Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Moinabad Drugs Case | మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసులో కీలక నిందితుడు అభిషేక్ సింగ్‌ను ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా కీలక విషయాలు బయటకొస్తున్నాయి.

Moinabad Farmhouse Case | హైదరాబాద్: మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ పార్టీ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో డ్రగ్స్ సరఫరా చేసిన నిందితుడు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అభిషేక్ సింగ్‌ను పోలీసులు శనివారం హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడిని సీక్రెట్‌లో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో నిందితుడు కౌశిక్ రవి ఈ డ్రగ్స్‌ను సిమ్లా నుండి తెచ్చానని చెప్పినప్పటికీ, విచారణలో అభిషేక్ సింగ్ ద్వారానే వీటిని రోహిత్ రెడ్డికి చెందిన వ్యక్తి సేకరించినట్లు సిట్ గుర్తించింది.
మరోవైపు, ఈ డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా పాత వివాదాలు కూడా తెరపైకి వస్తున్నాయి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి డ్రైవర్ శరత్ ద్వారా ఈ లావాదేవీలు జరిగినట్లు కాల్ డేటా ఆధారంగా పోలీసులు నిర్ధారించారు. కేవలం ఈ ఒక్క పార్టీకే కాకుండా, గతంలో సుమారు 20 సార్లు వరకు ఈ ఫాంహౌస్‌కు అభిషేక్ డ్రగ్స్ సరఫరా చేసినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించారు.

ఇప్పటికే సిట్ (SIT) బృందం ఆరుగురు నిందితులను విచారించగా, ప్రధాన నిందితులు రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డి, నమిత్ శర్మల పోలీస్ కస్టడీపై ఉప్పరిపల్లి కోర్టు సోమవారం (మార్చి 23న) తీర్పు వెలువరించనుంది. కస్టడీకి అనుమతి లభిస్తే విచారణ మరింత వేగవంతం కానుంది.
వివాదాస్పద ఫాం హౌస్ సీజ్..!
ఇక రాజకీయంగా, చట్టపరంగా ఇబ్బందులు తలెత్తకుండా రోహిత్ రెడ్డికి చెందిన ఈ ఫాంహౌస్‌ను పోలీసుల సాయంతో రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. అజీజ్‌నగర్ పరిధిలోని ఈ భూమి వాస్తవానికి 1961-62లో ఒక వ్యక్తికి కేటాయించిన అసైన్డ్ భూమి అని, దీనిని నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ప్రస్తుతం భూభారతి పోర్టల్‌లో కూడా అసలు యజమాని పేరే ఉండటంతో, సిట్ నుండి ఆదేశాలు రావడంతో ఫాంహౌస్‌ను అధికారులు సీజ్ చేశారు.

డ్రగ్స్ నెట్‌వర్క్, విచారణలో కీలక అంశాలు
హైదరాబాద్ శివారులోని ఫాంహౌస్‌లు, పబ్బులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అభిషేక్ సింగ్ పేరు ఇప్పుడు సంచలనంగా మారింది. గోవా, బెంగళూరులోని నైజీరియన్ల నుంచి కొకైన్, ఎండీఎంఏ వంటి మత్తు పదార్థాలను కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు సిట్ (SIT) గుర్తించింది. వీకెండ్ పార్టీలే లక్ష్యంగా సాగుతున్న ఈ దందాలో రోహిత్ రెడ్డితో పాటు బాబిలోనా పబ్ నిర్వాహకుడు అర్జున్ రెడ్డికి కూడా అభిషేక్ డ్రగ్స్ సరఫరా చేసినట్లు సిట్ టీంకు ఆధారాలు లభించాయి. నిందితుడి ఫోన్ డేటా ఆధారంగా అతని కస్టమర్ల జాబితాను పోలీసులు విశ్లేషిస్తున్నారు. రోహిత్ రెడ్డి డ్రైవర్ శరత్ కుమార్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ప్రకారం, గతంలో జరిగిన పార్టీలకు హాజరైన వారి వివరాలను సేకరిస్తూ, లాయర్ కౌశిక్ రవితో అభిషేక్‌కు ఉన్న సంబంధాలపై కూడా ఆరా తీస్తున్నారు.
టీడీపీ ఎంపీ నియోజకవర్గానికి చెందిన మరో నిందితుడు..
మరోవైపు, రోహిత్ రెడ్డి ఫాంహౌస్‌లో నాటుకోళ్ల పెంపకం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ఏలూరుకు చెందిన మొరవనేని రమేశ్‌ను కూడా పోలీసులు నిందితుడిగా చేర్చారు. పార్టీ జరిగిన రోజు తన నియోజకవర్గ ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్ వస్తున్నారని తెలిసి రమేశ్ అక్కడికి వెళ్లినట్లు విచారణలో తేలింది. కాల్పులు జరిగిన సమయంలో అక్కడే ఉండటంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ పరీక్షలో నెగెటివ్ వచ్చినా, ఎక్సైజ్ చట్టం కింద కేసు నమోదు చేసి స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు. పోలీసులు రమేష్ ను సైతం ప్రశ్నించి గతంలో జరిగిన పార్టీలు, కాల్పులకు దారితీసిన పరిస్థితులపై కీలక సమాచారాన్ని సేకరించారు.
ట్రెండింగ్ వార్తలు






















