Guvvala Balraj Joins BJP: రాహుల్ గాంధీ ఫేక్ ఇండియన్, ఆపరేషన్ సిందూర్ మీద అవాస్తవాలా ? రామచందర్ రావు ఫైర్
Achampet News | అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆదివారం నాడు రామచందర్ రావు సమక్షంలో బీజేపీలో చేరారు. పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు.

Guvvala Balraj joins in BJP | హైదరాబాద్: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు భారతీయ జనతా పార్టీలో చేరారు. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు సమక్షంలో ఆదివారం నాడు గువ్వల బాలరాజు కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. న్యాయవాదిగా సేవలు అందించిన గువ్వల బాలరాజు చిన్న వయసులోనే ఎమ్మెల్యే అయి అట్టడుకు వర్గాల వారికి సేవ చేశారని, వారి అభివృద్ధి కోసం కృషి చేశారని కొనియాడారు. గువ్వల బాలరాజు అచ్చంపేట నియోజకవర్గానికే కాదు తెలంగాణ అభివృద్ధిలో భాగం కావాలని ఆకాంక్షించారు.
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు మాట్లాడుతూ.. గతంలో బీఆర్ఎస్ పార్టీ తమను సున్నా సీట్లు అని వెక్కిరించేవారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. మన బలం పెరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ 13 శాతానికి పైగా ఓట్ల శాతం వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లో 36 శాతానికి పైగా ఓట్లతో 8 సీట్లు నెగ్గింది. ఇప్పుడు బీఆర్ఎస్ పని సున్నా అయింది. తరువాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్లలో 70 శాతం వరకు ఓట్లు సాధించారు. కాంగ్రెస్ సీటును సైతం బీజేపీ కైవసం చేసుకుంది. తెలంగాణలో బీజేపీ అభివృద్ధి చెందుతోంది అనడానికి ఇవే నిదర్శనం.
రేవంత్ రెడ్డి కొన్ని రోజులు హైదరాబాద్‌లోనే ఉండాలి..
హైదరాబాద్‌లో భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని రోజులైనా ఢిల్లీ వెళ్లకుండా హైదరాబాద్‌లో ఉండాలి. మీ శాఖల పని ఎవరు చూస్తారు. వాజ్‌పేయి ప్రభుత్వం నుంచి నేటి మోదీ వరకు ఎవరూ హైదరాబాద్‌ను విస్మరించలేదు. తెలంగాణనే బీజేపీకి గేట్ వే. గువ్వల బాలరాజుతో పాటు పలువురు బీజేపీలో చేరుతున్నారు. తాను చేసిన జిల్లా పర్యటనలో భాగంగా 16 జిల్లాలకు వెళ్లి వేల కార్యకర్తలను కలిశాను. ప్రజా సమస్యల మీద వేలాది ఫిర్యాదులు వచ్చాయి. అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రజలు రెండు పార్టీలకు అవకాశం ఇచ్చి చూశారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది బీజేపీనే. త్వరలో మిగతా జిల్లాల్లో పర్యటనలు మొదలుపెడతాను. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించాలి.
రాహుల్ గాంధీ ఫేక్ ఇండియన్..
హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన సమయంలో రాహుల్ గాంధీకి ఫేక్ ఓట్లు అనేది గుర్తుకురాలేదు. మహారాష్ట్ర, హర్యానాలో కాంగ్రెస్ ఓడిపోయిన తరువాత బిహార్ విషయం బయటకు తీసి SIR అంశంపై దుష్ప్రచారం చేస్తున్నారు. బిహార్ లో కూడా ఓడిపోతామన్న భయంతో రాహుల్ గాంధీ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. ఫేక్ ఇండియన్ అయిన రాహుల్ గాంధీకి ఫేక్ ఓట్ల మీద మాట్లాడే నైతిక హక్కులేదు. ఆపరేషన్ సిందూర్ మీద అవాస్తవాలు ప్రచారం చేయడం, ఎన్నో విషయాలు వ్యతిరేకించిన నువ్వు కచ్చితంగా ఫేక్ ఇండియన్. బిహార్ లో ఓటమి భయంతో ముందుగానే ఫేక్ ఓట్లు, ఓట్ల చోరీ అని ఆరోపణలు చేస్తున్నాడు రాహుల్ గాంధీ. రాతపూర్వకంగా ఫిర్యాదులు చేయమంటే చేయడు. కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోయింది. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణలో బీజేపీ ఓడిపోవడం నిజం కాదా అని ప్రశ్నించారు.






















