Begging banned in AP: ఏపీలో భిక్షాటనకు పూర్తి నిషేధం - బెగ్గర్లకు పునరావాసం- చట్టం అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం
No Begging: ఏపీలో భిక్షాటన నిషేదిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులుజారీచేసింది. భిక్షాటన చేసే వారికి ప్రత్యేక పునరావాసం కల్పించనుంది.

AP government issues orders banning begging in AP: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా భిక్షాటనను పూర్తిగా నిషేధించేందుకు చర్యలు ప్రారంభించింది. 'భిక్షాటన నివారణ (సవరణ) చట్టం–2025' అధికారికంగా అమలులోకి వచ్చింది. వ్యవస్థీకృత భిక్షాటన మాఫియాను గుర్తించి నిర్మూలించడంతో పాటు, సమగ్ర పునరావాసం కల్పించేలా రూపొందించారు. ఈ చట్టానికి గవర్నర్ అక్టోబర్ 15న ఆమోదముద్ర వేశారు. అక్టోబర్ 27న ఆంధ్రప్రదేశ్ గెజిట్‌లో ప్రచురించారు. ఈ మేరకు జీవో ఎంఎస్ నంబర్ 58ను విడుదల చేశారు.
ఈ చట్టం 1959లో ఇప్పటికే ఉన్న 'భిక్షాటన నివారణ చట్టం'కు సవరణలు తీసుకొచ్చి, ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మార్చారు. ముఖ్యంగా, పేదలు, వికలాంగులు, మహమ్మారులతో బాధపడుతున్నవారిని లక్ష్యంగా పెట్టుకుని, వారికి ఆహారం, ఆవాసం, ఉపాధి అవకాశాలు కల్పించే వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఈ చట్టం నిర్దేశిస్తోంది. ఈ చట్టాన్ని అమలు చేయడానికి మహిళా, బాలలు సంక్షేమ శాఖ, పోలీసు శాఖలు కలిసి పనిచేస్తాయి. పోలీసులు భిక్షాటన చేస్తున్నవారిని గుర్తించి, మొదట పునరావాస కేంద్రాలకు పంపుతారు. రెండోసారి మళ్లీ చేస్తే జరిమానా రూ.500 నుంచి రూ.5,000 వరకు లేదా జైలు శిక్ష 3 నుంచి 6 నెలలు విధిస్తారు. మాఫియా గ్యాంగ్‌లు లేదా వ్యవస్థీకృత భిక్షాటనలో పాల్గొంటే, IPC సెక్షన్ 370 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు.
భిక్షాటన చేసేవారిని గుర్తించి, వారి వివరాలు సేకరించి, పునరావాస కేంద్రాల్లో ఉంచుతారు. ఇక్కడ వారికి వైద్య సేవలు, వృత్తి శిక్షణ, ఉపాధి అవకాశాలు అందిస్తారు. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 50కి పైగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రణాళిక రచించింది. భిక్షాటన సామాజిక సమస్య.. శిక్షించడం ద్వారా కాకుండా.. సహాయం చేయడం ద్వారా నిర్మూలించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సెప్టెంబర్ 19న ఈ బిల్‌ను పాస్ చేశారు. దీనికి ముందు, రాష్ట్రంలో భిక్షాటన సంఖ్య 20% పెరిగినట్టు NCRB డేటా సూచిస్తోంది. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు వంటి నగరాల్లో మాఫియా గ్యాంగ్‌లు పిల్లలు, మహిళలను బలవంతంగా భిక్ష చేయించడం సాధారణమైంది. ఈ సవరణలు, వికలాంగులు, కుష్టరోగులపై ఉన్న వివక్షా పదాలను తొలగించి, వారిని కూడా పునరావాసంలో చేర్చనున్నారు.
భారతదేశంలో భిక్షాటనకు సంబంధించి కేంద్ర చట్టం లేదు, కానీ రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలు తమ సొంత చట్టాల ద్వారా దీన్ని నిషేధిస్తున్నాయి. ఎక్కువగా బాంబే ప్రివెన్షన్ ఆఫ్ బెగ్గింగ్ యాక్ట్, 1959ను మోడల్‌గా తీసుకుని రూపొందించిన ఈ చట్టాలు, భిక్షాటనను నేరంగా పరిగణించి, శిక్షలు (జరిమానా, జైలు) , పునరావాసం కల్పించే వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం, దేశవ్యాప్తంగా 4.13 లక్షల మంది భిక్షాటన చేసేవాళ్లురు ఉన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి 20-22 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు చట్టాలు రూపొందించాయి.





















