Jaggayyapeta News : జీతాల విషయంలో సీఎంను దూషించిన కానిస్టేబుల్, కోర్టు ఏమందంటే?
Jaggayyapeta News : సీఎం జగన్ దూషించిన ఏఆర్ కానిస్టేబుల్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జీతాల విషయంలో కానిస్టేబుల్ వీడియో వైరల్ అయింది.
Jaggayyapeta News : ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ సీఎం జగన్ ను దూషించిన వీడియో వైరల్ అయింది. జీతాల విషయంలో సీఎం జగన్ పై అనుచితంగా మాట్లాడడంతో పోలీసులు కానిస్టేబుల్ ను శుక్రవారం అరెస్టు చేశారు. అరెస్టు అనంతరం కోర్టు ముందు హాజరు పర్చగా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. హైవే మొబైల్ వెహికల్ డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు సీఎం జగన్ ను దూషించాడు. ఏఆర్ కానిస్టేబుల్ వీడియో రికార్డు చేసిన వ్యక్తి పోలీసు అధికారులకు పంపించాడు. జీతాల విషయంలో సీఎం జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల కానిస్టేబుల్ ను పోలీసులు అరెస్టు చేశారు.
కానిస్టేబుల్ కు బెయిల్ మంజూరు
ఏఆర్ కానిస్టేబుల్ తన్నీరు వెంకటేశ్వరరావు బెయిల్ పిటిషన్ స్థానిక కోర్టు శనివారం విచారించింది. అనంతరం కానిస్టేబుల్ కు బెయిల్ మంజూరు చేసింది. వేతనాలపై సీఎం ను దూషించారని శుక్రవారం వెంకటేశ్వరరావును రిమాండ్ కు తరలించారు. బెయిల్ పిటిషన్ పై ఇవాళ జగ్గయ్యపేట కోర్టులో వాదనలు జరగగా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వెంకటేశ్వరరావు తరపున లాయర్లు దొద్దాల కోటేశ్వరరావు, మాగులూరి హరిబాబు వాదనలు వినిపించారు. వాదనలు విన్న జగ్గయ్యపేట కోర్టు వెంకటేశ్వరరావుకు బెయిల్ మంజూరు చేసింది.
అసలేం జరిగింది?
నందిగామ చిల్లకల్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో హైవే పెట్రోలింగ్ విభాగంలో ఏఆర్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు పనిచేస్తు్న్నారు. ఇటీవల గౌరవరం గ్రామంలో టీ తాగేందుకు ఓ టీ స్టాల్ వద్ద ఆగిన సమయంలో అక్కడున్న వ్యక్తికి, కానిస్టేబుల్‌కు మధ్య జరిగిన సంభాషణ వీడియో తీశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కానిస్టేబుల్ ను పలకరించిన వ్యక్తి జీతాలు టైంకి వస్తున్నాయా అని ప్రశ్నించారు. సీఎం జగన్ జీతాలు ఇస్తున్నారా అంటూ ప్రశ్నించారు. దీంతో ఏఆర్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. సీఎంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కానిస్టేబుల్ వ్యాఖ్యలను రికార్డు చేసిన వ్యక్తి పోలీస్ ఉన్నతాధికారులకు వీడియో పంపించాడు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు.. వెంకటేశ్వరరావును అరెస్టు చేశారు. కానిస్టేబుల్ ను వెంకటేశ్వరరావును కావాలనే రెచ్చగొట్టారని కొందరు పోలీసులు అంటున్నారు.
పోలీస్ కస్టడీ నుంచి దొంగ పరారీ
పోలీసు కస్టడీనుంచి దొంగలు తప్పించుకోవడం చాలా అరుదు. అందులోనూ చేతికి సంకెళ్లు వేసి ఉండి, చుట్టూ నలుగురైదుగురు పోలీసులు కాపలా ఉండి, అందులోనూ వారంతా వాహనంలో వెళ్లే సమయంలో తప్పించుకున్నాడంటే ఆ దొంగ మామూలోడు కాదు. అలాంది నక్కజిత్తుల దొంగ నెల్లూరు పోలీసులకు హడలెత్తించాడు. పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో సంచలనంగా మారింది. పోలీసులు ఇప్పుడు హడావిడి పడుతున్నారు. వాడిని ఎలా పట్టుకోవాలా అని టెన్షన్ పడుతున్నారు.
పోలీసుల నుంచి తప్పించుకున్న దొంగ వాగులో దూకి పరారవగా.. 24గంటలు దాటినా అతని ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులు టెన్షన్ పడుతున్నారు. వాగులో గల్లంతయ్యాడా.. లేక పారిపోయాడా తెలియక హైరానా పడుతున్నారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా సంగంలో జరిగింది.
ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకుని వారి మెడలోనుంచి బంగారు ఆభరణాలను దోచుకునే గ్యాంగ్ ఒకటి ఇటీవల నెల్లూరులో బరితెగించింది. ఈ కేసు విచారణలో భాగంగా గొలుసు దొంగలిద్దర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరు రూరల్ మండలంలోని ఉప్పుటూరుకు చెందిన ఎ.గిరితోపాటు మరో వ్యక్తిని నెల్లూరు సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా వీరిని ఏఎస్ పేటకు తీసుకొచ్చారు. అక్కడ వారు చేసిన దొంగతనాలపై ఆరా తీశారు. తిరిగి నెల్లూరు వస్తుండగా నిందితుడు గిరి పారిపోయేందుకు పథకం వేశాడు.