రెచ్చిపోతున్న రౌడీ మూకలు- దాడులు, దౌర్జన్యాలతో సిక్కోలు ప్రజలు బెంబేలు
శ్రీకాకుళంలో రౌడీ మూకలు రెచ్చిపోతున్నాయి. దాడులు, దౌర్జన్యాలతో హడలెత్తిస్తున్నాయి. ఎవరూ ఏం చేయలేరన్న ధీమాతో రెచ్చిపోతున్నారు.
శ్రీకాకుళంలో రౌడీ గ్యాంగ్ ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. అమాయకులను ఇబ్బందులకు గురి చేస్తూ విచ్చల విడిగా ప్రవర్తిస్తున్నారు. అకారణంగా మనుషులను కొడుతూ సమస్య సృష్టిస్తున్నారు. కేసులు పెడితే రాజీ కుదుర్చుకుని మళ్లీ అదే దారిలో వెళ్తున్నారు. వీరి వల్ల పట్టణంలోని ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
రౌడీలకు రాజమార్గం రాజీలు
రాజీ మార్గమే రౌడీలకు రాజమార్గంగా మారుతోంది. ఎంచక్కా మళ్లీ రౌడీయిజంతో రెచ్చిపోవడం సిక్కోలులో చాలా మంది పనిపాటాలేని వాళ్లకు నిత్యకృత్యంగా మారింది. రోజూ ఏదో ఒక మూల రక్తం కారేలా కొట్టుకోవడం, ఆ కథ పోలీస్ స్టేషన్ వరకు వెళ్తే రాజీ చేసుకుంటున్నారు. ఇలా పోలీసులతోపాటు ఎవరూ ఏం చేయలేరన్న ధీమా రౌడీ మూకల్లో క్రమంగా పెరుగుతోంది. ఫలితంగా పట్టణంలో మళ్లీ కొత్త తరహా రౌడీయిజం పురివిప్పుతోంది. గతంలో రౌడీలుగా ముద్ర పడి పోలీస్ స్టేషన్లలో రౌడీ షీట్లు తెరవడంతో చాలా మంది పాతతరం రౌడీలు సైలెంట్ అయ్యారు. కానీ పరిస్థితి మళ్లీ మొదటికి వస్తోంది. పనీపాటా లేకుండా పైలాపచ్చీసుగా తిరిగే వాళ్లు రోడ్లపై విశృంఖలంగా వ్యవహరిస్తున్నారు. రౌడీయిజం చేస్తూ అమాయకులను, సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇటీవల కెల్ల వీధిలో జరిగిన ఉదంతమే దీనికి తాజా ఉదాహరణగా నిలుస్తోంది.
చూసి చూడనట్లుగా పోలీసుల వ్యవహారం!
దాదాపు పదేళ్ల క్రితం సిక్కోలులో రౌడీలు విచ్చల విడిగా వ్యవహరించేవారు. అమాయకులపై దాడులు, దౌర్జన్యాలకు తెగబడుతూ స్వైర విహారం చేసే వారు. 2014 తర్వాత ఇటు వంటి వారిపై రౌడీ షీట్లు ఓపెన్ చేయడంతో మూకల ఆగడాలు చాలా వరకు తగ్గాయి. కానీ ఆ తర్వాత కాలంలో రౌడీ షీట్ల విషయంలో పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరించడంతో మళ్లీ వీధుల్లో కత్తుల కవాతు చేస్తూ వీరంగం వేసే స్థాయికి ఎదిగిపోయారు. భూముల కోసమో, డబ్బుల కోసమో కిరాయి మూకలు రంగంలోకి దిగాయంటే ఓ అర్థముంది. మద్యం, గంజాయి మత్తులో ఏం చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో తెలియని స్థితిలో కొందరు రౌడీ షీటర్లు, మరి కొందరు పాత నేరస్తులు రెచ్చిపోతున్నారు.
ప్రతి దానికీ పోలీస్ స్టేషన్ లో రాజీ మార్గం
పోలీసులు రాజీ మార్గం అవలంభిస్తుండటంతో రౌడీ గ్యాంగులు పెచ్చుమీరి పోతున్నాయి. పోలీసులు వెనక ఉండటంతోనే వారు రెచ్చిపోతున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. బాధితులు వచ్చి ఫిర్యాదు చేస్తే... రౌడీలతో పోలీసులే ఎదురు కంప్లైంట్ చేయిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. రాజీ పడకపోతే రెండు గ్రూపులను అరెస్ట్ చేస్తామని భయపెట్టి పోలీసులు ఎంతో కొంత దండుకుంటున్నారని పలువురు విమర్శలు చేస్తున్నారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చిన వారిలో నిజంగా బాధితులెవరు? నిందితులు ఎవరు? అన్న విషయం పోలీసులకు తెలుసు. కానీ రౌడీ షీటర్లతో సెటిల్మెంట్లు కుదుర్చుకునే స్థాయికి పోలీసులు దిగజారిపోయరన్న ఆరోపణ పట్టణంలో గట్టిగా వినిపిస్తోంది. అల్లరి మూకలను అత్తారింట్లో అల్లుడిలా చూసుకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విచ్చల విడిగా ప్రవర్తిస్తున్న రౌడీలతో స్థానికులు తీవ్రంగా ఇబ్బందులకు గురి అవుతున్నారు. రౌడీల ఆట కట్టించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.