Posani Krishna Murali: సీఎం చంద్రబాబు, పవన్‌లపై అనుచిత వ్యాఖ్యలు - నటుడు పోసాని, వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడలపై కేసులు నమోదు
Andhra News: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదుతో నటుడు పోసాని, వైసీపీ ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్‌లపై కేసులు నమోదు చేశారు.
Case Filed On Posani And Duvvada Srinivas: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన క్రమంలో అందిన ఫిర్యాదులపై వైసీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. సినీనటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళిపై (Posani Krishna Murali) తాజాగా ఏపీ సీఐడీ (AP CID) కేసు నమోదు చేసింది. రాష్ట్ర తెలుగు యువత ప్రతినిధి బండారు వంశీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. సెప్టెంబరులో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబుపై పోసాని అసత్య ప్రచారం, అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వంశీకృష్ణ ఫిర్యాదు చేశారు. ఆయన వ్యాఖ్యలు సీఎం వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఉన్నాయని అన్నారు. వర్గాల మధ్య విభేదాలు తలెత్తేలా వ్యాఖ్యలు చేసిన పోసానిపై చర్యలు తీసుకోవాలని సీఐడీని కోరగా అధికారులు కేసు నమోదు చేశారు.
అటు, వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పైనా (Duvvada Srinivas) కేసు నమోదైంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై (Pawan Kalyan) అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారంటూ టెక్కలి నియోజకవర్గ జనసేన నాయకుడు కణితి కిరణ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో టెక్కలి పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.
ఆర్జీవీకి బిగ్ షాక్
మరోవైపు, దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మకు సైతం హైకోర్టులో చుక్కెదురైంది. సోషల్ మీడియాలో పోస్టుపై పెట్టిన కేసు కొట్టేయాలని లేదా విచారణకు సమయం ఇవ్వాలన్న ఆయన అభ్యర్థనను ఏపీ హైకోర్టు కొట్టేసింది. పోలీసులతోనే తేల్చుకోవాలని సూచించింది. కాగా, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై గతంలో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఆయనపై ఈ మధ్యే కేసు నమోదైంది. మంగళవారం విచారణకు రావాలని పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు.
టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి ముత్తనపల్లి రామలింగం ఫిర్యాదు మేరకు ప్రకాశం జిల్లా మద్దిపాడులో పోలీసులు కేసు నమోదు చేశారు. వ్యూహం సినిమా ప్రచారంలో భాగంగా చంద్రబాబు, లోకేష్‌పై అనుచితంగా మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నాడు ఆయన చేసిన కామెంట్స్‌కు సంబంధించిన సాక్ష్యాలను కూడా సమర్పించారు. ఈ కేసునే కొట్టేయాలని ఆర్జీవీ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారించిన కోర్టు కేసు కొట్టేయలేమని.. అరెస్ట్ చేస్తారనే భయం ఉంటే ముందస్తు బెయిల్‌కు అప్లై చేసుకోవాలని సూచించింది. కనీసం విచారణకు హాజరయ్యేందుకు సమయం కావాలని కూడా అభ్యర్థించగా... దీనికి కూడా పోలీసులతోనే తేల్చుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. ఇలాంటివి తమ దృష్టికి తీసుకురావద్దని పేర్కొంది. సోషల్ మీడియాలో పోస్టులు, చేసిన కామెంట్స్‌పై నమోదైన కేసులో విచారణకు రావాలని ఆర్జీవీకి ఇప్పటికే పోలీసులు నోటీసులు ఇచ్చారు. తాజాగా కోర్టులోనూ ఆయనకు ఎదురుదెబ్బ తగలడంతో ఇప్పుడు వర్మ ఏం చేయబోతున్నారనేది ఉత్కంఠగా మారింది. మంగళవారం ఆయన విచారణకు హాజరవుతారో లేదో అనేది ఆసక్తిగా మారింది.
కాగా, వైసీపీ హయాంలో ఆ పార్టీ కార్యకర్తలు, కొందరు నేతలు చంద్రబాబు, పవన్ సహా లోకేశ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెట్టారు. దీనిపై టీడీపీ నేతల ఫిర్యాదులతో ఇప్పుడు కేసులు నమోదు చేయడమే కాకుండా పోలీసులు చర్యలు చేపడుతున్నారు.
Also Read: AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం