YSRCP Leaders Clash: మట్టి గోడ కోసం వెల్వడంలో వైసీపీ నాయకుల బాహాబహీ- పలువురికి గాయాలు
YSRCP Leaders Clash: ఎన్టీఆర్ జిల్లా వెల్వడంలో రెండు వైసీపీ వర్గాల మధ్య గొడవ జరిగింది. మట్టి తరలింపు విషయంలో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకోగా.. పలువురు నాయకులు తీవ్రంగా గాయపడ్డారు.
YSRCP Leaders Clash: ఎన్టీఆర్ జిల్లా వెల్వడంలో దారుణం చోటుచేసుకుంది. మట్టి తరలింపు విషయంలో యరమల రాంభూపాల్ రెడ్డి, సొసైటీ అధ్యక్షులు తోట తిరుపతిరావు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్ణలో పలువురు నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. అయితే వేసవిలో పొలాల్లో నిల్వ చేసిన మట్టిని రాంభూపాల్ రెడ్డి వర్గీయులు ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే తిరుపతి రావు ఆయన అనుచరులతో కలిసి మట్టి రవాణాను అడ్డుకునేందుకు వెళ్లారు. మాటలతో ప్రారంభం అయిన ఈ గొడవ ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకు వెళ్లింది. ఇరువర్గాల నాయకులు పరస్పరం కొట్లాటకు దిగారు. ఈ ఘర్షణలో సొసైటీ అధ్యక్షుడు తోట తిరుపతిరావు, శీలం కృష్ణా రెడ్డిలు తీవ్రంగా గాయపడ్డారు.
అయితే స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగారు. సంఘటనా స్థలానికి చేరుకున్న మైలవరం ఎస్ఐ రాంబాబు, సిబ్బంది ఇరు వర్గాలను చెదరగొట్టారు. గాయపడిన కృష్ణా రెడ్డి, తిరుపతిరావను చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అలాగే మట్టిని తరలిస్తున్న రెండు టిప్పర్ లను సీజ్ చేశారు. గతంలోనూ మట్టి తరలింపు విషయంలో ఇలాగే ఓ సారి రెండు వర్గాలు కొట్టుకున్నాయి. మరలా ఘర్షణ జరగడంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.