Seetha Murder Case: రైల్వే ఉద్యోగి భార్య హత్య కేసులో కొత్త కోణం, ఆనాటి ఫోన్ కోసమే మర్డర్!
Seetha Murder Case: విజయవాడ రైల్వే ఉద్యోగి భార్య హత్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. పాతకాలం నాటి ల్యాండ్ ఫోన్ కోసమే దుండగులు ఆమెను చంపేసినట్లు పోలీసులు వివరించారు.
Seetha Murder Case: విజయవాడకు చెందిన రైల్వే ఉద్యోగి సత్యనారాయణ భార్య సీత (50) హత్య కేసులో ఓ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. పాతకాలం నాటి ల్యాండ్ ఫోన్ కోసమే హత్య జరిగినట్టు తేలింది. ఈ కేసులో రైల్వే ఉద్యోగులు సహా మరికొంత మంది పాత్ర ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. పాత కాలం నాటి ల్యాండ్‌ఫోన్లు, టీవీలకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో కొన్ని ముఠాలు వాటి సేకరణకు బయలు దేరాయి. అలాంటివి ఉంటే లక్షల్లో డబ్బులు ఇస్తామని ఆశ పెడుతున్నాయి.
అసలేం జరిగిందంటే..?
రైల్వే ఉద్యోగి సత్య నారాయణ వద్ద పాత ఫోన్ ల్యాండ్ ఫోన్ ఉన్నట్టు ఆయన స్నేహితులకు తెలిసింది. దీంతో దానిని సొంతం చేసుకోవాలని వారు పథకం వేశారు. ఆయన ఇంట్లో లేని సమయం చూసి లోపలికి వెళ్లారు. ఆయన భార్య సీతతో ల్యాండ్ ఫోన్ కోసం గొడవ పడ్డారు. సీతం ఫోన్ ఇచ్చేందుకు ఎంతకీ ఒప్పుకోకపోవడం, వారితో పెనలాడటంతో తీవ్ర కోపానికి గురైన నిందితులు ఆమెను హత్యే చేశారు. ఆ తర్వాత ఇంట్లో ఉన్న ల్యాండ్ ఫోన్‌తో పాటు ఆమె మెడలోని నగలు, ఇంట్లో ఉన్న డబ్బును కూడా తీసుకుని పరారయ్యారు.
కాల్ డేటా ఆధారంగా అదుపులోకి నిందితులు..
భర్త ఇంటికెళ్లి చూసేసరికి భార్య రక్తపు మడుగులో పడి ఉంది. అది చూసిన భర్త వెంనటే పోలీసులకు సమాచారం అందుంచాడు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అయితే ఆ సయంలో ఇంట్లో ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు కూడా లేకపోవడంతో సెల్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆ ప్రాంతంలోని సెల్ టవర్లన్నీ జల్లెడ పట్టిన పోలీసులు... కీలక సమాచారాన్ని రాబట్టారు. దాని ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన ఓ రైల్వే ఉద్యోగి.. తనకు ఏమీ తెలియదన్నట్లుగా హత్య జరిగినప్పటి నుంచి అక్కడక్కడే తిరిగాడు. డాగ్ స్క్వాడ్ సిబ్బంది ధారాలు సేకరిస్తుండగా.. జాగిలాలు ఆ ఉద్యోగిని పట్టించాయి.
సీత హత్యను వివరించిన నిందితులు..
హత్య జరిగిన ప్రాంతంలో ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో నగర సీపీఎస్ పోలీసులకు కేసును అప్పగించారు. నార్త్ ఏశీపీ రమణ మూర్తి, సీపీఎస్ సీఐ రామ్ కుమార్, సత్యనారాయణ పురం సీఐ బాలమురళీ కృష్ణ ఆధ్వర్యంలో పోలీసు బృందం విచారణ చేపట్టి హత్య కేసును ఛేదించారు. రైల్వే ఉద్యోగి ఇంట్లో ఉన్న పాతం కాలం నాటి ల్యాండ్ లైన్ ఫోన్ కోసమే సీత వాళ్ల ఇంటికి వెళ్లామని నిందితులు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే సీత ఎంతకూ ఆ ఫోన్ ఇవ్వకపోవడం గడవ జరిగిందని... ఆ పెనుగులాటలోనే ఆమెను హత్య చేసినట్లు వివరించారని సమాచారం. అయితే మంగళ వారం పోలీసు అధికారులు నిందితులను అరెస్టు చూపించి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.