Nellore News : వికటించిన ప్రేమ, ప్రాణం తీసిన అబార్షన్
నెల్లూరు యువతి మృతి కేసులో నిందితుడు శశిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు మొదలు పెట్టారు. ఈ ఘటన జరిగి రోజులు గడుస్తున్నా.. కాలేజీ యాజమాన్యం విషయాన్ని దాచిపెట్టిందని అంటున్నారు.
నెల్లూరు జిల్లాలో కాలేజీ హాస్టల్ రూమ్ లోనే ఓ విద్యార్థినికి అబార్షన్ కావడంతోపాటు ఆ అమ్మాయి ప్రాణం పోయిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రేమ వ్యవహారమే ఇందుకు కారణం అని తెలుస్తోంది. ప్రేమికుడు మోసం చేయడం, గర్భం వచ్చినా పట్టించుకోకపోవడం, తనకు తెలియదంటూ తప్పించుకు తిరగడంతో.. చేసేదేం లేక ఆ అమ్మాయి సొంత వైద్యం చేసుకుంది. తెలిసీ తెలియకుండా మందులు వాడటంతో కాలేజీ హాస్టల్ లోనే అబార్షన్ అయింది. పిండం బయటకు వచ్చింది. అయితే ఆగకుండా రక్తస్రావం కావడంతో వెంటనే కాలేజీ స్టాఫ్ ఆ అమ్మాయిని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో ఆ అమ్మాయి చనిపోయింది.
పక్క పక్క మండలాలు..
నెల్లూరు జిల్లా ప్రియదర్శిని కాలేజీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న మృతురాలి స్వస్థలం మర్రిపాడు. పక్కనే ఉన్న అనంతసాగరం మండలం లింగం గుంటకు చెందిన శశి అనే డ్రైవర్ తో ఆమెకు పరిచయం ఏర్పడింది. సదరు శశి.. ప్రియదర్శిని కాలేజీలో ప్రిన్సిపల్ కారు డ్రైవర్ అనే ప్రచారం జరుగుతోంది. అయితే స్టాఫ్ ఈ విషయాన్ని ధృవీకరించలేదు. శశి ప్రవర్తన సరిగా ఉండదని, గతంలో అనంత సాగరం ఎస్సై కూడా ఓసారి ఈవ్ టీజింగ్ కేసులో కౌన్సెలింగ్ ఇచ్చాడని తెలుస్తోంది. ఆ తర్వాత కాలేజీలో అమ్మాయితో పరిచయం పెంచుకుని శారీరకంగా దగ్గరయ్యాడు. ఫలితంగా ఆమె గర్భం దాల్చింది. ఆ తర్వాత శశి ఆమెను పట్టించుకోవవడం మానేశాడు. అబార్షన్ చేయించుకుంటాను అన్నా కూడా సహకరించలేదు. దీంతో ఆమె తనలో తానే కుమిలిపోయింది. తల్లిదండ్రులకు విషయం చెప్పలేక, సొంతగా ఆస్పత్రికి వెళ్లలేక ఇబ్బంది పడింది. తీరా ఆరో నెల గర్భం వచ్చాక అబార్షన్ కోసం ప్రయత్నించినట్టు, అది వికటించి ఆమె చనిపోయినట్టు తెలుస్తోంది.
పోలీసుల అదుపులో నిందితుడు..
శశిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు మొదలు పెట్టారు. ఈ ఘటన జరిగి రోజులు గడుస్తున్నా.. కాలేజీ యాజమాన్యం విషయాన్ని దాచిపెట్టిందని అంటున్నారు. కాలేజీ తరపున ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. కాలేజీకి సంబంధించిన విద్యార్థిని చనిపోయిందని, ఆమె తల్లిదండ్రులు కాలేజీకి రావడంతో అసలు విషయం బయటకొచ్చింది. తల్లిదండ్రులకు ఆమె ఒక్కతే కుమార్తె కావడంతో వారిని ఎవరూ ఓదార్చలేకపోతున్నారు. ప్రస్తుతం తల్లిదండ్రులు కూడా మీడియాకు కనిపించకుండా రహస్య ప్రదేశంలో ఉన్నట్టు తెలుస్తోంది.
నెల్లూరు ప్రైవేట్ కాలేజీలో ఈ ఘటన జరగడంతో ఒక్కసారిగా విద్యాసంస్థల నిర్వాహకులు షాకయ్యారు. కాలేజీ హాస్టల్ లో ఇలాంటి ఘటన జరగడంతో.. అసలు కాలేజీలో ఎలాంటి వ్యవహారాలు జరుగుతున్నాయనే అనుమానాలు మొదలయ్యాయి. ప్రేమ వ్యవహారాలు కాలేజీల్లో సహజమే అయినా.. శారీరకంగా దగ్గరవడం, ఆ తర్వాత అబార్షన్ అనే సరికి తల్లిదండ్రులు కూడా ఉలిక్కిపడుతున్నారు. విషయం బయటకు రావడంతో ప్రియదర్శిని కాలేజీ వద్దకు వచ్చి విచారణ జరుపుతున్నారు. తమ పిల్లలను కొంతమంది ఇంటికి తీసుకెళ్తున్నట్టు తెలుస్తోంది.
ఇటీవలే నెల్లూరు జిల్లాకు కొత్త ఎస్పీగా తిరుమలేశ్వర్ రెడ్డి వచ్చారు. ఆయన చార్జ్ తీసుకున్న తర్వాత తొలి సంచలన కేసుగా ఈ వ్యవహారం తెరపైకి వచ్చింది. మరి దీనిపై పోలీసులు ఎలాంటి వివరణ ఇస్తారో వేచి చూడాలి.