(Source: ECI/ABP News/ABP Majha)
Crime News: హత్య చేసి కూడా ఏం యాక్టింగ్.. అయినా హంతకుల్ని పచ్చరాయి ఉంగరం పట్టించేసిందిలా..
నెల్లూరు జిల్లాలో జరిగిన ఓ రైతు హత్య విషయంలో పచ్చరాయి ఉంగరం హంతకుల్ని పట్టించింది. మృతుడికి తెలిసినవారే హంతకులుగా గుర్తించారు.
నెల్లూరు జిల్లాలో ఓ రైతు హత్య జరిగింది. హత్య జరిగిన తర్వాత నిందితులే.. మృతుడి ఇంటికి వచ్చి కుటుంబ సభ్యుల్ని పరామర్శించడం, పోలీసులకు సమాచారమిచ్చినట్టు నటించడం అన్నీ చేశారు. అయితే చివరకు మృతుడి శవాన్ని పూడ్చేసేటప్పుడు పచ్చరాయి ఉంగరాన్ని దొంగిలించి.. దాన్ని తన చేతికి పెట్టుకోవడంతో హంతకుడు దొరికిపోయాడు. తన భర్త ఉంగరాన్ని గుర్తించిన భార్య ఆ సమాచారాన్ని పోలీసులకు చెప్పడంతో వారు తీగలాగారు. చివరకు డొంకంతా కదిలింది. మొత్తం ఐదుగురు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు గ్రామానికి చెందిన మోడెం చంద్రశేఖర్ రెడ్డి అనే రైతుకి 13 ఎకరాల పొలం ఉంది. దాన్ని డబ్బుగుంట సురేష్ అనే వ్యక్తికి కౌలుకి ఇచ్చాడు. సురేష్ వ్యవసాయం చేశాడు. తీరా వరిపంట కోతకు వచ్చి ఒడ్లు అమ్ముకునే సమయంలో మొత్తం ధాన్యాన్ని మోడెం చంద్రశేఖర్ రైసు మిల్లుకు తరలించాడు. ఈ క్రమంలో తన కష్టార్జితం దక్కదేమోనన్న అనుమానంతో అతనితో గొడవపడ్డాడు సురేష్. పొలం వద్ద మద్యంలో పురుగుల మందు తాగించి, మెడకు వైరు బిగించి చంపేశారు. హత్య చేయడంలో సురేష్ కి నలుగురు స్నేహితులు సహకరించారు. వారితో కలిసి శవాన్ని ట్రాక్టర్ లో తీసుకెళ్లి.. పెన్నా తీరంలో పాతిపెట్టారు. ఆ సమయంలో మృతుడి చేతులకు ఉన్న రెండు ఉంగరాలను అతని జేబులో ఉన్న నగదుని తీసుకున్నారు హంతకులు. ఆ ఉంగరాలలో సురేష్ ఒకటి తీసుకున్నాడు.
పొలానికి వెళ్లి తిరిగొస్తానన్న చంద్రశేఖర్ రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో ఆయన భార్య వసుధ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే చంద్రశేఖర్ వద్ద పొలం కౌలుకి తీసుకున్న సురేష్ కూడా ఏమీ ఎరగనట్టు పోలీసులను కలిశాడు. తనకు తెలిసిన సమాచారం ఇదంటూ చెప్పాడు. పలుమార్లు చంద్రశేఖర్ ఇంటికెళ్లి కుటుంబ సభ్యులను కూడా పరామర్శించి వచ్చాడని సమాచారం. ఈ క్రమంలో చంద్రశేఖర్ ఉంగరాన్ని సురేష్ పెట్టుకుని ఉండటాన్ని చూశారు వసుధ. తన భర్త ఉంగరం సురేష్ దగ్గర ఉండటంతో ఆమెకు అనుమానం వచ్చింది. పోలీసులకు ఆ సమాచారం చెప్పడంతో వారు తనదైన శైలిలో విచారణ జరిపారు. సురేష్ సహా అయ్యప్ప, శరత్, ఆదిశేఖర్, వెంకటేశ్ ని అరెస్ట్ చేశారు.
హత్యకు ఉపయోగించిన వైరు, మృతుడి శవాన్ని తరలించిన ట్రాక్టర్, పెన్నా తీరంలో శవాన్ని పూడ్చి పెట్టడానికి ఉపయోగించిన బకెట్ ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. హత్య చేసిన తర్వాత హంతకులు అదే ఊరిలో తిరిగారు.. మృతుడి ఇంటికి కూడా వెళ్లారు. శవం మాయం చేసి, కేసుని పక్కదారి పట్టించాలని చూసినా.. పోలీసులు కేసును ఛేదించి అరెస్టు చేశారు.
Also Read: Viral fever in India: చిన్నారుల్లో వైరల్ ఫీవర్.. ఇప్పటికే 100 మంది మృతి.. పిల్లలను ఎలా కాపాడుకోవాలి?