Narayana College: నారాయణ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య - అనకాపల్లిలో ఘటన
Narayana College at Anakapalli: అనకాపల్లిలోని నారాయణ కళాశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై తల్లిదండ్రులతోపాటు విద్యార్థి సంఘాల గురువారం ఆందోళన నిర్వహించారు.
Student Suicide In Narayana College At Anakapalli: అనకాపల్లిలోని ప్రముఖ విద్యా సంస్థ నారాయణ కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు విద్యార్థి సంఘాల నాయకులు కళాశాల ఆవరణలో గురువారం ఆందోళన నిర్వహించారు. కాలేజీ కాలేజీ అధ్యాపకుడు కొట్టడం వల్లే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు అంటూ విద్యార్థి సంఘాల ఆరోపించాయి.
నారాయణ కళాశాలలో మచ్ఛకర్ల వంశీ ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. రెండు రోజులు కిందట కాలేజీలో అధ్యాపకుడు కొట్టడంతో విద్యార్ధి తీవ్ర మనో వేదనకు గురై ఇంటికి వెళ్ళి ఆత్మహత్య కు పాల్పడినట్టు విద్యార్థి సంఘాలతో పాటు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్యార్థి మృతికి న్యాయం చేయాలంటూ బుధ, గురువారాల్లో విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థి సంఘ నాయకులు కాలేజీ ఆవరణలో ఆందోళన నిర్వహించారు. గురువారం పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఈ మృతి పై విచారణ సాగిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
టీచర్ కొట్టడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య అంటున్న విద్యార్థి సంఘాలు
మూడు రోజుల కిందట కాలేజీకి వచ్చిన విద్యార్థిని ఒక టీచర్ క్లాస్ లోనే కొట్టాడని, దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన విద్యార్థి ఇంటికి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడినట్లు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై విచారణ చేయాలంటూ విద్యార్థి సంఘాలు కోరుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఇదే విధమైన ఆరోపణలు చేస్తుండడంతో ఈ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. పోలీసులు కూడా ఈ కేసు దర్యాప్తుపై ప్రత్యేకంగా దృష్టి సారించి విచారణ సాగిస్తున్నారు. గురువారం కాలేజీ ఆవరణలో తల్లిదండ్రులు చేసిన ఆందోళనకు ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ నాయకులు మద్దతు తెలిపారు.