Chittoor News: చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో ఐదుగురికి ఉరి శిక్ష- ఆరో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు సంచలన తీర్పు
Chittoor News: పదేళ్ల క్రితం చిత్తూరులో జరిగిన మేయర్ అనురాధ దంపతుల హత్య కేసులో తుది తీర్పు వచ్చింది. నిందితులకు ఉరి శిక్ష ఖరారు చేసింది కోర్టు.

Chittoor News: పదేళ్ల క్రితం జరిగిన చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో చిత్తూరులోని ఆరో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. నిందితులకు ఉరి శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. వ్యక్తిగత, ఆర్థిక విభేదాలతో మేయర్‌కు మేనల్లుడే ఈ దారుణానికి ఒడిగట్టాడు. దీనికి 23 మంది సహకరించారు. ఇందులో ఒక నిందితుడు చనిపోయాడు. మరో నిందితుడి ప్రమేయం లేదని కోర్టు స్పష్టం చేసింది. ఇంకో 16 మంది ప్రమేయాన్ని పోలీసులు రుజువు చేయలేకపోయారు. చివరకు ఐదుగురికే శిక్ష పడింది.
కరెక్ట్‌గా పదేళ్ల క్రితం అంటే 2015 నవంబర్ 17న చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోనే జరిగిన చిత్తూరు మేయర్ దంపతులపై దాడి జరగడం తెలుగు రాష్ట్రాలను షేక్ చేసింది. అందరూ చూస్తుండగానే మారు వేషాల్లో వచ్చి ముందుగా మేయర్ అనురాధను హత్య చేశారు. తుపాకీతో కాల్చి చంపేశారు. తర్వాత పక్క రూంలోనే ఉన్న ఆమె భర్త మోహన్‌పై కూడా అటాక్ చేశారు. కత్తులతో కిరాతకంగా నరికి ప్రాణాలు తీశారు. అక్కడే ఉన్న వారి ప్రధాన అనుచరిడు వేలూరి సతీష్ కుమార్ నాయుడిపై కూడా దాడి చేశారు.
టీడీపీ అధికారంలో ఉన్న టైంలోనే టీడీపీ మేయర్‌ను హత్య చేయడం అప్పట్లో పెను సంచలనంగా మారింది. ఈ హత్యను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితులను గుర్తించారు. ఈ హత్య కేసులో కఠారి మోహన్ మేనల్లుడు శ్రీరామ్ చంద్రశేఖర్ అలియాస్ చింటూయే ప్రధాన నిందితుడిగా తేల్చారు. రాజకీయంగా ఎదుగుతున్న అనురాధ దంపతులపై వ్యక్తిగత కక్షతో ఆర్థిక విభేదాలతో ఈ పని చేసినట్టు విచారణలో తేలింది. కేసును లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు 23 మందిని నిందితులుగా తేల్చారు. ఈ మేరకు కోర్టుకు వివరాలు సమర్పించారు.
ఇన్ని రోజులు చిత్తూరులోని ఆరో అడిషనల్ జిల్లా సెషన్స్ కోర్టులో విచారణ సాగింది. 23 మందిలో 22వ నిందితుడిగా ఉన్న కాసరం రమేష్‌ను తనకు కేసుతో సంబంధిం లేదని కోర్టులో రుజువు చేసుకొని బయటపడ్డారు. 21వ నిందితుడిగా ఉన్న శ్రీనివాసాచారి మృతి చెందాడు. మిగతా 21 మంది నిందితుల్లో A1గా చింటూ ఉన్నాడు. హత్యకు ఆయుధాలు సమకూర్చడం, ఆశ్రయం కల్పించడం, ధనసాయం చేశారని చాలా మందిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంగానే వారిని నిందితులుగా చేర్చిన పోలీసులు అభియోగాలు రుజువు చేయడంలో విఫలమయ్యారు. దీంతో వాళ్లను నిర్దోషులుగా విడుదల చేసింది. మిగతా ఐదుగురని దోషులుగా ఇప్పటికే తేల్చారు. ఇవాళ వారికి ఉరి శిక్ష విధిస్తూ న్యాయమూర్తి ఎన్ శ్రీనివాస్ తుది తీర్పు వెల్లడించారు.
అనురాధ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుల్లో ఏ1గా చింటూ, ఏ2గా ఉన్న గోవింద స్వామి, ఏ3గా ఉన్న జయప్రకాశ్‌రెడ్డి, ఏ 4గా ఉన్న మంజునాథ్, ఏ5గా ఉన్న వెంకటేష్‌కు ఉరిశిక్ష వేస్తున్నట్టు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో ఏ 3, ఏ 4 పదేళ్లుగా జైల్లోనే ఉన్నారు. పదేళ్ల పాటు సాగిన విచారణలో 32సార్లు వాయిదాలు పడింది. 122 మంది సాక్షులను ప్రశ్నించారు.





















