Prashant Kishor: దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?
Congress party : బిహార్ ఓటమి తర్వాత ప్రియాంక గాంధీ-ప్రశాంత్ కిషోర్ మీటింగ్ జరిగింది. కాంగ్రెస్‌తో మళ్లీ సంబంధాలు పునరుద్ధరించుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది.

Will strategist Prashant Kishor join the Congress party : బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా, ప్రశాంత్ కిషోర్ మధ్య రహస్య మీటింగ్ జరిగిందని రాజకీయవర్గాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. సోనియా గాంధీ నివాసం 10, జనపథ్‌లో గత వారం జరిగిన ఈ సమావేశం నాలుగు గంటల పాటు సాగినట్లుగా తెలుస్తోంది. బీహార్ ఎన్నికల్లో జన సురాజ్, కాంగ్రెస్ రెండూ ఘోరంగా ఓడిపోయాయి. ఈ సమయంలో ప్రియాంకతో పీకే భేటీ హాటా టాపిక్ గా మారింది. 2026లో తమిళనాడు, బెంగాల్, అస్సాం, 2027లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.
2025 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జేడీయూ విజయం సాధించగా, ప్రశాంత్ కిషోర్ జన్ సురాజ్ పార్టీ 238 స్థానాల్లో పోటీ చేసి ఒక్క సీటూ గెలవలేదు. కాంగ్రెస్ 61 స్థానాల్లో పోటీ చేసి కేవలం 6 స్థానాలు మాత్రమే సాధించింది . మునుపటి ఎన్నికలతో పోలిస్తే 13 స్థానాలు తగ్గిపోయాయి. 2020లో మహాగఠబంధన్ సానుకూల ప్రదర్శన చేసినా, ఈ సారి అది పూర్తిగా విఫలమైంది. తాను పార్టీని ఎలాగైనా నడుపుతానని ప్రశాంత్ కిషోర్ అంటున్నారు.
ప్రశాంత్ కిషోర్, కాంగ్రెస్ మధ్య సంబంధాలు 2017 నుంచి ఉన్నాయి. పంజాబ్ లో కాంగ్రెస్ కోసం పని చేసి అమరీందర్ సింగ్‌ను గెలిపించారు. తరవాత ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్-సమాజ్‌వాదీ పార్టీ అలయెన్స్ కోసం పని చేసినప్పటికీ ఆ కూటమి ఓడిపోయింది. 2021-22లో సోనియా, ప్రియాంక, రాహుల్ గాంధీలతో చర్చలు జరిపారు. కాంగ్రెస్‌లో చేరాలని అనుకున్నారు. ప్రశాంత్ కిషోర్ తనకు పూర్తి స్వేచ్ఛ కావాలని కోరారు. పీకేకు ఆయన అడిగిన పవర్ ఇచ్చేందుకు ప్రియాంక సానుకూలత వ్యక్తం చేసినా రాహుల్ గాంధీ, సీనియర్ నాయకులు వ్యతిరేకించారు. దీంతో పీకే కాంగ్రెస్ సంస్థాగత సంస్కృతి, నిర్ణయాలు మంచివి కావని విమర్శించి ఆ పార్టీకి దూరమయ్యారు. 2022 ఏప్రిల్‌లో కాంగ్రెస్ ఆఫర్‌ను తిరస్కరించాడు. దీంతో జన్ సురాజ్ పార్టీని స్థాపించాడు.
సమావేశం గురించి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరగడంతో ప్రియాంక గాంధీ భిన్నంగా స్పందించారు. " తాను ఎవరిని కలుస్తానో..తనను ఎవరు కలుస్తారో ఎవరికీ అవసరం లేదని " వ్యాఖ్యానించారు. ప్రశాంత్ కిషోర్ మాత్రం ఏ మీటింగ్ జరగలేదని చెబుతున్నారు. 2021లో కిషోర్ కాంగ్రెస్ చేరాలని చర్చలు విఫలమైనప్పుడు రాహుల్ గాంధీ అతనికి స్వేచ్ఛా చేత ఇవ్వకూడదని వ్యతిరేకించాడు. కాంగ్రెస్ పాత నాయకులు కూడా కిషోర్ పరిస్థితులను ఆమోదించలేదు. కానీ ప్రియాంక మాత్రం సానుకూలంగా ఉన్నారు.
2026లో తమిళనాడు, బెంగాల్, అస్సాం; 2027లో ఉత్తరప్రదేశ్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి కీలకం. ఆయా రాష్ట్రాల్లో ప్రశాంత్ కిషోర్ సహకారం.. కాంగ్రెస్ తీసుకుంటుదా అన్న చర్చ కూడా ప్రారంభమయింది. చర్చలు నిజంగా జరిగి ఉంటే.. పీకే సహకారం తీసుకోవాలని కాంగ్రెస్ లో నిర్ణయిస్తే తదుపరి పరిణామాలు ఆసక్తికరంగా ఉండే అవకాశం ఉంది.





















