Software Engineer Suicide: హైదరాబాద్‌లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్య, భర్త వేధింపులే కారణమన్న వివాహిత తల్లిదండ్రులు
Hyderabad Crime News | పెళ్లయిన నెల రోజులకే వివాహితకు వేధింపులు మొదలయ్యాయి. పుట్టించినుంచి అదనపు కట్నం తేవాలని భర్త వేధింపులకు గురిచేయడంతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకుంది.
హైదరాబాద్: పెళ్లంటే నూరెళ్ల పంట. కానీ కొందరు ఆడబిడ్డలకు వివాహం అయిన నెల రోజులకు, ఏడాదికే నూరేళ్లు నిండుతున్నాయి. ఎన్నో ఆశలతో అత్తవారింట్లో అడుగుపెట్టిన అమ్మాయిలు భర్త, అత్తింటి వేధింపులు తట్టుకోలేక బలవన్మరణం చెంది కన్నవాళ్లకు కడుపుకోత మిగుల్చుతున్నారు. ఇలాంటి ఘటనే హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో జరిగింది. వివాహమైన 8 నెలలకే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకుంది.
పోలీసులు, బాధితురాలి తండ్రి తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండలంలోని నందిపేటకు చెందిన సుప్రియారెడ్డి వయసు 26 ఏళ్లు. కాగా, జిల్లాలోని దేవరకద్ర మండలం లక్ష్మిపల్లికి చెందిన రాఘవేందర్‌రెడ్డికి ఇచ్చి వివాహం చేశారు. మార్చి 24న తన కూతురి పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపించారు. సుప్రియారెడ్డి, రాఘవేందర్ రెడ్డి హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్లుగా జాబ్ చేస్తున్నారు. వివాహం అనంతరం వీరు కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని శంషీగూడలో నివాసం ఉంటున్నారు.
మంచి జీతం ఉన్నా.. అదనపు కట్నం కోసం వేధింపులు
ఎన్నో ఆశలతో అత్తవారింట్లో అడుగుపెట్టిన సుప్రియారెడ్డికి చాలా మంది అమ్మాయిల్లానే మొదట్నుంచీ కష్టాలే. పెళ్లి అయిన నెల రోజులకే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ రాఘవేందర్‌రెడ్డి తన భార్యను అదనపు కట్నం కోసం వేధించసాగాడు. భార్య జీతం తన బ్యాంకులోనే జమచేయాలని, ఏం చేసినా తాను చెప్పినట్టే వినాలని కండీషన్స్ పెట్టాడు. అంతటితో ఆగకుండా తాము ఇల్లు కట్టుకునేందుకు సుప్రియారెడ్డి పుట్టింటి నుంచి ఆస్తులు తేవాలని వేధింపులు మొదలయ్యాయి. ఇల్లు కోసం పుట్టించి నుంచి 3 ఎకరాలు భూమి తీసుకురావాలని సుప్రియపై ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో సుప్రియ కఠిన నిర్ణయం తీసుకుంది. తన కోసం పుట్టింటి వారిని ఇబ్బందిపెట్టడం ఇష్టం లేక, మరోవైపు భర్త వేధింపులు తట్టుకోలేక గురువారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
వివాహిత తల్లిదండ్రులు షాక్
కూతురు, అల్లుడు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లుగా చేస్తున్నారని, వారి జీవితం సాఫీగా సాగుతుందని భావించిన సుప్రియ తల్లిదండ్రులకు ఊహించని షాక్ తగిలింది. సుప్రియ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని ఆమె పక్కింటివాళ్లు గురువారం అర్ధరాత్రి ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. అంతకు కొన్ని గంటలముందే, రాత్రి 8 గంటలకు తమతో మాట్లాడిన కూతురు అప్పుడే ఎలా చనిపోయిందని వారు అనుమానం వ్యక్తం చేశారు. కుమార్తె ఆత్మహత్య చేసుకున్న సమయంలో అల్లుడు ఆఫీసుకు వెళ్లినట్లు పక్కింటి వాళ్లు చెప్పారు. కుమార్తె మరణంపై తమకు అనుమానం ఉందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని సుప్రియ తండ్రి బుచ్చిరెడ్డి పోలీసులను ఆశ్రయించారు. కూతురు చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.