Srushti Fertility Centre: సృష్టి హాస్పిటల్ కేసులో కీలక పరిణామం- రంగంలోకి దిగిన ఈడీ, పోలీసులకు లేఖ
Srushti Hospital Case: సృష్టి హాస్పిటల్ కేసులో మనీలాండరింగ్ జరిగిందని పోలీసులు గుర్తించడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. కేసు వివరాలను తమకు ఇవ్వాలని హైదరాబాద్ పోలీసులకు లేఖ రాసింది.

Srushti Fertility Centre In Hyderabad | హైదరాబాద్: సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసు తీవ్రత జాతీయ స్థాయికి చేరింది. డాక్టర్ నమ్రత (Dr Athaluri Namratha)కు చెందిన సృష్టి హాస్పిటల్ పెద్ద ఎత్తున నగదు లావాదేవిలు జరపడంతో మనీల్యాండరింగ్ ఆరోపణలు వచ్చాయి. దాంతో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సృష్టి హాస్పిటల్ కేసులో Enforcement Directorate (ఈడీ) రంగ ప్రవేశం చేసింది. తమకు కేసు వివరాలను తెలియజేయాలని ఈడీ అధికారులు హైదరాబాద్ పోలీసులకు లేఖ రాశారు.
8 రాష్ట్రాల్లో కార్యకలాపాలు
డాక్టర్ నమ్రత సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ పేరుతో 8 రాష్ట్రాల్లో కార్యకలాపాలు సాగించినట్లు పోలీసులు గుర్తించారు. దాదాపు 80 మంది పిల్లలను విక్రయించి రూ.25 కోట్ల వరకు వసూలు చేసినట్లు భావిస్తున్నారు. ఆ డబ్బును డాక్టర్ నమ్రత విదేశాల్లో పెట్టుబడులు పెట్టినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నమ్రతా బ్యాంక్ ఖాతాలతోపాటు, సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ బ్యాంక్ లావాదేవీలను పరిశీలించిన అధికారులు మనీ లాండరింగ్ జరిగిందని గుర్తించారు. సృష్టి ఫర్టిలిటీ సెంటర్ డాక్టర్ నమ్రత ఎనిమిది రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. చైల్డ్ ట్రాఫికింగ్ ద్వారా కోట్ల రూపాయలు సంపాదించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగిందన్న ఆరోపణలతో ఈడీ రంగంలోకి దిగింది.
సంతానలేమితో వస్తున్న దంపతులే ఆమె టార్గెట్
సంతానం కలగడం లేదని ఆస్పత్రికి వస్తున్న దంపతులను లక్ష్యంగా చేసుకుని ఐవీఎఫ్ విధానంలో పిల్లలు పుడతారని నమ్మించి వారి వద్ద నుంచి లక్షల రూపాయాల్లో వసూలు చేసినట్లు డాక్టర్ నమ్రతపై ఆరోపణలున్నాయి. బిక్షాటన చేసేవారు, మద్యం తాగడానికి డబ్బుల కోసం చూసే వారిని తీసుకెళ్లి వారికి వెయ్యి రూపాయల చొప్పున ఇచ్చి వారి వద్ద నుంచి స్పెర్మ్ కలెక్ట్ చేసి ఐవీఎఫ్ చేశారని సైతం ఆరోపణలు వచ్చాయి. ఆపై నవజాత శిశువులను కొనుగోలు చేసి వారినే ఐవీఎఫ్ ద్వారా పుట్టిన పిల్లలు అని డాక్టర్ నమ్రత, హాస్పిటల్ సిబ్బంది ఎందరో దంపతుల నుంచి లక్షల రూపాయల చొప్పున వసూళ్లకు పాల్పడ్డారు.
నిందితులు అరెస్ట్
ఇటీవల విజయవాడ పోలీసులు ఒక నవజాత శిశువును అమ్ముతున్న గ్యాంగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ గ్యాంగ్‌లో అజిత్‌సింగ్ నగర్‌కు చెందిన ముగ్గురు మహిళలు ఉన్నారు. ఈ గ్యాంగ్ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తూ పిల్లలను అమ్ముతున్నట్లు పోలీసులు తెలిపారు. విజయవాడలో ఇలాంటి మూడు నుంచి నాలుగు గ్యాంగ్లు క్రియాశీలంగా ఉన్నాయని సమాచారం. ఈ గ్యాంగ్లకు సృష్టి హాస్పిటల్‌తో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ గ్యాంగ్ సభ్యులు సృష్టి హాస్పిటల్ హైదరాబాద్ ఆఫీస్, విజయవాడ బ్రాంచ్‌ను సైతం సందర్శించినట్లు పోలీసులకు ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ కేసులో పోలీసులు ఇదివరకే ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. డాక్టర్ నమ్రత కేసు విచారణలో పోలీసులకు సహకరించడం లేదు. పైగా త్వరలోనే బయటకు వచ్చాక తనను ఇబ్బంది పెట్టిన వారి సంగతి చూస్తానని చెప్పడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఏపీలో జరిగిన దానికి హైదరాబాద్ లో కేసు నమోదు విచారణ చేపట్టారని ఆమె తరఫు లాయర్లు కోర్టులో పిటిషన్ వేశారు.






















