Cognizant New Campus: ఏపీ మాకు పోటీ కాదు, మాతో హైదరాబాద్ ఉంది - కాగ్నిజెంట్ క్యాంపస్ ప్రారంభించిన రేవంత్ రెడ్డి
Cognizant New Campus at Kokapet In Hyderabad | తెలంగాణలో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ ను బుధవారం నాడు ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు పాల్గొన్నారు.
Revanth Reddy Inaugurates Cognizant New Campus at Kokapet In Hyderabad | హైదరాబాద్: ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ హైదరాబాద్‌లో మరో క్యాంపస్ అందుబాటులోకి తెచ్చింది. కోకాపేటలోని జీఏఆర్ టవర్‌లో 10 లక్షల చదరపు అడుగుల్లో ఏర్పాటు చేసిన కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ కార్యాలయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, అధికారులు పాల్గొన్నారు. ఈ కొత్త క్యాంపస్ ఏర్పాటుతో దాదాపు 15 వేల కొత్త ఉద్యోగావకాశాలు రానున్నాయి.
కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘అమెరికా, దక్షిణ కొరియా పది రోజుల పర్యటన తర్వాత ఈరోజే తిరిగి వచ్చాము. అమెరికా, కొరియాలో మేం కలిసిన ప్రతి ఒక్క వ్యాపారవేత్త, కార్పోరేట్ లీడర్స్ తెలంగాణ, హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు సానుకూలంగా స్పందించారు. మా విదేశీ పర్యటన ద్వారా రూ.31,500 కోట్ల పెట్టుబడులు హామీ రాగా, వాటి ద్వారా 30,750కి పైగా ఉద్యోగాలు లభించనున్నాయి. త్వరలోనే ఆ కంపెనీలతో మరిన్ని ఒప్పందాలు కుదుర్చుకోనున్నాం. పెట్టుబడులకు సంబంధించి సమావేశాల నిర్వహణ కోసం ఇన్వెస్టర్ టాస్క్ ఫోర్స్ (Investor Task Force)ను ఏర్పాటు చేస్తాం’ అన్నారు.
ఫ్యూచర్ తెలంగాణ స్టేల్ ఇలా ఉండనుంది..
తెలంగాణ రాష్ట్రానికి భవిష్యత్తులో మూడు రింగ్స్ ఉన్నాయి. మొదటిది కోర్ అర్బన్ ఏరియా హైదరాబాద్ గా ఉంటుంది. రెండోది సెమీ అర్బన్ ఏరియా. ఇక్కడ మేము తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. మూడోది రీజనల్ రింగ్ రోడ్ (RRR) బయట ఉన్న రూరల్ తెలంగాణ ఓ క్లస్టర్ గా ఉండనుంది. అన్ని రకాల ఆధునిక సౌకర్యాలతో ఆసియాలోనే అత్యుత్తమ గ్రామాలను ఇక్కడ అభివృద్ధి చేస్తాం. వచ్చే 10 ఏళ్లలో తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనేది మా సంకల్పం. కాగ్నిజెంట్ విస్తరణకు పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చా. హైదరాబాద్‌లో కాగ్నిజెంట్‌కు ఎంతో ప్రాధాన్యత ఉంది. హైదరాబాద్ నగరానికి నాలుగు వందల ఏళ్లకు పైగా చరిత్ర ఉంది.
ఫోర్త్ సిటీ.. ఫ్యూచర్ సిటీగా డెవలప్
రాజీవ్ గాంధీ కృషితో హైదరాబాద్ లో ఐటీ అభివృద్ధికి పునాది పడింది. ఆ తరువాత చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఐటీ అభివృద్ధిని కొనసాగించారు. సైబరాబాద్ సిటీని అభివృద్ధి చేశారు. హైదరాబాద్ లాగే కాగ్నిజెంట్ కూడా అంచెలంచెలుగా అభివృద్ధి చెందింది. రాష్ట్రంలోనే అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తున్న రెండో సంస్థగా కాగ్నిజెంట్ గుర్తింపు పొందింది. రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉన్నా.. హైదరాబాద్ ను అభివృద్ధి చేయడంలో ఎలాంటి భేషజాలు లేవు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తరహాలోనే ఫోర్త్ సిటీ.. ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయబోతున్నాం. మా చిత్తశుద్ధి ఏమిటో ఫ్యూచర్ సిటీ అభివృద్దే నిరూపిస్తుంది.
మా పోటీ ఏపీ, కర్ణాటకతో కాదు.. మా పోటీ ప్రపంచంలోని అగ్రదేశాలతోనే. పక్క రాష్ట్రాలలో ఎక్కడా హైదరాబాద్ లాంటి సిటీ లేదు. పక్క రాష్ట్రాలతో మాకు పోటీ లేదు. హైదరాబాద్ సిటీ ఎల్లప్పుడూ పెట్టుబడులకు అనువైన ప్రాంతం. పారిశ్రామిక వేత్తలు రండి పెట్టుబడులు పెట్టండి.. మీకు కావలసిన సౌకర్యాలను తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని’ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
2002లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కేవలం 180 మంది ఉద్యోగులతో హైదరాబాద్‌లో కాగ్నిజెంట్ తొలి కార్యాలయం ప్రారంభించింది. కొత్త టెక్నాలజీతో దూసుకెళ్తోన్న కాగ్నిజెంట్ సంస్థలో ఇప్పుడు నాలుగు చోట్ల కలిపి మొత్తం 18 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇటీవల (ఈనెల 5న) అమెరికా పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డితో కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్ సమావేశం కాగా, హైదరాబాద్ లో తమ 5వ కొత్త క్యాంప్‌సను ప్రకటించారు. తద్వారా మెషిన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజనీరింగ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ సొల్యూషన్స్ సహా పలు కొత్త టెక్నాలజీలపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తామని సంస్థ పేర్కొంది.