Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం, ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి దుర్మరణం!
Road Accident: ఏపీలోని ప్రకాశం జిల్లా కంభం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందుగా వెళ్తున్న లారీ వెనుక నుంచి వచ్చి కారు బలంగా ఢీకొట్టడంతో.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు స్పాట్ లోనే చనిపోయారు.
Road Accident: ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందుగా వెళ్తున్న లారీని వెనక నుంచి వస్తున్న ఓ కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదం జిల్లాలోని కంభంలో జరిగింది. వీరంతా మాచర్ల నుంచి తిరుపతికి వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. మృతులందరూ పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం సిగిరిపాడు గ్రామానికి చెందిన 60 ఏళ్ల అనిమిరెడ్డి, 60 సంవత్సరాల గురవమ్మ, 55 ఏళ్ల అనంతమ్మ, 58 ఏళ్ల ఆది లక్ష్మి, 24 సంవత్సరాల నాగిరెడ్డిలుగా గుర్తించారు.
రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే ఐదుగురు మృతి..
వీరంతా కారులో మాచర్ల నుంచి తిరుమల శ్రీవారి దర్శనం కోసం బయల్దేరారు. కానీ మార్గమధ్యంలో కంభం వద్ద ముందుగా వెళ్తున్న లారీని వెనక నుంచి వచ్చి కారు ఢీకొట్టింది. కారులోని చాలా భాగం లారీలోకి దూసుకెళ్లింది. దీంతో కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారవడం కావడం మరింత విచారకరం. అయితే ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే స్పందించి అక్కడికి చేరుకున్నారు. కానీ అంతలోనే జరగరాని విషాదం జరిగిపోయింది. కారులో ఉన్న వారంతా చనిపోయారు. స్థానికుల సమాచారంతో హుటాహుటిన పోలీసులు రంగంలోకి దిగారు. కారులో ఉన్న మృతదేహాలను బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి మృతదేహాలను తరలించారు.
మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారే..
మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వాళ్లుగా పోలీసులు గుర్తించారు. మృతుల బంధువులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురూ ఒకేసారి మృతి చెందడంతో సిగిరిపాడులో విషాధ ఛాయలు అలముకున్నాయి. అసలు ప్రమాదం ఎలా జరిగింది, ఏమైందనే విషయాలపై పోలీసులు దృష్టి సారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.