Anantapur: లంచం కోసం సీబీఎస్‌ఈ స్కూల్‌లో ఎంఈవో తనిఖీలు-డోర్ కొట్టిన ఏసీబీ అధికారులు
Andhra Pradesh: లంచం అడగడమే తప్పు... అందులో తన పరిధి కాని ఏరియాలో దందా చేస్తే ఏమవుతుంది.. ఇలా ఏసీబీకి చిక్కి కేసులు పాలుకాక తప్పదు.
![Anantapur: లంచం కోసం సీబీఎస్‌ఈ స్కూల్‌లో ఎంఈవో తనిఖీలు-డోర్ కొట్టిన ఏసీబీ అధికారులు MEO caught by ACB for taking 2 lakh bribe in Anantapur district in Telugu Anantapur: లంచం కోసం సీబీఎస్‌ఈ స్కూల్‌లో ఎంఈవో తనిఖీలు-డోర్ కొట్టిన ఏసీబీ అధికారులు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/18/64a61b71033e105d97faac4e53c63ea41726625247159215_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Anantapur: విద్యాశాఖలో పని చేస్తున్న ఓ అవినీతి చేప ఏసీబీ గ్యాలానికి చిక్కింది. అనంతపురం జిల్లా కూడేరు మండలం ఎంఈఓగా పనిచేస్తున్న చంద్రశేఖర్ 2 లక్షలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖాధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. కూడేరు మండలంలోని గోట్టుక్కురు సమీపంలో ఉన్న ప్రైవేటు స్కూల్‌కు పలుమార్లు తనిఖీ నెపంతో వెళ్లేవాడు. సిబిఎస్ సిలబస్ చెప్పే ఆ ప్రైవేట్ స్కూల్లో మండల అధికారులు తనిఖీ చేసే అధికారం ఉండదు. అయినప్పటికీ తరచూ తనిఖీల నేపంతో వెళ్లి వచ్చేవాడు. సరైన వసతులు లేవని జిల్లా విద్యాశాఖ అధికారికి, ప్రభుత్వానికి స్కూల్‌పై నివేదిక ఇవ్వకుండా ఉండాలంటే తనకు రెండు లక్షల రూపాయలు ఇవ్వాలని స్కూల్ యాజమాన్యాన్ని డిమాండ్ చేశాడు.
రెండు లక్షల రూపాయల లంచం ఇవ్వడానికి ఇష్టపడని స్కూల్ యాజమాన్యం ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ సహకారంతో అనంతపురం పట్టణంలోని బళ్లారి బైపాస్ సమీపంలోని ఓ పెట్రోల్ బంకు వద్ద పాఠశాల యాజమాన్యంలోని ఒకరు రెండు లక్షల రూపాయలు తీసుకొని ఎంఈఓ చంద్రశేఖర్‌కు ఇవ్వడానికి వచ్చాడు. అదే సమయంలో ఏసీబీ అధికారులు కూడా అక్కడికి చేరుకొని ఎంఈఓ లంచం తీసుకుంటున్న సమయంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
అర్ధరాత్రి వరకు ఎంఈఓ చంద్రశేఖర్‌ను ఏసీబీ డిఎస్పి ప్రశాంతి, సిబ్బంది విచారణ చేపట్టారు. గతంలో కూడా ఎంఈఓ చంద్రశేఖర్ అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. గత ఎనిమిది సంవత్సరాలుగా కూడేరు మండల ఎంఈఓగా ఉన్న చంద్రశేఖర్ తనకు అనుకూలమైన కొంతమందితో కలిసి ఆ మండలంలోని స్కూల్స్‌లో దందా సాగించారు. అనవసరమైన తనిఖీలు చేస్తూ తనకు మీ స్కూల్ నుంచి ఫిర్యాదులు అందుతున్నాయని యాజమాన్యాలను బెదిరిస్తూ ఇలా డబ్బులు వసూలు చేస్తున్నాడని ఏసీబీ అధికారుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం.
Also Read: లెబనాన్‌లో ఒక్కసారిగా పేలిన పేజర్లతో విధ్వంసం- 8 మంది మృతి, వేలాది మందికి గాయాలు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)