట్ల ప్లాంట్ కోసం 650 ఎకరాలు అవసరమని, రామగుండంలో 700.24 ఎకరాల భూమి లభ్యత ఉందని అధికారులు గుర్తు చేశారు. దీని కోసం తగిన ప్రతి పాదనలు సిద్ధం చేయాలని విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా థర్మల్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు ఎలా ఉన్నాయన్న దానిపైనా ఉప ముఖ్యమంత్రి ఆరా తీశారు.
ఏమిటీ గృహ జ్యోతి పథకం..?
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకంగా తీసుకొని గృహ జ్యోతి పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకంలో భాగంగా తెలంగాణలో అర్హత కలిగిన కుటుంబాల గృహ అవసరాల కోసం 200 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్తును అందిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మందికి ఈ పథకంలో భాగంగా ఉచిత విద్యుత్ పొందుతున్నారు. అయితే, కొన్ని సాంకేతిక కారణాలు, రాజకీయపరమైన ఇబ్బందులతో అనేకమంది ఈ పథకంలో భాగంగా లబ్ధిని పొందలేకపోతున్నారు. ఈ విషయాన్ని పలువురు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడంతో అటువంటి వారికి కూడా ఈ పథకాన్ని అమలు చేయాల్సిందిగా ఆయన ఆదేశాలను జారీ చేశారు. అందుకు అనుగుణంగా అర్హులైన వారి నుంచి దరఖాస్తులను మరోసారి స్వీకరించి వారికి ఈ పథకాన్ని అమలు చేయాలని స్పష్టం చేశారు. తాజా నిర్ణయంతో రాష్ట్రంలోని కొన్ని వేల మందికి ఈ పథకంలో భాగంగా లబ్ధి చేకూరనుంది.
Also Read: ఏపీ మాకు పోటీ కాదు, మాతో హైదరాబాద్ ఉంది - కాగ్నిజెంట్ క్యాంపస్ ప్రారంభించిన రేవంత్ రెడ్డి